సంచలనం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు
ఈటల రాజేందర్ విమర్శ
కంటోన్మెంట్ (హైదరాబాద్): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మతి భ్రమించిందని, సంచలనం కోసం ఏదిపడితే అదే మాట్లాడటం ఆయనకు అలవాటై పోయిందని బీజేపీ మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. బీజేపీ దేశానికి కేన్సర్‌లా పట్టుకుందన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి వంశా తిలక్, బీజేపీ సీనియర్ నేత మల్క కొమురయ్యలతో కలిసి మహేంద్రాహిల్స్‌లో విలేకరులతో మాట్లాడుతూ...వాస్తవానికి కాంగ్రెస్ పార్టీయే దేశానికి కేన్సర్‌లా తయారైందన్నారు. గత రెండు పర్యాయాలుగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయిన కాంగ్రెస్‌కు ఈసారి కూడా అదే పరిస్థితి తప్పదని ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. పాలించే సత్తా మాకే ఉందంటూ రేవంత్‌రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను అవమానించారని విమర్శించారు. డీకే అరుణ గెలిస్తే, ఈటల ఆధ్వర్యంలో పనిచేయాల్సి వస్తుందనడంలో రేవంత్ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు.
ప్రజల మద్దతు నాకే ఉంది
కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే కంటోన్మెంట్‌లో డబ్బు సంచులతో దిగిపోయిందని ఈటల ఆరోపించారు. అయినప్పటికీ మల్కాజ్‌గిరి ప్రజలు తనకే మద్దతు ఇస్తున్నారని అన్నారు. మోదీ సమర్థ పాలనతో దేశం ప్రపంచంలోనే 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్నారు. కంటోన్మెంట్ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. అయితే కంటోన్మెంట్ విలీనానికి వ్యతిరేకంగా బీజేపీకే చెందిన కంటోన్మెంట్ బోర్డు సభ్యుడు రామకృష్ణ రాసిన లేఖ ఫేక్ లెటర్ అని కొట్టిపారేశారు.
Comments
Please login to add a commentAdd a comment