సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ప్రాజెక్టుల శంకుస్థాపన కోసం వచ్చినట్లు లేదని.. తెలంగాణపై విషం కక్కేందుకే వచ్చినట్లు ఉందని మండిపడ్డారు. ప్రతి మాట సత్యదూరమని, ప్రధానిగా ఇన్ని అబద్ధాలు చెప్పడం మోదీకే చెల్లిందని విమర్శించారు. రైతు బంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని.. కానీ పీఎం కిసాన్ వల్లే మొదటిసారి రైతులకి లబ్ది అని చెప్పుకోవడం సిగ్గు చేటు అని విమర్శించారు. రైతు బంధుతో పోల్చితే పీఏం కిసాన్ సాయమెంత? అని ప్రశ్నించారు.
‘తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఆసరా పెన్షన్, రైతు బంధు వంటివి నేరుగా లబ్ది దారుల ఖాతాలో జమ అవుతున్నాయి. తన వల్లే డీబీటీ మొదలైనట్టు అనడం పచ్చి అబద్దం. ఇందులో గొప్ప చెప్పుకోవాల్సింది ఏముంది?. వ్యవసాయానికి, పరిశ్రమలకు చేయూత అని చెప్పడం పూర్తి అవాస్తవం. ITIRను బెంగళూరుకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన వెంటనే గుజరాత్‌లో అర్బిట్రేషన్ సెంటర్ పెట్టారు. తెలంగాణ ధాన్యాన్ని కొనకుండా రైతుల కంట కన్నీరు పెట్టించారు. ఇవన్నీ చేసింది మోదీ ప్రభుత్వం కాదా?
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందించడం లేదని మోదీ చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఈ పరిస్థితి రివర్స్‌గాగా ఉంది. రాష్ట్రానికి రావాల్సిన గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, జాతీయ హోదా వంటివి ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ఎలాంటి సహకారం అందించడం లేదు’ అని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.
తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు: ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్‌రెడ్డి
‘తెలంగాణ సీఎంకు సరైన సమాచారం ఇవ్వకుండా పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల సభను ఎన్నికల ప్రచార సభగా ప్రధాని మోదీ మార్చారు. ప్రధాని తన ప్రసంగంలో డొల్ల మాటలు మాట్లాడారు. తెలంగాణకు తొమ్మిది ఏళ్లుగా మోదీ ఎలాంటి సహాయం చేయలేదు. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చలేదు. ఎయిమ్స్ ప్రకటన చేసిన నాలుగేళ్ళ తర్వాత మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. తెలంగాణకు మోదీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు
దేశంలో 150 మెడికల్ కాలేజీలు ఇచ్చిన మోదీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. మెట్రోకు కావాల్సిన నిధులు ఎవరు ఇచ్చారో తెలంగాణ ప్రజలకు తెలుసు. మెట్రో తమ ఘనతగా మోదీ గొప్పలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ 28 ప్రాజెక్టులు అడిగితే కేంద్రం ఇచ్చింది కేవలం మూడు ,నాలుగు మాత్రమే. టోల్ రూపంలో 9 వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు చెల్లించారు. మోడీ తన ప్రసంగంలో మొత్తం అబద్దాలు మాట్లాడారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వలేదు. అప్పు అడిగినా ఇవ్వలేదు’ అని ఎమ్మెల్సీ మండపడ్డారు.
అవార్డులు ఎందుకు ఇస్తోంది: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయారని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ విమర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలపై మంత్రులు విరుచుకుపడ్డారు. గతంలో కేసీఆర్ పాలనను ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోదీకి ఏమీ చేత కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందని ప్రశ్నించారు.
అభివృద్ధి తట్టుకోలేకే విమర్శలు: మంత్రి జగదీశ్ రెడ్డి
రైలు ప్రారంభం పేరుతో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ.. ఈ ప్రాంతంపై మరోసారి విషం చిమ్మారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. ఆ ప్రంసంగం ఆసాంతం మోసపూరితంగా సాగిందని విమర్శించారు.
మోదీ ముఖంలో కేసీఆర్ భయం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు మోదీ. భయంతో మోదీ పూర్తి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడారు. ప్రధాని తన ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందనడం విడ్డూరంగా ఉంది. ఎందులో అడ్డుకున్నాం.. కేంద్రం పసుపు బోర్డు ఇస్తానంటే అడ్డుకున్నామా?. ‘కేసీఆర్‌ది కుటుంబ పాలన కానేకాదు. ఆయనది ఉద్యమ నేపథ్య కుటుంబం. కేసీఆర్‌కు ప్రజల ఆమోదం ఉంది.
-మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment