సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.
కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్‌గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment