సాక్షి, తిరుపతి : తమకు సీఎం కావాలన్న ఆలోచనలేదని.. టీడీపీకి, చంద్రబాబుకు తాము మద్దతుగా మాత్రమే ఉన్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు చెప్పారు. టీడీపీతో పొత్తుపట్ల 95 శాతం పార్టీ శ్రేణులు అనుకూలంగా ఉన్నారని తెలిపారు. వ్యతిరేకంగా ఉన్న వారిని పరిగణనలోకి తీసుకోవడంలేదని ఆయన స్పష్టంచేశారు. తిరుపతి సమీపంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీకి మద్దతుగా కలిసి పోరాడాలని నిర్ణయించామని ప్రకటించారు.
అయితే, కాపు నేతలు టీడీపీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎవరు సీఎం అనేది కాలమే నిర్ణయిస్తుందని నాగబాబు చెప్పారు. ఇక పొత్తుపై బీజేపీ నుంచి కూడా త్వరలోనే నిర్ణయం వస్తుందని నాగబాబు ఒక ప్రశ్నకు బదులిచ్చారు. ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతామని వ్యాఖ్యానించారు. త్వరలోనే రాయలసీమలో పవన్ వారాహి యాత్ర ఉంటుందన్నారు.
మేం అలా అనలేదు..
జనసైనికులు ఎప్పుడూ ఎవరిదో ఒకరి జెండాను మోయాల్సిందేనా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. మీరు సాక్షి వారా? ఈరోజు సాక్షిలో వచ్చిన వార్త గురించి చర్చించుకున్నాం. మేం అలా అనలేదు.. అని అంటూ.. సాక్షికి సమాధానం చెప్పడం కూడా వృథా అని వ్యాఖ్యానించారు. కేసులకు భయపడబోమని, వాటిని ఎదుర్కొంటామని.. తమకూ మంచి లీగల్ టీం ఉందన్నారు.
టీడీపీతో పొత్తుకు ఒప్పుకోం..
అంతకుముందు జరిగిన కార్యకర్తల సమావేశంలో.. టీడీపీతో పొత్తుకు ఒప్పుకునేది లేదని, వారితో కలిసి వెళ్లే ప్రసక్తేలేదని జనసేన శ్రేణులు నాగబాబు సమక్షంలో తే ల్చిచెప్పారు. లేదంటే పవన్‌ని సీఎం అభ్యర్థి గా టీడీపీ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. జనసేన శ్రేణులను టీడీపీ వాడుకుని వదిలేసే రకమని సభలో కొందరు బిగ్గరగా అరిచినట్లు తెలిసింది. అయితే, సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు దీనిపై స్పందించకుండా మౌనం వహించినట్లు సమాచారం. దీంతో చేసేదిలేక మరోసారి క్షేత్రస్థాయిలో చర్చిద్దామని, సంయమనం పాటించాలని ప్రాథేయపడినట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment