సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. సమయం చూసి వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ అవుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి శనివారం పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్ తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. మాకెందుకు ఆ నిబంధన అడ్డు వచ్చింది? నేను జూబ్లీహిల్స్‌లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయి. కావాలనే నాకు టిక్కెట్ ఇవ్వలేదు. టికెట్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ, అనూహ్యంగా జాబితాలో నా పేరు లేకపోవడంతో నేనే షాక్ అయ్యాను. పార్టీకి ఎవరు ముఖ్యమో అది ముందు గమనించాలి. కార్యకర్తల సమావేశం తర్వాత నా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాను. నన్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. నేనే వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయి’’ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనుచరులతో భేటీ తర్వాతే పార్టీ మార్పు లేదా తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటానన్నారు.
ఇది కూడా చదవండి: రేవంత్‌కు కొత్త టెన్షన్.. 19 స్థానాల్లో ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment