అన్ని సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సరికొత్త సర్వే ఒకటి ట్రెండింగ్‌లో నిలిచింది. పీపుల్స్ పల్స్, ఏబీపీ-సీ ఓటర్, ఇండియా టుడే, టైమ్స్ నౌ.. వంటి ప్రముఖ సర్వే సంస్థల అంచనాలకు తలకిందులు చేస్తూ సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్(ఢిల్లీ యూనివర్సిటీ) భిన్నంగా ఎగ్జిట్ పోల్స్‌ను చేపట్టింది. తమ సర్వేలో ఆసక్తికర విషయాలను వెల‍్లడించింది.
గురువారం ఐదు రాష్ట్రాల(ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు వినూత‍్న ప్రచారాన్ని ప్రారంభించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఐదు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఎంతో పట్టుదలతో ప్రచారంలో దూసుకెళ్లగా.. ప్రతిపక్ష పార్టీలు సైతం బీజేపీకి చెక్ పెట్టేందుకు ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగాయి.
కాగా.. దేశంలోనే అత్యధిక సీట్లు కలిగిన ఉత్తర ప్రదేశ్‌లో కమలం మరోసారి వికసించనున్నట్లు ఎగ్జిట్‌పోల్ ఫలితాల్లో వెల్లడైంది. అన్నిఎగ్జిట్‌పోల్‌కు భిన్నంగా సెంటర్ ఫర్ గ్లోబల్ స్టడీస్(ఢిల్లీ యూనివర్సిటీ) చేపట్టిన సర్వే యూపీలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుపుతుందని తమ సర్వే ఫలితాల్లో వెల్లడించింది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు గాను 55.3 శాతం ఓటింగ్‌తో బీజేపీ 334 స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తుందని తెలిపింది. అలాగే.. సమాజ్‌వాదీ పార్టీ కూటమి 53 స్థానాల్లో, బీఎస్పీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధింస్తుందని అంచనా వేసింది. కాగా, ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎవరూ చేయని విధంగా దాదాపు 3 లక్షల మందిని తాము సంప్రదించినట్టు ఈ సర్వే నివేదికలో వారు పేర్కొన్నారు. అయితే, చాలా సర్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) వందకు పైగా స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేశాయి. కానీ, ఈ సర్వేలో మాత‍్రం ఎస్పీకి కేవలం 53 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment