ఒకరేమో ఇతర పార్టీలతో పొత్తులుంటేనే పార్టీని అధికారంలోకి తీసుకురాగల గొప్ప నాయకుడు. ఇంకొకరేమో మరో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే పార్టీ పెట్టిన మహా నాయకుడు. వారే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ ఇద్దరు నాయకులు మరోసారి పొత్తుల కోసం రెడీ అయిపోయారు. 2014 ఎన్నికల నుంచి ఒకరికి మరొకరు ప్రత్యక్షంగా.. పరోక్షంగా సహకరించుకుంటున్నారు.
కొన్నాళ్లు తెర వెనక, ఇప్పుడు ప్రత్యక్షంగా
మూడు నెలల కిందట విజయవాడ నోవాటెల్ హోటల్లో చంద్రబాబు, పవన్‌లు కలిసినపుడు వారి మధ్య పొత్తుల ప్రస్తావన వచ్చింది. హైదరాబాద్ సమావేశంలో పొత్తులపై పూర్తిగా ఒక అవగాహనకు వచ్చారు. ఇద్దరు నేతలకు తమపై తమకు నమ్మకం లేక నాకు నువ్వు, నీకు నేను అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏనాడు సొంతంగా బలపడలేదు, ఎన్నికల్లో గెలవలేదు.
2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఓటమి చవిచూశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరగదీసేస్తామని ప్రగల్భాలు పలికిన జనసేన కేవలం మాటలకే పరిమితమైంది. అసలు 9 ఏళ్ళు కావస్తున్నా జనసేన పార్టీకి రాష్ట్రంలో నిర్మాణమే లేదంటే.. ఇక ఆ పార్టీ గురించి వేరే చెప్పాలా? చంద్రబాబు విషయానికి వస్తే 1994 ఎన్టీఆర్ గెలిచిన తర్వాత ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీ పగ్గాలను, ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టారు..
క్రెడిట్ కేరాఫ్ పక్క పార్టీ
1999 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే ఓటమి తప్పదని భావించిన చంద్రబాబు బిజెపిని నమ్ముకున్నారు. కార్గిల్ విజయంతో దేశవ్యాప్తంగా మంచి ఊపు మీద ఉన్న బిజెపితో పొత్తు పెట్టుకుని ఏపీలో విజయం సాధించారు. ఒంటరిగా ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబుకు లేదు. మళ్లీ 2014 ఎన్నికల్లో కూడా ఒంటరిగా వెళ్తే పరాజయం తప్పదని భావించి మోడీకి ఉన్న ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని పొత్తు కోసం బిజెపి నేతల ఇళ్ల చుట్టూ తిరిగారు. వారి కాళ్లా వేళ్లా పడి బీజేపీతో పొత్తు కుదుర్చుకొని 2014 ఎన్నికల్లో ఎన్నికల్లో అతి కష్టం మీద గెలుపొందారు.
ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమికి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనే లక్ష్యంతో బిఎస్పి, వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కల్యాణ్. పైకి పొత్తు పెట్టుకున్నట్లు డ్రామాలాడినా అంతర్గతంగా టిడిపికి పవన్ కళ్యాణ్ సహకరించారు. చంద్రబాబు చెప్పిన వారికే జనసేన సీట్లు కేటాయించారు. ఇన్ని తిప్పలు పడి చివరికి దత్త తండ్రి, దత్త పుత్రుడు బొక్క బోర్లా పడ్డారు.
స్థానిక సంస్థల తర్వాత తేటతెల్లం
మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్‌కు వారి మీద వారికి నమ్మకం పోయింది. తమను ప్రజలు ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ లేక ఇద్దరూ మరోసారి పొత్తులను నమ్ముకుంటున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దెబ్బకు తెలుగుదేశం పార్టీ టిడిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుదేలు అయింది. కేవలం 23 ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. అదే ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన జనసేన ఒకే సీటుతో సరిపెట్టుకుంది.
తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు నామరూపాలు లేకుండా పోయాయి. వైఎస్సార్సీపీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకున్నా ఆ పొత్తును ప్రజలు తిరస్కరించారు. రోజురోజుకీ రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో బలహీనపడుతున్నాయే తప్ప ఎక్కడ బలపడిన దాఖలాలు కనిపించడం లేదు. ఇద్దరం ఏకమైతేనే వచ్చే ఎన్నికల్లో వైయస్సార్సీపీకి కనీస పోటీ ఇవ్వగలమని భావించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి పొత్తులకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు బిజెపితో కాపురం చేస్తూనే.. మరో వైపు టీడీపీతో సహజీవనానికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment