
కడప సెవెన్ రోడ్స్: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో సరికొత్త ఒరవడి సృష్టించారని వైఎస్సార్ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంఘిక సంక్షేమబోర్డు చైర్మన్ పులి సునీల్‌కుమార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎస్‌ఏ కరీముల్లా, కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత శ్రీరంజన్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.
మూడేళ్లలో 1.14 కోట్ల కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూర్చి దాదాపు రూ.2 లక్షల కోట్లను పారదర్శకంగా ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. కరోనాతో ఆర్థిక పరిస్థితి తలకిందులైనా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని చెప్పారు. విద్యారంగాన్ని తీర్చిదిద్ది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలతో మేలు చేస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారని తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
► బీసీ నేత కృష్ణయ్యకు మేం రాజ్యసభ టిక్కెట్ ఇస్తే తప్పుబడుతున్న బాబు గతంలో నిర్మలా సీతారామన్, సురేష్‌ప్రభుకు ఎలా ఇచ్చారు?
► కరువు ప్రాంతాలకు నీరందించేలా 40 టీఎంసీల సామర్థ్యంతో డిజైన్ చేసిన హంద్రీ–నీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించింది చంద్రబాబు కాదా? ఆయన హయాంలో నక్సలిజం పేట్రేగి పోయి శాంతి భద్రతలు క్షీణించాయి.
► ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క ఇల్లూ నిర్మించలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు మా వెంట వస్తే నిజం నిరూపిస్తాం.
► దివంగత వైఎస్సార్ హయాంలోనే హైదరాబాద్‌లో రింగ్‌రోడ్డు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఇతర అభివృద్ధి జరిగింది. అమరావతిలో చంద్రబాబు చేసిందేమీ లేదు.