అదే తీరు.. అత్తెసరు | GHMC Elections 2020: Poor Response From Voters | Sakshi
Sakshi News home page

అదే తీరు.. అత్తెసరు

Published Wed, Dec 2 2020 4:06 AM | Last Updated on Wed, Dec 2 2020 4:53 AM

GHMC Elections 2020: Poor Response From Voters - Sakshi

మంగళవారం ఓటర్లు లేక వెలవెలబోతున్న శేరిలింగపల్లిలోని ఓ పోలింగ్‌ కేంద్రం..

సాక్షి, హైదరాబాద్‌: ఓటుపై కరోనా కాటు పడింది. గ్రేటర్‌ సమరంలో జనం భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. అధికార యంత్రాంగం తీసుకున్న కోవిడ్‌ జాగ్రత్తలు... ఓటర్లలో విశ్వాసాన్ని పెంచలేకపోయాయి. ఎందుకు వెళ్లడం, అంటించుకోవడం... లేని పోని ‘రిస్క్‌’మనకొద్దు అనుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌కు భయపడి.. ‘సేఫ్‌’జోన్‌లో ఉండిపోయారు. జనం గుమిగూడే చొటుకు వెళ్లడానికి జంకారు. ఓటేయడానికి ముందుకు రాలేదు. వయోవృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారైతే అసలు పోలింగ్‌ కేంద్రాల వైపు చూడలేదు. ఫలితంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం అనుకున్నంతగా పెరగలేదు. 

2016లో గ్రేటర్‌లో 45.29% పోలింగ్‌ నమోదు కాగా.. ఇప్పుడు అదే అత్తెసరు పోలింగ్‌ నమోదైంది. నిజానికి ఈసారి పోలింగ్‌ పెరుగుతుందని అందరూ ఆశించారు. గ్రేటర్‌లో హోరాహోరీగా ప్రచారం జరగడం.. పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. చతురంగ బలాలను మోహరించి సర్వశక్తులూ ఒడ్డడం.. జాతీయస్థాయి నేతలు, కేంద్రమంత్రులు, సీఎంలు రంగంలోకి దిగడం వంటి పరిణామాలతో.. ఓట్లు పోటెత్తుతాయని భావించారు. కానీ కరోనా దెబ్బేసింది. 

2016 పోలింగ్‌ కంటే కేవలం 0.42%మాత్రమే అధికంగా 45.71% పోలింగ్‌ నమోదైంది. సాధారణంగా సంపన్నవర్గాలు ఓటేయడానికి ఆసక్తి చూపవు. ఈసారి అందుకు భిన్నంగా హైదరాబాద్‌లో అత్యధికంగా ఉండే బస్తీవాసులు, నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా మొహం చాటేశారు. టెకీలూ దూరంగా ఉన్నారు. ప్రధాన కారణం కరోనా భయం. వరుస సెలవులు, వర్క్‌ ఫ్రం హోం వంటివి కూడా ఓటింగ్‌శాతం తగ్గిపోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము ఎంతగా ప్రయత్నం చేసినా జనం ఇళ్లు విడిచి బయటకురాకపోవడంతో నాయకులు తలలుపట్టుకుంటున్నారు. పడిన ఓట్లు ఎవరికనేది... ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నా లోలోపల ఆందోళన చెందుతున్నారు.
 
కరోనా... డర్‌: బ్యాలెట్‌ పేపర్‌తో ఓటింగ్‌ కావడంతో పలుచోట్ల చేతులతో తాకాల్సి ఉంటుంది. బ్యాలెట్‌పై వేసే ఎన్నికల ముద్రను ఓట్లు వేసేందుకు వచ్చే వారంతా చేతులతో పట్టుకుంటారని, దాంతో కరోనా వస్తుందేమోనని అనేక మంది భయపడ్డారు. పోలింగ్‌బూత్‌ల వద్దకు ఎక్కువమంది జనం వస్తారని, కరోనా వ్యాప్తికి ఆస్కారమున్న చోటికి వెళ్లడం శ్రేయస్కరం కాదని భావించినట్లు కొంతమంది చెప్పుకొచ్చారు. కోవిడ్‌–19 మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి చాలామంది వయోవృద్ధులు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. 

అత్యవసరమైతే తప్ప బయటకు రావట్లేదు. ఇంట్లో కూడా మిగిలిన కుటుంబ సభ్యులతో దూరం పాటిస్తున్నారు. ఓటేసేందుకు వేళ్తే కరోనా సోకే ప్రమాదముందని భయంతో వయోవృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎక్కడా ఓటర్లు బారులు తీరి కనిపించకపోవడానికి ప్రధాన కారణం కరోనా భయమే అని చర్చ జరుగుతోంది. ప్రచారంలో నువ్వానేనా అన్నట్లు మాటల యుద్దం చేసిన నాయకులు ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించడంలో విఫలమయ్యారు. 

కరోనా వల్ల హైదరాబాద్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారంతా గ్రామాల్లోనే ఉండిపోయారు. దీనికి తోడు వరుసగా మూడు రోజులు సెలవులు రావడం సైతం జీహెచ్‌ఎంసీ పోలింగ్‌ శాతం తగ్గడానికి కారణమైంది. గత నెల 29న ఆదివారం, 30న గురునానక్‌ జయంతి,, ఈ నెల 1న (మంగళవారం) జీహెచ్‌ఎంసీ ఎన్నికల రూపంలో వరుసగా మూడు రోజులు (టెకీలకు అయితే శనివారంతో కలిపి నాలుగు రోజులు) సెలవులు లభించడంతో చాలామంది నగర ప్రజలు పల్లెలకు వెళ్లిపోయారు. 

వర్క్‌ఫ్రం హోం... నగరానికి దూరం
నగరంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అధికంగా ఉండే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, సనత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఓటింగ్‌శాతం భారీగా పడిపోవడానికి కారణం వర్క్‌ఫ్రం హోం అని రాజకీయ నాయకులు వాపోతున్నారు. ఐటీ రంగంలో పనిచేసే 5.5 లక్షల మందిలో దాదాపు లక్ష మందికి ఓటు హక్కు ఉన్నా.. వారిలో 90 శాతం మంది గత కొన్ని నెలలుగా వర్క్‌ ఫ్రం హోం చేస్తూ తమ స్వస్థలాల్లోనే ఉండిపోయారు. కార్తీక పౌర్ణమికి సోమవారం ఉపవాసాలతోనే గడిపి.. మరునాడు నగరానికి వచ్చి ఓటేసే చొరవ తీసుకోలేకపోయారు. వర్క్‌ఫ్రం హోం విధానం తమ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ప్రభావితం చేయలేకపోయిన హామీలు
రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, భావోద్వేగ ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేయలేకపోయాయి. ఈసారి పార్టీలు పోటీపడి ప్రజాకర్షక పథకాలు ప్రకటించాయి. వరదసాయం టీఆర్‌ఎస్‌ రూ.10 వేలు ఇస్తే... బీజేపీ రూ.25 వేలు, కాంగ్రెస్‌ రూ.50వేలు ఇస్తామన్నాయి. ఇందులో బీజేపీ ఓ అడుగు ముందుకేసి వరదల్లో బైకు, కారు కొట్టుకుపోతే... కొత్తవి ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవేవీ జనాన్ని ఆకట్టుకోలేకపోయాయని పోలింగ్‌ శాతాన్ని బట్టి స్పష్టమవుతోంది. 

కానుకలు పంచినా.. కనికరించలే!
పలు పార్టీలు సోమవారం ఓటర్లను ప్రసన్నం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాయి. ఓటరు స్లిప్పుల రూపంలో ఇంటింటికీ కానుకలు, చీరలు, నగదు, మద్యం బాటిళ్లు విపరీతంగా పంచారు. అంతేకాకుండా కార్తీక భోజనాలు, బర్త్‌డేలు, గెట్‌ టు గెదర్‌ల పేరుతో భారీ విందులు ఏర్పాటు చేశారు. వీటికి హాజరైన వారికి రిటర్న్‌ గిఫ్ట్‌ల రూపంలో విలువైన కానుకలు అందజేశారు. ఇవి తీసుకున్న ఓటర్లలో సగం మందికి పైగా నేతలకు హ్యాండిచ్చారు. ఇంటి నుంచి బయటికి రాకుండా నేతలకు ఊహించని రిటర్న్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. రూ.లక్షలు పోసి ఓట్లను కొందామనుకుంటే.. ఈ స్థాయిలో ఓటర్ల నుంచి పరాభవం ఎదురవుతుందని ఊహించలేదని పలువురు వాపోతున్నారు. 

సోషల్‌ మీడియాలోనే చైతన్యం
ఎవరు గెలిచినా ఏం లాభం .. అంతా ఒక తాను ముక్కలేనని సంపన్నవర్గాలతో పాటు విద్యావంతుల్లో సైతం ఓ అభిప్రాయం ఉంది. నగరంలో రోడ్ల దుస్థితి, రోడ్లపై డ్రైనేజీ ప్రవాహం, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం, నీటి సరఫరా బంద్‌... సమస్య ఏదైనా సరే వీరు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ ఫిర్యాదు చేయకుండా కేవలం సోషల్‌మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటారు. వీరు సామాజిక మాధ్యమాల్లో... పోస్టింగుల్లో చూపే చైతన్యం ఓటుకు వచ్చేసరికి చూపలేదని చర్చ జరుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement