పీఠం.. కాసింత దూరం | GHMC Election Results: Exit Polls Results Upside Down TRS Won 55 | Sakshi
Sakshi News home page

పీఠం.. కాసింత దూరం

Published Sat, Dec 5 2020 1:26 AM | Last Updated on Sat, Dec 5 2020 12:29 PM

GHMC Election Results: Exit Polls Results Upside Down TRS Won 55 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సంఖ్యాపరంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌.. దాదాపు మూడింట ఒక వంతు ఫలితాన్ని మాత్రమే సాధించింది. గ్రేటర్‌ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాన్ని సాధించ లేక పోయామని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటిం చారు. గత నెల 17న గ్రేటర్‌ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత ప్రధాన రాజకీయ పక్షాలతో పోలిస్తే శరవేగంగా ఎన్నికల క్షేత్రంలోకి అడుగు పెట్టినా ఫలితాల సాధనలో వెనుక బడటానికి దారితీసిన పరిస్థితులను టీఆర్‌ఎస్‌ విశ్లేషిస్తోంది. 2016లో సాధించిన ఫలితంతో పోలిస్తే పార్టీ గెలిచే డివిజన్ల సంఖ్య తగ్గుతుందని అంతర్గతంగా అంచనా వేయగా, ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా దాదాపు అదే ఫలితాన్ని సూచించాయి. అయితే శుక్రవారం వెలువడిన గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అంచనా కంటే తక్కువ డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవడంపై ఆ పార్టీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.

దుబ్బాక మొదలుకుని..
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన పక్షం రోజుల్లోనే గ్రేటర్‌ షెడ్యూల్‌ వెలువడటం గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ నష్టానికి బాటలు వేసిందనే అభిప్రాయం ఆ పార్టీలో కన్పిస్తోంది. అభివృద్ది ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే టీఆర్‌ఎస్‌ వ్యూహానికి దుబ్బాక గెలుపుతో జోష్‌ మీదున్న బీజేపీ అడ్డుకట్ట వేసిందనే భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌కు మితృత్వం ఉందంటూ బీజేపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం, నగర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికను ప్రజలకు     మిగతా 2వ పేజీలో u

వివరించలేకపోవడం వంటి కారణాలు టీఆర్‌ఎస్‌ను దెబ్బతీశాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో సంభవించిన వర్షాలు, వరదల మూలంగా నగరంలోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బాధితులను అదుకునేందుకు రూ.10 వేల నగదు పంపిణీ లబ్ధిదారులు అందరికీ చేరకపోవడం, పంపిణీలో అవకతవకలు, వరద సాయం పంపిణీ అర్ధంతరంగా నిలిపేయడం వంటి అంశాలు ప్రభావితం చేశాయి. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు టీఆర్‌ఎస్‌ ప్రకటించిన ఉచిత తాగునీరు సరఫరా వంటి హామీలు కూడా ప్రభావితం చేయలేకపోయాయి. ఆస్తి పన్ను తగ్గింపు వంటి వరాలు కూడా ఓటర్లను ఆకట్టుకోలేక పోయాయి.

పార్టీ యంత్రాంగాన్ని మోహరించినా..
మేయర్‌ పీఠాన్ని సొంతంగా గెలుచుకుంటామనే ధీమాతో గ్రేటర్‌ పరిధిలోని 150 డివిజన్లలోనూ అభ్యర్థులను నిలబెట్టిన టీఆర్‌ఎస్‌.. 55 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2016 గ్రేటర్‌ ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ కనీసం 75 నుంచి 80 డివిజన్లు సాధిస్తామనే ధీమా వ్యక్తం చేసింది. రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్, జెడ్పీ చైర్మన్లు కలుపుకుని సుమారు 180 మందికి ప్రచార బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది కార్యకర్తలు గ్రేటర్‌ పరిధిలో మకాం వేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రచార సారథ్యం వహించగా, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ గత నెల 28న ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ జాతీయ నాయకత్వం హైదరాబాద్‌కు బారులు తీరడంతో టీఆర్‌ఎస్‌ భారీ బలగాన్ని మోహరించి ఓటర్లను అకట్టుకోవాలనే వ్యూహం ఫలితం సాధించలేక పోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement