సాక్షి, హైదరాబాద్: పదిరోజులుగా పడ్డ కష్టానికి అసలు పరీక్ష. గ్రేటర్ పోరులో ‘బిగ్ డే’... మంగళవారం పోలింగ్. గల్లీ పోరుకు ఢిల్లీ కదిలొచ్చింది. మాటలతో అగ్గి రాజుకుంది. బస్ ఏక్ ఔర్ ధక్కా... ఆఖరి ప్రయత్నం. ప్రచారంపై సమీక్ష, ఓట్ల లెక్కలు, ప్రత్యర్థులపై నిఘా, గల్లీల్లో గస్తీ... ఎక్కడా తగ్గొద్దనే ఆరాటం. బల్దియా కురుక్షేత్రంలో విజయం కోసం అన్ని ప్రధాన రాజకీయపక్షాలు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండటంతో ఓటర్లను తమవైపు ఆకట్టుకునేందుకు శతవిధాలా శ్రమిస్తున్నాయి. వీలైనన్ని రకాలుగా ప్రసన్నం చేసుకుంటున్నాయి.
ఆదివారం సాయంత్రానికి ప్రచారపర్వం ముగియడంతో అప్పటివరకు హీటెక్కిన గ్రేటర్ ఎన్నికల క్షేత్రంలో ఇప్పుడు చాప కింద నీరులా వ్యవహారాలు సాగుతున్నాయి. గత రెండురోజులుగా అన్ని పార్టీల ముఖ్య నాయకులు, డివిజన్లలో పోటీచేస్తున్న అభ్యర్థులు, స్థానిక శ్రేణులు బ్యాలెట్ బాక్సులు నింపుకునేందుకు తాయిలాలతో ఓటరు ఇంటిబాట పట్టాయి. ఈ క్రమంలో అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు, డబ్బు, మద్యం పంపిణీపై ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అధికారికంగా ప్రచారం ముగిసినా సోషల్‌మీడియాలో మాత్రం ప్రచారం ఆగలేదు. ఇంచార్జులతో సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలు డివిజన్ల వారీగా గెలుపు తీరాలను చేరే దారులు వెతుక్కుంటున్నాయి.
ప్రజల వద్దకు వెళ్లగలిగామా?
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రస్థాయి ఎన్నికలను తలపించిన గ్రేటర్ ప్రచారపర్వంపై అన్ని పార్టీలు సమీక్షలు పూర్తి చేసుకున్నాయి. డివిజన్ల వారీగా జరిగిన ప్రచార తీరుతెన్నులపై ఆయా డివిజన్ల ఇన్‌చార్జులు, అభ్యర్థులతో కసరత్తులు జరిపాయి. టీఆర్‌ఎస్ విషయానికి వస్తే డివిజన్ ఇంచార్జులతో పాటు నగర మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సేకరించారు. గ్రేటర్ ఎన్నికల సమన్వయకర్తలతో కలిసి క్షేత్రస్థాయి నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి సోమవారం పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు నివేదించారు.
బీజేపీ కూడా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కీలక సమీక్ష జరిపింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్య నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణలు డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితిని అంచనా వేశారు. బండి సంజయ్ అయితే సోమవారం కూడా బిజీబిజీగా గడిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన ఆయన సనత్‌నగర్ నుంచి నాంపల్లి వరకు మెట్రోరైలులో Ðవెళ్లారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని గోశాలను, గౌలిగూడ గురుద్వారను సందర్శించి రోజంతా వార్తల్లోనే ఉండే ప్రయత్నం చేశారు.
కాంగ్రెస్ విషయానికి వస్తే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డిలు కూడా డివిజన్ల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించారు. గట్టిపోటీ ఇచ్చే స్థానాలను గుర్తించి వాటిపై దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దారుస్సలాం కేంద్రంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, అక్బరుద్దీన్‌లు తాము పోటీ చేస్తున్న స్థానాల్లోపరిస్థితిపై పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. పాతబస్తీలో బీజేపీ ప్రభావం చూపే అవకాశాలతో పాటు ఇతర పార్టీల నుంచి ఎదురవుతున్న పోటీపై చర్చించి పార్టీ నేతలకు సూచనలిచ్చారు. ప్రధానపార్టీలు క్షేత్రస్థాయి నివేదికలు, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించాయి. ముఖ్యంగా సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలపై దృష్టి సారించారు.
పోలింగ్ ముగిసేవరకు... పారాహుషార్
గ్రేటర్ విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు దాదాపు ఒకే వ్యూహాన్ని అనుసరించినట్టు అర్థమవుతోంది. పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలిచేవి, ఇతర పార్టీల నుంచి గట్టిపోటీ ఎదురవుతాయనే అంచనాకు వచ్చిన డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఆయా డివిజన్లలో పరిస్థితులను బట్టి ఏం చేయాలన్న దానిపై స్థానిక నాయకత్వానికి పలు సూచనలిచ్చాయి. ముఖ్యంగా మూడు కేటగిరీల్లో డివిజన్లను విభజించిన రాజకీయ పార్టీలు... విజయావకాశాలున్న ఏ, బీ కేటగిరిల్లో పోలింగ్ రోజున అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టువీడొద్దని, పోలింగ్ ముగిసేంతవరకు ఇంచార్జులు, ఇతర నాయకులు డివిజన్లలోనే ఉండి సమన్వయంతో ముందుకెళ్లాలని, చివరి ఓటు వరకు పార్టీకి పడేలా పనిచేయాలని దిశానిర్దేశం చేశాయి.
ఏమాత్రం ఏమరుపాటు తగదని హెచ్చరించాయి. ఎంఐఎం కూడా పాతబస్తీలో పట్టుజారకుండా తమ వ్యూహాలకు చివరినిమిషంలో పదును పెట్టింది. టీఆర్‌ఎస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లో ఉండి మరీ తమకు అప్పగించిన డివిజన్‌లలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అభ్యర్థులు అనుసరిస్తున్న ఎత్తుగడలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పట్టున్న కాలనీలు, స్లమ్‌లపై ప్రత్యేక దృష్టి
కాలనీలు, మురికివాడల వారీగా పార్టీకి అనుకూలంగా ఉండే వర్గాలు, ఓటర్లపై అన్ని పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి. చివరి నిముషంలో వీరి ఓట్లు చేజారకుండా ఉండేందుకు వివిధ పద్దతుల్లో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తటస్థ ఓటర్లనూ మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. అపార్ట్‌మెంట్లు, కాలనీల వారీ సమావేశాలతో గంపగుత్తగా ఓట్లు రాబట్టుకునే ప్రణాళికలను అమలుపరిచాయి. ఇక కొన్ని పార్టీల నేతలు అయితే కార్తీక భోజనాల పేరుతో కమ్యూనిటీ ప్రచారంలో పాల్గొన్నారు కూడా. బూత్‌ల వారీగా పోలింగ్ ఏజెంట్ల నియామకం పూర్తిచేశారు. తమకు అనుకూలంగా ఉంటారనే ఓటర్లను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేసి... గల్లీల వారీగా బాధ్యతలు అప్పగించారు. మొత్తంమీద ఈసారి బల్దియా పోరులో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు చివరి క్షణం వరకు పట్టువీడని పోరాటం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment