సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెబుతున్న సెంటిమెంట్ డైలాగులు కడుపు నింపవని, హుజూరాబాద్ ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. గురువారం హుజూరాబాద్‌లోని రంగనాయకులగుట్ట వద్ద పాటిమీది ఆంజనేయస్వామి, జ్ఞాన సరస్వతీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెద్దమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చాలా సంతోషమని, దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, వచ్చే ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకుని బోనాలు సమర్పించుకుందామన్నారు. రూ.60 లక్షల నిధులతో బీటీ రోడ్డు వేయిస్తామని, చిలుకవాగు బ్రిడ్జి కోసం రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, హుజూరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు ఇచ్చినా గతంలో ఇక్కడ ఉన్న మంత్రి ఒక్క డబుల్ బెడ్రూం కూడా కట్టలేదని తెలిపారు.
ఒక్క ఇల్లు కట్టని ఈటలకు ఓటు వేస్తే ఎలా అభివృద్ధి చేస్తాడని ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల మీద బీజేపీ భారం వేస్తోందని, ధర లు పెంచే బీజేపీ కావాలో.. పేదలను ఆదుకునే టీఆర్‌ఎస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు. ముదిరాజ్‌లపై సీఎం కేసీఆర్‌కు అపారమైన ప్రేమ ఉందని, అడిగిందే తడవుగా రూ.2 కోట్ల నిధులను పెద్దమ్మ తల్లి గుడితోపాటు బ్రిడ్జి, రోడ్డు పనుల కోసం కేటాయించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment