
సాక్షి, వీణవంక: ‘నేను చిన్నవాడినైతే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు. హుజూరాబాద్‌లో దెబ్బకొడితే కేసీఆర్‌కు దిమ్మతిరగాలి’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా 12వ రోజు వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో పాదయాత్ర ప్రారంభమైంది. అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఈటలకు ఘన స్వాగతం పలికారు. పోతిరెడ్డిపల్లి, కొండపాక గ్రామాలలో ఆయన మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలను గంజిలెక్క తీసిన వ్యక్తి కేసీఆర్ అని, తాను రాజీనామా చేయడం వల్ల పెన్షన్లు, రేషన్‌కార్డులు, గొర్లు, దళిత బంధు వస్తున్నాయని అన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలలో దళిత బిడ్డలకు పెడుతున్నం భోజనానికి కూడా పైసలు ఇవ్వకపోవడంతోనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారని పేర్కొన్నారు. ‘ఇప్పుడు దళితబంధు అన్నడు.. తర్వాత బీసీల బంధ్ అంటడు.. ఎన్నికలు అయిన తర్వాత అన్నీ బంద్ అంటడు’ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గానికి వస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు వారి నియోజకవర్గంలో పనులు చేయడానికి చేతకాదు కానీ ఇక్కడకు వచ్చి అన్నీ ఇస్తామంటున్నారని మండిపడ్డారు.
బీజేపీలో చేరికలు
పోతిరెడ్డిపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, మడుగూరి సమ్మిరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, జయశ్రీ తదితరులు ఉన్నారు.
ఈటలకు స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment