సాక్షి, కర్ణాటక ఎలక్షన్ డెస్క్: కర్ణాటక ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖులు పోటీ చేస్తోన్న నియోజకవర్గాలపై అందరి దృష్టి నిలిచింది. సీఎం బసవరాజ బొమ్మై, సీఎల్పీ నేత సిద్దరామయ్య, కేపీసీసీ నేత డీకే శివకుమార్, యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర, కుమారస్వామి, ఆయన కొడుకు నిఖిల్‌గౌడ తదితరుల నియోజకవర్గాల్లో గాలి ఎలా ఉందనేది చర్చనీయాంశమైంది. ప్రముఖులు కావడం, నియోజకవర్గాల్లో అన్ని విధాలా పట్టు ఉన్న మూలంగా వీరి విజయానికి ఢోకా లేకపోవచ్చనేది మెజారిటీ మాట. కానీ సమయం అనుకూలించకపోతే ఎవరికై నా పరాజయం తప్పదని అనేకసార్లు ఎన్నికల ఫలితాలు చాటిచెప్పాయి.
శిగ్గావ్‌లో సీఎం బొమ్మైకు పరీక్ష
హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీఎం బసవరాజ్ బొమ్మై పోటీలో ఉన్నారు. బొమ్మై గత మూడు పర్యాయాలు 2008లో 12వేలు, 2013లో 9,600, 2018 ఎన్నికల్లో 9,200 మెజారిటీతో గట్టెక్కడం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ బరిలో ఉన్నారు. బొమ్మైకి లింగాయత్ వర్గాల ఓటర్ల బలముంటే, కాంగ్రెస్‌కు మైనారిటీ ఓటర్లు అండగా ఉన్నారు. ఈసారి పోటీ గట్టిగానే ఉండొచ్చని తెలుస్తోంది.
చెన్నపట్టణలో కుమారకు పోటీ
రామనగర జిల్లా చెన్నపట్టణ నుంచి జేడీఎస్ తరఫున మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌కు పెట్టని కోటగా చెన్నపట్టణను చెబుతారు. ప్రస్తుతం బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న సీపీ యోగేశ్వర్ 1999, 2004, 2011, 2013 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. యోగేశ్వర్ ఒకసారి స్వతంత్ర, మరోసారి కాంగ్రెస్, ఇంకోసారి బీజేపీ, నాల్గోసారి ఎస్‌పీ నుంచి విజయం సాధించారు. 2018లో జేడీఎస్ తరఫున పోటీ చేసిన కుమారస్వామి స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. మరోసారి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది.
వరుణలో సిద్దుకు తేలికేనా?
మైసూరు జిల్లా వరుణలో కాంగ్రెస్ మాజీ సీఎం సిద్దరామయ్యకు ఎదురు లేదు. 2008, 2013 భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2018లో తనయుడు యతీంద్రను పోటీ చేసి గెలిపించారు. అయితే పక్క నియోజకవర్గమైన చాముండేశ్వరిలో నిలబడిన సిద్ధరామయ్య ఓడిపోయారు. ఈసారి వరుణ నుంచే బరిలో ఉన్నారు. ఆయనకు మంత్రి వి.సోమణ్ణ పోటీ చేస్తున్నారు.
కనకపురలో ఇద్దరు దిగ్గజాలు
కనకపురలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు ఓడిపోయింది లేదు. ఇక్కడ కాంగ్రెస్ – జేడీఎస్ మధ్యనే పోటీ ఉంటోంది. బీజేపీది మూడో స్థానమే. గతంలో జేడీఎస్ నుంచి డీకేశిపై పోటీ చేసి ఓడిన నారాయణగౌడ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. బీజేపీ నుంచి సీనియర్ మంత్రి ఆర్.అశోక్ డీకేను ఎదుర్కొంటున్నారు. ఇద్దరూ ఒకే వర్గానికి చెందినవారు, సమ ఉజ్జీలు కావడంతో ఈసారి ఏం జరుగుతుందా అనేద ఉత్కంఠ నెలకొంది.
రామనగరలో తనయుని కోసం..
రామనగర నుంచి మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి తనయుడు నిఖిల్‌గౌడ జేడీఎస్ నుంచి బరిలో దిగారు. రామనగరలో 2004 నుంచి నాలుగుసార్లు హెచ్‌డీ కుమారస్వామి గెలుస్తూ వచ్చారు, గత ఎన్నికల్లో భార్య అనితకు అప్పజెప్పారు. ఉప ఎన్నికల్లో ఆమె కూడా గెలిచారు. ఈసారి తనయుడు పోటీలో ఉన్నాడు. దంపతులిద్దరూ కొడుకు కోసం ప్రచార వ్యూహాల్లో మునిగారు.
విజయేంద్రకు ఢోకా లేదా!
శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర బీజేపీ టికెట్‌తో పోటీలో ఉన్నారు. శికారిపురలో 1983 నుంచి 2018 వరకు ఒకసారి తప్ప యడియూరప్ప గెలుపొందారు. శికారిపుర అంటే యడియూరప్పే అనే పేరు వచ్చింది. ఈసారి వారసున్ని బరిలోకి దింపారు. గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment