కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కుట్రలు: మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నా, రైతులు రుణమాఫీ కోసం ధర్నాలు చేస్తున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం.. డైవర్షన్ పాలిటిక్స్‌తో మైండ్‌గేమ్ ఆడుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ‘హైడ్రా’పేరుతో డ్రామా నడుపుతోందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్‌గా రాజకీయ కుట్రలకు తెరలేపిందని విమర్శించారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యాతో ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఇబ్బంది పెట్టేలా రాజకీయం నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కండువా కప్పుకోకపోతే ఇబ్బంది పెడతాం.. అన్నట్లుగా రేవంత్ తీరు ఉందని మండిపడ్డారు. పటాన్‌చెరు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టారని, రూ.300 కోట్ల ఫైన్ వేసి నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారని అన్నారు. కాంగ్రెస్ కండువా కప్పగానే మైనింగ్ కేసు అటకెక్కిందని, ఇప్పుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కూడా ఇబ్బందిపెట్టేలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లాపై 6 కేసులు పెట్టారని, ఆయన భార్య, పిల్లలపై కూడా కేసులు పెట్టారని విమర్శించారు. అధికారం ఉందని రాత్రికి రాత్రే కూల్చడాలు సరికాదన్నారు. రాజకీయ కక్షలను విద్యాసంస్థలు, ఆసుపత్రులపై రుద్దవద్దని పేర్కొన్నారు. మంత్రులు రుణమాఫీపై కుంటిసాకులు చెపుతున్నారని, రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయమంటే స్పందించడం లేదని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లో రూ.65 వేల కోట్ల అప్పు చేసిందని, అంటే నెలకు రూ.8,125 కోట్ల చొప్పున వచ్చే ఐదేళ్లలో చేయబోయే అప్పు రూ.4.87 లక్షల కోట్లు అని లెక్కించారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలలో రూ.4,26,000 కోట్ల అప్పు మాత్రమే చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment