సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాయటంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి భగ్గుమన్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భిక్షతో రాజకీయంగా ఎదిగిన నేతలే విమర్శించడమా అని మండిపడ్డారు. పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. సోమవారం ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో.. ‘‘ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక బలం, భరోసా.
వారి నాయకత్వమే కాంగ్రెస్ పార్టీకి బలం. గాంధీ కుటుంబం కాకుండా ఎవరు అధ్యక్షులు అయినా కష్టమే. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించి, సీనియర్లుగా ఉండి, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గాంధీ యేతర కుటుంబానికి అధ్యక్ష పదవి ఇవ్వాలని లేఖ రాయడం ఏంటి?. వారు ప్రజా నాయకులు కాకపోయినా పార్టీ పదవులు ఇచ్చింది. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ కోసం అహార్నిశలు కృషి చేస్తున్నారు. 73 ఏళ్ల వయసులో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుతూ దేశ కోసం కష్టపడుతున్నారు. నెహ్రు మొదటి ప్రధానిగా ఈ దేశానికి ఎన్నో పారిశ్రామిక, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన నేత. అలాగే నెహ్రు వ్యవసాయ అభివృద్ధి కోసం భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. ( రాజీనామాకు సిద్ధపడ్డ గులాం నబీ ఆజాద్)
అందుకే భారత దేశం వ్యవసాయ పరంగా అభివృద్ధిలో ఉంది. ఆయన విద్యా రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇందిరా గాంధీ బ్యాంక్‌లను జాతీయం చేసి పేద వాడికి అందుబాటులో ఉంచింది. రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని ప్రగతి పదంలో నడిపించారు. దేశ సమగ్రత కోసం ఇందిరా, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. ఇది గాంధీ కుటుంబ చరిత్ర. ఈ చరిత్ర దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇలాంటి పార్టీ రాజకీయ భిక్షతో జాతీయ స్థాయిలో ఎదిగిన నేతలు గాంధీ కుటుంబాన్ని విమర్శించడమా?’’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment