
సాక్షి, అమరావతి: టీడీపీని కూడా పొత్తులో కలుపుకుపోదామని బీజేపీ పెద్దలను కోరినట్లు జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ పరోక్షంగా వెల్లడించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు గురించి బీజేపీ నాయకులతో మాట్లాడారా? అని మీడియా ప్రశ్నించగా.. నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. ‘రాజకీయాలు అన్నాక అన్ని అంశాలూ చర్చకు వస్తాయి’ అని జవాబిచ్చారు.
‘బీజేపీ పెద్దలతో పవన్‌కళ్యాణ్ భేటీలో భాగంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మేము తీసుకున్న నిర్ణయాన్ని వారికి వివరించాం. వాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మా నిర్ణయాన్ని స్వాగతించి ముందుకొస్తారని నమ్మకం ఉంది. త్వరలోనే అన్ని పార్టీలూ కలిసి వైఎస్సార్‌సీపీ విముక్త ఏపీ కోసం పనిచేసే విధంగా ముందుకు వెళ్తాం’ అని మనోహర్ చెప్పారు.
పొత్తులపై తమ పార్టీ అధినేత పవన్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అంతకంటే ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నామో అందరికీ వివరించాలి్సన బాధ్యత ఉందని.. అది నెరవేర్చామని చెప్పారు. కాగా, టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలు అంగీకరించడం లేదని వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా.. ‘అది మీడియా ఎవరో ఒకరు చెబుతున్న మాటే’ అని బదులిచ్చారు.
బీజేపీ వాళ్ల అవగాహన లోపం..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉండి కూడా జనసేన మద్దతు తెలపలేదన్న బీజేపీ నేత మాధవ్ వ్యాఖ్యలను నాదెండ్ల వద్ద ప్రస్తావించగా.. ‘అది వాళ్ల అవగాహన లోపం’ అని బదులిచ్చారు. ‘మేం(జనసేన) సంస్థాగతంగా బలపడుతున్నాం. వాళ్లు(బీజేపీ) కూడా సంస్థాగతంగా బలపడాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. మా పార్టీ స్టాండ్‌ను ముందుగానే ప్రకటించాం’ అని నాదెండ్ల చెప్పారు. రానున్న రోజుల్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తామని తెలిపారు.