వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా మాత్రమే కాదు, బీజేపీకి అత్యంత కీలక పరీక్షగా కూడా నిలుస్తున్న ఎన్నికలివి. ఎందుకంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో బీజేపీ బలం క్రమేపీ తగ్గుతున్న వేళ తిరిగి జాతీయ రాజకీయాలపై పట్టు సాధించాలంటే కమలదళానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. రానున్న రాజ్యసభ, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ వీటి ప్రభావం ఉంటుంది. అందుకే కమలనాథులకి అయిదు రాష్ట్రాల ఎన్నికలు కఠిన సవాలే విసురుతున్నాయ్..
అందరిలోనూ ఉత్కంఠని పెంచుతున్న ఉత్తరప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ఆయా రాష్ట్రాల్లో తన పట్టు నిలుపుకోవడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. పంజాబ్‌పై అంతగా ఆశలు పెట్టుకోని కమలనాథులు ఈసారి ఎక్కువగా యూపీపైనే దృష్టి సారించారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లోనైనా విజయం సాధించకపోతే జాతీయ రాజకీయాలపై బీజేపీ పట్టు తగ్గిపోయిందనే సంకేతం వెళుతుంది.
పట్టు కోల్పోతోందనే భావన ప్రబలితే... ప్రమాద ఘంటికలు మోగినట్లే లెక్క. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్‌తో వరుసగా రెండోసారి కేంద్రంలో విజయకేతనం ఎగురవేసిన బీజేపీ ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక చతికిలపడిపోతోంది. అందుకే ప్రస్తుతం జరగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ వ్యాప్తంగా వివిధ అంశాలను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.
19 రాజ్యసభ స్థానాలపై..
ఈ ఏడాది 73 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఏప్రిల్, జూన్‌లలో సభ్యులు పదవీ విరమణ చేస్తూ ఉండటంతో జూలైలో జరగాల్సిన రాష్ట్రపతి ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తారు. వాటిలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న యూపీ నుంచి 11, పంజాబ్‌లో 7, ఉత్తరాఖండ్‌లో 1 స్థానం, అంటే మొత్తంగా 19 మంది ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాల్సి ఉంది. ఇక మిగిలిన స్థానాలన్నీ ఎన్డీయేతర పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఖాళీ అవుతున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపోటముల ప్రభావం ఈ రాజ్యసభ ఎన్నికలపై పడుతుంది. పంజాబ్‌లో అధికారంపై పెద్దగా ఆశల్లేని బీజేపీ 11 మందిని రాజ్యసభకు ఎన్నుకునే యూపీపైనే తన దృష్టి అంతా కేంద్రీకరించింది.
రాష్ట్రపతి ఎన్నికలపై ..
ఈ ఏడాది జూలైతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసిపోతోంది. కొత్త రాష్ట్రపతిగా బీజేపీ అభ్యర్థి ఎన్నికవ్వాలంటే యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఆ పార్టీకి మెజార్టీ వచ్చి తీరాలి. పార్లమెంటు సభ్యులు, వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లో జనాభా ఎక్కువగా ఉండడంతో ఎలక్టోరల్ కాలేజీలో యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎక్కువ. పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, కేరళ, జార్ఖండ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేక జాతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో అందరూ కలసికట్టుగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎన్నికలయ్యే రాష్ట్రాల నుంచి రాజ్యసభకు కూడా ఈ సారి 19 మంది సభ్యులు ఎన్నికవుతారు. వారు కూడా రాష్ట్రపతి ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకే ఈసారి ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్‌గానే మారాయి.
వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ..
ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో విజయం సాధించడంపైనే బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎంతవరకు సత్తా చాటగలదన్నది ఆధారపడి ఉంటుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 301 లోక్‌సభ స్థానాలు సాధించగా.. ఇందులో 62 ఒక్క యూపీ నుంచే వచ్చాయి. అందుకే యూపీలో తన పట్టు నిలబెట్టుకోవడం బీజేపీకి అత్యావశ్యకం. కానీఈసారి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ –ఆర్‌ఎల్‌డీ కూటమి గట్టిగా సవాల్ విసురుతూ ఉండడంతో కమలనాథులు కలవరానికి గురవుతున్నారు.
తదుపరి నాయకత్వం పైనా...
బీజేపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరే నాయకుడికి లేదు. సమర్థుడైన నాయకుడిగా ఇప్పటికే ఆయన నిరూపించుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆయనకు ఎందరో అభిమానులు ఉన్నారు. అంతటి ఛరిష్మా కలిగిన మోదీకి వారసుడు ఎవరు అన్న ప్రశ్నకు బీజేపీ అభిమానులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరే చెబుతారు. భావిభారత ప్రధాని యోగియే అంటూ బీజేపీ శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. మోదీకి సరైన వారసుడిగా యోగి నిలవాలన్నా, జాతీయ రాజకీయాల్లో బీజేపీ పట్టును కొనసాగించాలన్నా ప్రస్తుత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యం.
2017 డిసెంబర్ నాటికి దేశంలో బీజేపీ, దాని మిత్రపక్ష పాలిత రాష్ట్రాలు, 2019 డిసెంబర్ నాటికి బీజేపీ పాలిత రాష్ట్రాలు తగ్గాయిలా..
రాష్ట్రాలపై పట్టు ...
2014లో నరేంద్ర మోదీ ప్రధాని పీఠం ఎక్కాక ఆయనకున్న క్రేజ్‌తో క్రమంగా రాష్ట్రాలపై కూడా బీజేపీ పట్టు బిగించింది. ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీ, అమిత్ షా కాంబినేషన్‌కు ఎదురే లేకుండా ఉండేది. 2018 సంవత్సరం మొదట్లో ఏకంగా 21 రాష్ట్రాల్లో బీజేపీ, లేదంటే ఆ పార్టీ మిత్రపక్షాల నేతృత్వంలో ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దేశ జనాభాలోని 70 శాతం మంది బీజేపీ పరిపాలన కిందకి వచ్చారు. కానీ అదే ఏడాది చివర్లో తాను అధికారంలో ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార వ్యతిరేకతను ఎదుర్కొని బీజేపీ ఓడిపోయింది.
ఆ ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. మోదీ తన ప్రభ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే, హరియాణాలో సీట్ల సంఖ్య తగ్గిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక శివసేనకు అప్పగించింది. 2021లో జరిగిన అసోంలో కూడా మెజార్టీ స్థానాల్లో కోత పడింది. మొత్తంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నప్పటికీ రాష్ట్రాల్లో కూడా తన హవా కొనసాగాలంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి గెలుపు తప్పనిసరిగా మారింది.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment