కార్యక్రమంలో మాట్లాడుతున్న కవిత
సాక్షి, హైదరాబాద్: జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు బీసీ కుల గణన చేపట్టాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో అంతర్భాగంగా ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా కల్పించాలని, కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన ‘పీడిత్ అధికార్ యాత్ర’ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓబీసీల అనైక్యతను ఆసరాగా చేసుకుని ప్రభుత్వాలు వారికి దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ఓబీసీలకు న్యాయం చేయలేదు
అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు న్యాయం చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తోందని కవిత ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య తక్కువగా ఉండటాన్ని ప్రశ్నించారు. దామోదర్ సింగ్ యాదవ్ ప్రారంభించిన పీడిత్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం ముందుకుసాగాలని కవిత పిలుపునిచ్చారు. కేసీఆర్ స్పూర్తితోనే ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment