కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నందిగ్రామ్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. బుధవారం తాను నామినేషన్ వేయాలనుకుంటున్నానని, మీరు వద్దంటే తాను నామినేషన్ వేయబోనని కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను మీ బిడ్డగా పరిగణించి మరోసారి ఆశీర్వదిస్తామంటేనే నామినేషన్ దాఖలు చేస్తానని ఆమె ప్రజలనుద్దేశంచి మాట్లాడారు.
కాగా, దీదీ ప్రతిసారీ పోటీ చేసే భవానీపూర్‌ను కాదని ఈసారి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం(మార్చి 10న) నామినేషన్ దాఖలు చేయాలని ఆమె నిర్ణయించుకుంది. నామినేషన్ దాఖలుకు ఒక్కరోజు ముందు ఆమె నియోజకవర్గంలో పర్యటించి అక్కడి ప్రజలను ఉద్దేశించి భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తుండగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నీ తానై ముందుకు నడిపిస్తోంది. దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తనవంతు కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment