
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని దేశవ్యతిరేక శక్తులు కుట్రపన్నాయి
అయినా ప్రజలు మూడోసారి మా పార్టీని గెలిపించారు
పంజగుట్ట (హైదరాబాద్): గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యతిరేక శక్తులు బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు కుట్రలు పన్నాయని, కానీ ప్రజలు ఆ శక్తుల కుట్రలను తిప్పికొట్టి బీజేపీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజిగూడలోని జయాగార్డెన్స్‌లో బీజేపీ సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారం, ఎన్నికలతో సంబంధం లేకుండా ముందుకు వెళ్లే పార్టీ బీజేపీ అని అన్నారు.
నెహ్రూ తరువాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన ఘనత నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు కూడా సాధించలేదని, కానీ రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు ఆ పార్టీ నాయకులు ఊహాగానాల్లో తేలిపోయారని, ఎన్నికల్లో ఓడిపోయి కూడా సంబురాలు చేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు.. రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తొలగిస్తారు అని తప్పుడు ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌ను పలు మార్లు అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కుటుంబ పాలన వస్తుందని, ఉగ్రవాదం, అవినీతి పెరిగిపోతాయని ప్రజలు గ్రహించారని, అందుకే బీజేపీని మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు. లోక్‌సభ కార్యకలాపాలు జరగకుండా అడ్డుకోవడం, రాజ్యాంగం గురించి తప్పుడు ప్రచారం చెయ్యడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గౌతంరావు, పార్టీ నేతలు ఆనంద్ గౌడ్, ఎన్.వి.సుభాష్, శ్రీనివాస్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment