ప్రసంగిస్తున్న జో బైడెన్
Dagger At The Throat Of Democracy వాషింగ్టన్: యూఎస్ క్యాపిటల్‌పై ట్రంప్ మద్ధతుదారుల దాడి (2020 జనవరి 6న ) జరిగి ఏడాది గడిచిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురువారం శక్తిమంతమైన ప్రసంగం చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ పరోక్షంగా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. 2020 నవంబర్ ఎన్నికల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అబద్ధపు ప్రచారాలను జో బైడెన్ దుయ్యబట్టారు. ఎన్నికల్లో బైడెన్‌ను విజేతగా ప్రకటించకుండా నిలిపివేసేందుకు, ఎలక్టోరల్ కాలేజ్ ఓట్ల లెక్కింపుకు అంతరాయం కలిగించడానికి, ఫలితాలను తారుమారు చేసేందుకు ట్రంప్ మద్ధతుదారులు పన్నిన కుట్రలపై మండిపడ్డారు.
క్యాపిటల్‌లోకి చొరపడ్డ ఘటనలో దాదాపు 700 మంది తిరుగుబాటుదారులు అరెస్టయ్యారన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు మృతి చెందారు. దాడి జరిగిన రోజు అక్కడున్న మరో నలుగురు అధికారులు ఆ తర్వాత నెలల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాడి జరిగిన అనంతరం దాడికి ప్రేరేపించిన ఆరోపణలతో ట్రంప్‌ను అభిశంసనకు రంగం సిద్ధం చేశారు. ఐతే సెనెట్‌లో 57 - 43 ఓట్ల తేడాతో ట్రంప్ బయటపడ్డాడు (నిర్ధారణకు 67 ఓట్లు అవసరమవుతాయి). కాగా క్యాపిటల్‌పై దాడి జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా క్యాపిటల్‌లోని స్టాచ్యురి హాల్‌లో నిన్న (గురువారం) బైడెన్ ఈ విధంగా ప్రసంగించారు.
చరిత్రలోనే తీవ్ర అపఖ్యాతి
ఇది బ్లాక్ డే (జనవరి 6). అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక అధ్యక్షుడు ఎన్నికల్లో ఓడిపోవడమేకాక, శాంతియుత అధికార మార్పిడికి తీవ్రప్రతిఘటనకు ప్రయత్నించాడు. ప్రజాస్వామ్యపు గొంతుకకు బాకును గురిపెట్టడానికి ఎవ్వరినీ అనుమతించను. ముమ్మాటికీ ఇది సాయుధ తిరుగుబాటు. మాజీ అధ్యక్షుడు 2020 ఎన్నికలు జరగకముందే రిగ్గింగ్ జరుగుతుందని ప్రచారం చేశాడు. జనవరి 6 న క్యాపిటల్ భవనంపై దాడి చేయించడం ద్వారా వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ చర్యలతో అతను అమెరికా చరిత్రలోనే అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. నువ్వు గెలిస్తే తప్ప నీ దేశాన్ని ప్రేమించలేవా?’ అని బైడెన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆ రోజు వైట్ హౌస్‌లో తాపీగా కూర్చుని టీవీలో అంతా చూస్తూనే ఉన్నాడు
‘అమెరికా రాజకీయ హింసను అంగీకరించే దేశంగా మారబోతోందా? ప్రజలు చట్టబద్ధంగా వ్యక్తీకరించబడిన ఇష్టాన్ని తారుమారు చేయడానికి పక్షపాత ఎన్నికల అధికారులను అనుమతించే దేశంగా మనం ఉండబోతున్నామా?’ అని బైడెన్ ప్రశ్నించారు. గత అధ్యక్షుడు అబద్ధపు చట్రాన్ని సృష్టించి జనాన్ని రెచ్చగొట్టాడని బైడెన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్‌పై దాడి సమయంలో అతను వైట్‌హౌస్‌లో టీవీ ముందు కూర్చుని అంతా చూస్తున్నాడని చెప్పారు. ఐతే మొత్తం ప్రసంగంలో బైడెన్ ఎక్కడా ట్రంప్ పేరును ప్రస్తావించనప్పటికీ ఎన్నికల్లో గెలవడం కోసం మోసానికి పాల్పడిన వ్యక్తికి చెందిన రూపును (ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ వ్యక్తి గురించి) సుస్పష్టం చేశారు.
అమెరికాను విభజించడానికి బైడెన్ నాపేరు వాడుతున్నారు: ట్రంప్
బైడెన్ ప్రసంగం ముగిసిన వెంటనే ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. అమెరికాను విభజించడానికి డెమొక్రాట్ ప్రయత్నిస్తుందని, రాజకీయ రంగస్థలమని (పొలిటికల్ థియేటర్) బైడెన్ క్యాపిటల్ దాడి వార్షకోత్సవ ప్రసంగంపై ట్రంప్ ఆరోపణలు చేశారు. గత ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే తన వాదనను ఈ ప్రకటనలో పునరావృతం చేశారు.
చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు
Comments
Please login to add a commentAdd a comment