
దమ్ముంటే దీనిపై చర్చకు రా.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి సవాల్
హామీలు అమలు చేయలేక, ఓట్లు ఎలా అడగాలో తెలియక అవాస్తవ ఆరోపణలు
రిజర్వేషన్ల రద్దు అంటూ సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నం..
అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు..
ఇది కాంగ్రెస్ దిగజారుడుతనానికి పరాకాష్ట
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నిలదీశారు. దమ్ముంటే దీనిపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు.
తెలంగాణలో అమలవుతున్న బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్లపైనా చర్చకు సిద్ధమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేక, ఏం చెప్పి ఓట్లు అడగాలో తెలియక.. రేవంత్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలే కాంగ్రెస్ గ్యారంటీగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.
రేవంత్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే లెంపలేసుకుని గద్దె దిగిపోవాలని వ్యాఖ్యానించారు. ఒట్లు, ప్రమాణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రజలకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అమలు చేయలేని హామీలు ఇచ్చి, బీసీ రిజర్వేషన్ల పేరుతో సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. రాష్ట్రంలో ఒకటి రెండు లోక్‌సభ సీట్లకే కాంగ్రెస్ పరిమితం కాబోతుండటాన్ని తట్టుకోలేక బీజేపీపై విష ప్రచారానికి దిగింది.
రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ దశాబ్దపు పెద్ద అబద్ధం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ–బీఆర్‌ఎస్ ఒకటేనంటూ రాహుల్ గాం«దీ, రేవంత్‌రెడ్డి దు్రష్పచారం చేశారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ కొరవడటంతో కొత్త నాటకానికి తెరలేపింది.
అబద్ధపు పునాదులపై ఎదిగిన కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబెల్స్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. బీసీ రిజర్వేషన్లు తగ్గించి, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీలకు విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో గండి కొట్టినది కాంగ్రెస్ పార్టీయే. అలాంటి కాంగ్రెస్‌కు రిజర్వేషన్‌లపై బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదు.
అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేశారు
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్దిపేట సభలో చేసిన ప్రసంగాన్ని మారి్ఫంగ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన చెప్పినట్టుగా కాంగ్రెస్ ‘ఎక్స్’లో పోస్ట్ చేసిందంటే.. ఆ పార్టీ దిగజారుడుతనడానికి పరాకాష్ట. బీజేపీ స్థైర్యాన్ని దెబ్బతీసి, సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొటే ప్రయత్నం. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై పోలీసు కేసు పెట్టాం. ఈసీకి ఫిర్యాదు చేశాం.
కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గుర్తించారు
ప్రధాని మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ నాటకాలను ప్రజల ముందు పెడుతున్నాం. ప్రజలు కూడా కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను గుర్తించారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో సానుకూలత కనిపించడం లేదు. భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ యాత్ర చేస్తే.. కాంగ్రెస్ చోడో అంటూ నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు.
బీసీలకు న్యాయం బీజేపీతోనే..
దేశంలో అత్యున్నత పదవుల నుంచి రాజకీయ రంగం దాకా బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమే. తొలిసారి బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే. స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా కేంద్ర కేబినెట్‌లో ఏకంగా 27 మంది బీసీలు, 12 మంది దళితులు, 8 మంది ఎస్టీలకు అవకాశం ఇచ్చిన ఘనత బీజేపీదే.
మోదీ మూడో సారి ప్రధాని కాబోతున్నారని తట్టుకోలేక కాంగ్రెస్ నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీసీలకు అన్యాయం జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో వారికి న్యాయం చేయడం బీజేపీతోనే సాధ్యం..’’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment