దుబ్బాకలో కాంగ్రెస్ నేతలకు కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్న మంత్రి హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. తమ పార్టీ అభ్యర్థికి కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని విమర్శించారు. శుక్రవారం దుబ్బాక మండల కేంద్రంలో పీసీసీ ప్రచార కార్యదర్శి వెంకట నర్సింహారెడ్డి, సీనియర్ నేత మోహన్‌రావు రెండు వేల మంది కార్యకర్తలతో కలసి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే కాంగ్రెస్ నేతలకు ప్రజలు గుర్తుకొస్తారని విమర్శించారు. ‘వానాకాలం వస్తే ఉసిళ్లు వస్తాయి.. ఎన్నికలు వచ్చినప్పుడే గ్రామాలకు కాంగ్రెస్ నాయకులు వస్తారు’అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్‌ను విడిచి పెట్టి రారని, గత ఎన్నికల్లో ప్రచారం కోసం వచ్చిన వారు ఇప్పటి వరకు దుబ్బాక ప్రజల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల మధ్యనే ఉండే టీఆర్‌ఎస్ నాయకులు కావాలా..? హైదరాబాద్‌లో ఉండి ఎన్నికలప్పుడే వచ్చే కాంగ్రెస్ నాయకులు కావాలా? అని ప్రజలను అడిగారు. ముఖ్యమంత్రి ప్రతి అడుగు అన్నదాత సంక్షేమం కోసం వేస్తున్నారన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో రైతులు పండించిన ‘మక్క’లు మోరీలో వేయాల్సిన దుస్థితి వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment