అసలే ఎన్నికల సమయం. ప్రజలతో భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించడం ద్వారా ప్రజలంతా తమవైపు ఉన్నారన్న సంకేతాలు పంపించడమే వాటి ఉద్దేశం. ఇందుకోసం కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. అయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట ముఖ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధి. అలాంటిదే పరేడ్ గ్రౌండ్‌లో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది.
అయితే సదరు సభ నిర్వహణకు పార్టీ పేరుమీద కాకుండా.. ఓ సంఘం పేరిట బహిరంగసభ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ బహిరంగసభకు కీలక నేత ముఖ్య ప్రసంగం ఉంటుందని, తద్వారా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేలా సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడే తిరకాసు వచ్చిపడింది. అనుమతి తీసుకున్నది ఓ కులసంఘం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సభకు అనుమతినిచ్చారు. అయితే సభలో ఎక్కడా పార్టీ జెండాలు ఉండరాదని మౌఖికంగా ఆదేశించారట. లేదు..
కూడదు.. బహిరంగసభలో పార్టీ జెండాలు పెడితే.. సంబంధిత ఖర్చులో సగం వరకు స్థానిక అభ్యర్థి లెక్కలో వేస్తామని హెచ్చరించారట... ఏమి చేయాలో పాలుపోని నాయకులకు ఎన్నికల బహిరంగసభ రద్దుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే అదే సమయానికి వాతావరణశాఖ కూడా వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఇచ్చిన హెచ్చరిక కూడా వీరికి కలిసి వచ్చిందంటున్నారు.
గతంలో ఇదే ప్రాంతంలో ఓ జాతీయ పార్టీ కూడా ఓ కులసంఘానికి సంబంధించిన బహిరంగసభ నిర్వహించింది. అది కూడా ఇంచుమించుగా రాజకీయ వేదికగానే ఉపయోగించుకుంది. కానీ అక్కడ ఎక్కడా తన పార్టీ జెండాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త పడింది. ఆ సభ ద్వారా కావాల్సినంత ప్రయోజనాన్ని ఎన్నికల్లో పొందడానికి ప్రయత్నం చేసింది. ఆ కుల సంఘం కూడా ఎన్నికల ప్రచారంలో ఆ జాతీయ పార్టీకి పూర్తి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇది ఎన్నికల కాలం మహిమ.
Comments
Please login to add a commentAdd a comment