TS: బీజేపీ నేతల్లో అంతర్మథనం..ఇప్పుడేం చేద్దాం! | Internal debate in BJP ranks | Sakshi
Sakshi News home page

TS: బీజేపీ నేతల్లో అంతర్మథనం..ఇప్పుడేం చేద్దాం!

Published Mon, Dec 11 2023 4:39 AM | Last Updated on Mon, Dec 11 2023 9:22 AM

Internal debate in BJP ranks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ, రాష్ట్ర నాయకత్వాల అంచనాలు తప్పడానికి కారణాలు ఏమై ఉంటాయా అన్న దానిపై బీజేపీలో ప్రస్తుతం ‘పోస్ట్‌ మార్టమ్‌’ సాగుతోంది. అన్ని రకాలుగా కసరత్తు చేసి, తగిన జాగ్రత్తలతో బరిలో దిగినా చివరికి నిరాశ కలిగించేలా ఫలితాలు రావడానికి ప్రభావం చూపిన అంశాలు ఏమిటన్న దానిపై లోతైన పరిశీలనలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలను సాధించి రాష్ట్ర రాజకీయాల్లో కీలకభూమి పోషిస్తుందనే అంచనాలు తప్పి కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని పార్టీ నేతలు జీచ్చి చుకోలేక పోతున్నారు.

గెలిచిన 8లో ఏడు స్థానాలు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల నుంచే ఉండడం, పార్టీకి అత్యధిక పట్టు, ప్రజల ఆదరణ, మద్దతు అధికంగా ఉందని భావిస్తున్న గ్రేటర్‌ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి  గోషామహల్‌ సీటు మాత్రమే రావడం వంటి పరిణామాలు నేతల అంచనాలకు పూర్తి స్థాయిలో అందడం లేదంటున్నారు.

బీసీ సీఎం నినాదం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మద్దతు, సకల జనుల సౌభాగ్య తెలంగాణ పేరిట ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రజలపై ప్రభావం చూపించలేకపోయాయని విశ్లేషిస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి అనుకూలంగా మారకపోగా, కర్ణాటక గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్‌ పార్టీ దాన్ని విజయవంతంగా అనుకూలంగా మలుచుకోగలిగిందని లెక్కలు వేస్తున్నారు. 

ఎందుకు కమలాన్ని పట్టించుకోలేదంటే.. 
బీజేపీకి ట్రేడ్‌ మార్క్‌గా ఉన్న ‘హిందూత్వ’ఎజెండాను మరింత బలంగా తీసుకెళ్లాల్సి ఉండిందా? సామాజిక కోణంలో తీసుకున్న బీసీ సీఎం నినాదం పనిచేయక పోవడానికి కారణాలేంటి? బయటి నుంచి వచ్చిన నేతలకు ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించడం నష్టం చేసిందా? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ సరైన ఫలితాలు సాధించాలంటే ఏయే మార్పులు చేయాలి? తదితర ప్రశ్నలు ఇప్పుడు బాధ్యులైన నేతల మధ్య ప్రధానంగా చర్చకు వస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.

బీఆర్‌ఎస్‌–బీజేపీ ఒకటేనని, రెండింటి మధ్య లోపాయికారి మితృత్వం ఉందంటూ జరిగిన ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోవడం, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్ట్‌ల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని స్వయంగా కేంద్రపెద్దలు విమర్శించినా ఆ మేరకు కనీస చర్యలు తీసుకోకపోవడం, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం, అరెస్ట్‌ ఖాయమంటూ ప్రకటనలు చేసినా ఆ మేరకు యాక్షన్‌ లేకపోవడం, కేసీఆర్‌ సర్కార్‌పై రాజీలేని పోరాటం చేసి పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నింపిన బండి సంజయ్‌ని హఠాత్తుగా అధ్యక్షుడిగా తొలగించడం, బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌కు వివిధ కీలక బాధ్యతలిచ్చి ప్రాధాన్యతనివ్వడం తదితరాలు బీజేపీ ఓటమికి ప్రధాన కారణాలు కావొచ్చుననే చర్చ ఇప్పుడు పార్టీలో సాగుతోంది.

అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం,  బలంలేని జనసేనకు 8 సీట్లు కేటాయించడం, పార్టీ నాయకులు ఓ జట్టుగా సమన్వయంతో పనిచేయకపోవడం వెరసి ప్రజలు బీఆర్‌ఎస్‌కు బీజేపీని ప్రత్యామ్నాయంగా చూడకపోవడంతో తీసికట్టుగా ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికలకు ఎలా ? 
వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనైనా తెలంగాణ నుంచి గణనీయమైన సంఖ్యలో (గతంలో గెలిచిన 4 ఎంపీ సీట్ల కంటే అధికంగా) సీట్లు సాధించాలనే పట్టుదల రాష్ట్ర పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి భారంతో మునిగిన పార్టీలో నూతనోత్తేజాన్ని నింపేందుకు వెంటనే ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై పార్టీ నాయకులు సమాలోచనల్లో నిమగ్నమయ్యారు.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి  అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తీసుకొస్తే ప్రయోజనం ఉంటుందా? ఈటలకు ఆ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది? లేదా లోక్‌సభ ఎన్నికల దాకా కిషన్‌రెడ్డి  నే కొనసాగించి ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళితే మంచిదా అన్న ఆలోచనల్లో జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement