
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా హడావుడి చేశారు. అనుచర గణంతో కలిసి హంగామా సృష్టించారు. ఆయన ఓ రకంగా బల ప్రదర్శనకు దిగడం రాష్ట్ర కాంగ్రెస్‌తో పాటు జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన జన్మదినాన్ని ఎప్పుడూ ఓ మోస్తరు హడావుడితో జరుపుకొనే వెంకటరెడ్డి.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైదరాబాద్ నుంచి బ్రాహ్మణ వెల్లెంల వరకు భారీ ప్రదర్శనగా రావడం, అక్కడ వేలాది మంది అనుచరుల సమక్షంలో కేక్ కట్ చేసి రాజకీయ వేడి పుట్టించే వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
తాను మంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేయించిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు సాక్షిగా తనదైన శైలిలో మాట్లాడి కేడర్‌లో ఉత్తేజాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసిన సందర్భంగా ఆయన అనుచరులు సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. సీఎం అంటూ నినాదాలు చేస్తే అంతా కలిసి తనను ఓడిస్తారని, ఎమ్మెల్యేను కూడా కానివ్వరని వ్యాఖ్యానించడం ద్వారా పార్టీలోని అంతర్గత రాజకీయాలను, తనను ప్రత్యర్థి పార్టీలు పనిగట్టుకుని ఓడించే ప్రయత్నాలు చేస్తాయని చెప్పకనే చెప్పారు.
తాను తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలేశానని, తనకు సీఎం పదవిపై మోజు లేదని కోమటిరెడ్డి చెప్పారు. అయినా తాను అనుకుంటే సీఎం పదవి నడుచుకుంటూ వస్తుందని పేర్కొనడం ద్వారా తాను కూడా సీఎం రేసులో ఉన్నట్టేనని పరోక్షంగా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 70–80 సీట్లు వస్తాయని, అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, రుణ మాఫీ వంటి హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని, ఎన్నికలకు రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామంటూ పార్టీ వ్యూహాలను కూడా బహిర్గతం చేశారు.
వైఎస్‌ను ఒప్పించి ప్రాజెక్టు సాధించాం..
‘బ్రాహ్మణ వెల్లెంలకు కృష్ణా నీరు రావడంతో సంతోషంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డిని మూడుసార్లు నల్లగొండకు తీసుకువచ్చా. ఆయన్ను ఒప్పించి ప్రాజెక్టును సాధించాం. అప్పట్లోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు మోటార్లు బిగించాలంటే అధికారులను ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. మూడు నెలలైతే వారు మాజీలు అవుతారు. బస్టాండ్లలో బఠానీలు అమ్ముకుంటారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరు సీఎం అయినా, తాను ఒక్క మిస్డ్‌కాల్ ఇస్తే తన కోసం జిల్లా అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తారు. వచ్చే మూడు నెలల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే తెలంగాణలో 80 సీట్ల వరకు పార్టీ గెలుస్తుంది. నల్లగొండ జిల్లాలో 12 స్థానాలు గెలవటం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం. రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తాం..’అని కోమటిరెడ్డి చెప్పారు.
నల్లగొండలో బీసీ డిక్లరేషన్ సభ
‘వచ్చే వారం పది రోజుల్లో నల్లగొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ సభ నిర్వహిస్తాం. ఈ సభకు ప్రియాంకా గాం«దీని తీసుకువస్తాం. వచ్చే ఎన్నికలకు రెండు నెలల ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పాలైందో అర్ధం కావడం లేదు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ ప్రశ్న పత్రాలను దిద్దలేని ప్రభుత్వం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది.
రైతులు పండించిన ధాన్యం కల్లాల్లోనే ఎండకు ఎండి, వానకు తడిసిపోతుంటే ధాన్యాన్ని కొనలేని ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎలా అవుతుంది?. అసెంబ్లీలో 100 సార్లు శ్రీశైలం సొరంగం ప్రాజెక్టుపై రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికైనా శ్రీశైలం సొరంగం, నక్కలగండి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుల అసంపూర్తి పనులను పూర్తి చేయాలి. ఎన్నికల ముందు ప్రాజెక్టుల పేరుతో ఏం చేసినా ప్రజలు గమనిస్తారు..’ అని వెంకటరెడ్డి అన్నారు.