( ఫైల్ ఫోటో )
సాక్షి, నల్గగొండ: తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగలనుంది. పార్టీ మార్పుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరికపై పరోక్షంగా సంకేతాలు అందించారు ఆయన.
‘‘బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించడం ఖాయం. కేసీఆర్‌ను ఓడించే పార్టీలో చేరతా. నేను ఏం చేయబోతున్నానో త్వరలోనే ప్రకటిస్తా’’ అని పేర్కొన్నారు ఆయన. ఇదిలా ఉంటే.. చండూరులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే.. జ్వర లక్షణాలు కనిపించడంతో వాయిదా వేసుకున్నట్లు తెలిపారు.
నల్లగొండ మునుగోడు ఎమ్మెల్యే అయిన రాజగోపాల్‌రెడ్డి.. గతంలో కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించారు. అయితే కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ మారతారంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. అయితే సీనియర్ల హామీతో ఆయన కొంతకాలం ఓపిక పట్టారు.
ఈ మేరకు అధిష్టానం నుంచి సరైన స్పందన లేకపోవడంతోనే ఆయన కాషాయపు కండువా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెస్ తరపున భువనగిరి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం తెలంగాణలో రాజగోపాల్‌రెడ్డితో కలిపి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి జంప్ అయిన వాళ్లూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment