ఆమోదించే వరకు 'పోరాటం' | Kalvakunta Kavitha on womens reservation bill at Delhi | Sakshi
Sakshi News home page

ఆమోదించే వరకు 'పోరాటం' 

Mar 11 2023 1:55 AM | Updated on Mar 11 2023 1:55 AM

Kalvakunta Kavitha on womens reservation bill at Delhi - Sakshi

దీక్షలో మాట్లాడుతున్న కవిత. చిత్రంలో సీతారాం ఏచూరి

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటులో 33% మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేవరకు పోరాటాన్ని ఆపబోమని భారత్‌ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచే వరకు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగే ప్రసక్తే లేదని చెప్పారు. మహిళలకు ధరణిలో సగం, ఆకాశంలో సగం, అవకాశాల్లోనూ సగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంటులో ఆమోదించేందుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఉదయం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వేదికగా భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో కవిత చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. కాగా సాయంత్రం 4 గంటలకు సీపీఐ కార్యదర్శి నారాయణ, బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావులు కవితకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. 

బిల్లుతో దేశ ప్రజాస్వామ్యం బలోపేతం 
మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనేది కేవలం తన సమస్యో, తన రాష్ట్రం సమస్యో కాదని, మొత్తం దేశానికి సంబంధించిన సమస్య అని కవిత చెప్పారు. ఇది రాజకీయ పరమైన అంశం కూడా కాదని స్పష్టం చేశారు. ఈ బిల్లుపై ప్రతిపక్షం సహా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయని, కానీ పార్లమెంటులో ఆమోదం పొందేలా ఏ పార్టీ కూడా కృషి చేయడం లేదని విమర్శించారు.

దేశం అభివృద్ధి చెందాలంటే పురుషులు, మహిళలు ఇద్దరికీ సమాన ప్రాతినిధ్యం అవసరమని అన్నారు. ఈ బిల్లు చారిత్రక అవసరమని, మహిళలకు 33% రిజర్వేషన్లు అందించడం వల్ల దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.  

తలుచుకుంటే రెండు గంటల్లో ఆమోదించొచ్చు 
పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును తీసుకురావాలని, ఆ పార్టీ తలుచుకుంటే రెండు గంటల్లో ఈ బిల్లును ఆమోదించవచ్చని కవిత చెప్పారు. పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు ఇవ్వడానికి అనేక పార్టీలు సిద్ధంగా ఉన్నాయని, తాము కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. 1992లో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ఫలితంగా నేడు 21 రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల్లో 50 శాతానికి పైగా మహిళా ప్రాతినిధ్యం ఉందని వివరించారు.

చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్లు కల్పిస్తే.. 10–20 ఏళ్ల తర్వాత పార్లమెంటు, అసెంబ్లీల్లో సైతం మహిళల ప్రాతినిధ్యం 50 శాతానికి పైగా పెరుగుతుందని తెలిపారు. ఈ నెల 13వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లు తెచ్చేలా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాలని పార్టీలను కోరారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీక్షకు వచ్చిన మహిళల సంతకాలతో కూడిన లేఖను రాష్ట్రపతి, ప్రధానమంత్రికి పంపిస్తామని వెల్లడించారు. 

మహిళా భాగస్వామ్యంతోనే అభివృద్ధి: ఏచూరి 
రాజకీయ రంగంలో మహిళా రిజర్వేషన్లు చాలా అవసరమని ఏచూరి అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమానత్వం ఎప్పటివరకు రాదో అప్పటివరకు అభివృద్ధి జరగదని తెలిపారు. మహిళా భాగస్వామ్యం లేని ఏ దేశం కూడా ఆర్థికంగా పురోగతి సాధించలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రధాని మోదీ హామీ ఇచ్చి 9 ఏళ్లు గడిచినా ఇప్పటికీ బిల్లు తీసుకురాలేదని విమర్శించారు. భారత్‌ జాగృతి, బీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తామని, ఈ పోరాటానికి తమ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు.  

మోదీ జవాబు చెప్పాలి: ఆప్‌ ఎంపీ 
అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నప్పుడు.. మహిళా బిల్లు ఎందుకు ఆమోదం పొందడం లేదో ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ పోరాడినా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రశ్నించారు.

మరోమంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, సంతోష్‌ కుమార్, వెంకటేశ్‌ నేత, మాలోత్‌ కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, భారత్‌ జాగృతి నాయకులు దీక్షలో పాల్గొన్నారు. వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement