సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో డిపాజిట్లు రాని బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటుందని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. కర్ణాటకలో కషాయ పార్టీకి ఓటమి తప్పదని అమిత్ షా మాటలతో అర్థమైందన్నారు. ఎవడు ఎన్ని ట్రిక్‌లు చేసిన తెలంగాణలో బీర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మంత్రి హరీష్ రావు సోమవారం శంకుస్థాపనలు చేశారు.
అనంతరం మండల కేంద్రంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు తెలంగాణ కరువు కాటకాలకు నిలయంగా ఉండేదని, నేడు కరువు అనే పదాన్ని డిక్షనరీ నుండి తొలగించిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు కేసీఆర్ అండగా ఉంటారని తెలిపారు.
చదవండి: ‘రిజర్వేషన్లు తొలగించడం అమిత్ షా తరం కాదు’
రాష్ట్రంలో వరిసాగు 14 లక్షల నుంచి 56 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. దీనికి రైతు బీమా, సాగునీరు, 24 గంటలు కరెంటు తదితర పథకాలే కారణమన్నారు. పేపర్ లీకేజ్ కేసులో ఇరుకున్న దొంగలను, బెయిల్ మీద వచ్చిన వాళ్ళను పక్కన పెట్టుకొని దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలే హైకమాండ్‌గా పనిచేసే పార్టీ బిఅర్ఎస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే లంచాలు, అవినీతి, పదవులు కోసం ఆలోచించే పార్టీ అని దుయ్యబట్టారు.
అంతకముందు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ... ఒక్క మెడికల్ కళాశాల ఇవ్వకుండా అబద్ధాలు ఆడుతూ కేంద్రం వివక్ష చూపుతుంది. ముస్లింలకు ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేస్తామని రెచ్చగొట్టేలా అమిత్‌షా మాట్లాడుతున్నారు. ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించి జిల్లాలో 10కి 10 స్థానాలను గెలిపించాలి’ అని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment