కాలం ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. రాజకీయం కూడా అంతే. ఎప్పుడు ఎటు మారుతుందో, ఎవరు ఎటు వైపు ఉంటారో చెప్పలేం. తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి .. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తాజా ఉదాహరణగా చెప్పవచ్చు.రాజశేఖరరెడ్డిని ఆయన ప్రశంసిస్తూ, కేంద్రంలో 2004, 2009 లలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయనే కారణమని అన్నారు. రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని చెప్పేవారని, ప్రస్తుతం తాము కూడా అదే ఆశయంతో పనిచేస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. విశేషం ఏమిటంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు జగన్‌పై కేసులు పెట్టడమే కాకుండా , వైఎస్ పేరును కూడా చార్జీషీట్ లో చేర్చడం వివాదం అయింది.
✍️ కేవలం జగన్ తన సొంత పార్టీ పెట్టుకుంటేనే కాంగ్రెస్ అదికూడా ప్రతిపక్ష తెలుగుదేశంతో కలిసి సీబీఐ ద్వారా వేధింపు చర్యలకు పాల్పడింది. పలు అక్రమ కేసులు పెట్టింది. ఆ రోజుల్లో రేవంత్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేసేవారు. వైఎస్ఆర్ పై కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసి కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి గురయ్యారు. రేవంత్ అప్పటి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీపైనా కూడా పరుష వ్యాఖ్యలు చేసిన సందర్భాలు అనేకం. సోనియాను తెలంగాణ పాలిట బలిదేవత అని విమర్శించారాయన. కానీ.. తదుపరి పరిణామాలలో రాష్ట్ర విభజన జరగడం, తెలుగుదేశం బాగా బలహీనపడడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండడం తదితర కారణాలతో ఆయనకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా కనిపించింది. అప్పటికే ఆయన ఓటుకు నోటు కేసులో చిక్కుకున్నారు. దాంతో ఆయన రాజకీయంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
✍️ కానీ.. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన సంబంధాలు పెట్టుకుని ఆ పార్టీలోకి రాగలిగారు. 2018 శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నుంచి ఓటమి చెందినా, మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి కాంగ్రెస్ టిక్కెట్ పొందగలిగారు. అది రేవంత్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన మలుపు అయింది. తదుపరి పీసీసీ అధ్యక్షుడి రేసులోకి వచ్చారు. మాజీ మంత్రి(ప్రస్తుత భువనగిరి ఎంపీ) కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి గట్టి ప్రయత్నమే చేసినా.. అధిష్టానం రేవంత్ వైపు మొగ్గు చూపడం విశేషమే అని చెప్పాలి. ఆ పదవి చేపట్టినా కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగానే సాగుతూ వచ్చింది. రెండు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ డిపాజిట్లు పోగొట్టుకోవడం రేవంత్కు కూడా డామేజీ అయింది. దానికి తోడు కాంగ్రెస్ లో ఉన్న వర్గ కలహాలు బాగా చికాకు పెట్టాయి.
✍️ప్రత్యేకించి.. కోమటిరెడ్డి సోదరులతో బాగా తగాదాలు వచ్చాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి పదవికి రాజీనామా చేశారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టుకోవడం రేవంత్ కు రాజకీయంగా ఇబ్బంది అయింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాంగ్రెస్ లో ఉంటారా? ఉండరా? అనే సంశయాలు రావడం రేవంత్‌కు బాగా కలిసి వచ్చింది. మిగిలిన నేతలు మల్లు భట్టి వంటివారిలో ఏదైనా అసంతృప్తి ఉన్నా, గట్టిగా విమర్శించే పరిస్థితి లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి అటు ప్రధాని మోదీతో సత్సంబంధాలు కొనసాగించినా, కాంగ్రెస్‌ను వీడలేదు. ఆయా సందర్భాలలో కోమటిరెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిల మధ్య వివాదాలు నడిచాయి. అద్దంకి దయాకర్ అనే నేత కోమటిరెడ్డి పట్ల రేవంత్ సమక్షంలోనే అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కోమటిరెడ్డి దాని ఆధారంగా అసమ్మతి రాజకీయం నడిపారు. దానికితోడు రేవంత్ తెలుగుదేశం బ్రాండ్ గా ఎక్కువకాలం గుర్తింపు పొందిన వ్యక్తి కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ బ్రాండ్, అందులోను వైఎస్‌ఆర్ ముఖ్య అనుయాయిగా గుర్తింపు పొందారు. తాజా పరిణామాలలో రేవంత్ కూడా వైఎస్ఆర్‌ను పొగడడం కోమటిరెడ్డి వర్గానికి కూడా సంతృప్తి కలిగించే అంశమే అవుతుంది!.
✍️అది రాజకీయ వ్యూహమా? లేక వైఎస్ ఆర్ గొప్పదనమా? అంటే రెండూ కావచ్చు. వైఎస్ఆర్ కు తెలంగాణలో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన చేపట్టిన స్కీములు, ప్రాజెక్టులు తెలంగాణకు బాగా ఉపయోగపడ్డాయి. ఈ నేపథ్యంలో రేవంత్ అందరిని కలుపుకుని వెళ్లే దిశలో వ్యూహాత్మకంగా కూడా వైఎస్ఆర్ పేరును వాడుకుంటుండవచ్చు. ఇక కర్నాటక ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో తెలంగాణ లో రాజకీయ సమీకరణలు మారుతుండడం, బీజేపీ వెనుకబడి ,కాంగ్రెస్ పుంజుకుంటున్న వాతావరణం రావడంతో మళ్లీ కాంగ్రెస్ నేతలలో ఒక కదలిక వచ్చింది.కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మళ్లీ సర్దుకుని కాంగ్రెస్ తోనే సఖ్యతగా ఉండడం, పైగా రేవంత్ ,తాను అపూర్వ సహోదరులుగా ఉంటామని చెప్పడం రాజకీయాలలో ఏమైనా జరగవచ్చనడానికి ఇదొక ఉదాహరణ అవుతుంది. తెలంగాణ లో అధికారంలోకి వచ్చినా ఇలాగే కొనసాగుతామని అనడం కూడా కాస్త ఆశ్చర్యం కలిగించే అంశమే.
✍️ రేవంత్ కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అందరిని కలుపుకుని వెళ్లడానికి తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ అవకాశాన్ని గ్రూపు రాజకీయాల కోసం వదులుకుంటే భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఒక అవగాహనకు వచ్చి ఉండాలి. సీఎల్పీ మల్లు భట్టి తన పాదయాత్రలు కొనసాగిస్తూ ఒక ఐడెంటిటి తెచ్చుకునే కృషి చేస్తున్నారు. ఈలోగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నాగర్ కర్నూలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. దామోదరరెడ్డి లాంటివాళ్లు కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్దం అవడం కూడా ఆ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుంది. మరికొందరు కూడా కాంగ్రెస్ లో చేరవచ్చని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.ఆయన పార్టీలో చేరినా, తాను పోటీ చేయకుండా, భార్య లక్ష్మిని అసెంబ్లీకి పోటి పెట్టవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది డిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన అని కూడా అంటున్నారు.
✍️ అలాగే వైఎస్‌ఆర్ టీపీని నడుపుతున్న షర్మిల, టీజెఎస్ నాయకుడు కోదండరామ్‌లు కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఇవన్ని జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయిందన్న భావన ప్రబలి, ప్రజలలో మార్పు వస్తుందని, అప్పుడు బీఆర్‌ఎస్‌ను ఢీ అంటే ఢీ అనవచ్చన్నది, తద్వారా అధికారంలోకి రావచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా ఉంది. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించారని కూడా చెబుతున్నారు. అలాగే వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ఇక్కడే దృష్టి పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అన్నిప్రయత్నాలు చేయవచ్చని అంటున్నారు.ఈ పరిణామాలు కాంగ్రెస్ లో జోష్ పెంచేవే అని చెప్పాలి.
కాంగ్రెస్ ముఖ్య నేతలు తాము కలిసి ఉంటామని చెబుతుండడం ఆ పార్టీ క్యాడర్ కు ఒక రకంగా శుభవార్తే. దీనితో పాటు కాంగ్రెస్ టిక్కెట్ పైన ఎన్నికైన తర్వాత పరిస్థితిని బట్టి పార్టీ నుంచి జంప్ అవ్వరన్న గ్యారంటీ కూడా ప్రజలకు ఇవ్వవలసి ఉంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడొచ్చు. దానిని క్యాష్ చేసుకోవడమే కాకుండా అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన వ్యూహాలను అమలు చేయడానికి కాంగ్రెస్ సన్నద్దమవుతోంది. నిజంగానే కాంగ్రెస్‌కు అధికారం వస్తుందా?అంటే అప్పుడే గ్యారంటీగా చెప్పలేము. కానీ.. ఆ పార్టీనే బీఆర్ఎస్‌కు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గట్టి పోటీ ఇవ్వగలదని ప్రజలలో ఒక విశ్వాసం కల్పించడం వరకు కొంత సఫలం కావచ్చు.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment