ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో ఒక విశిష్ట లక్షణం ఉంది. తనకు లాభం కలుగుతుందా? నష్టం వస్తుందా అన్న దానితో నిమిత్తం లేకుండా ఆయన చెప్పదలచుకున్న విషయాన్ని నిజాయితీగా చెప్పేస్తారు. వాస్తవాలకు దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన చెప్పిన తీరు అలాగే అనిపిస్తుంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాదిరి ప్రతిదానిని తన క్రెడిట్ లో వేసుకోవాలని, ఉన్నవి, లేనివి చెప్పాలని అనుకోరు.
అన్నిటికి జగన్‌నే నిందిస్తూ..
ఒక వైపు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత దుష్ప్రచారం చేస్తున్నా, జగన్ మాత్రం వాస్తవ పరిస్థితిని వివరించే యత్నం చేశారు. వరదల కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని, 2025 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. నిర్వాసితులకు పరిహారం విషయంలో కేంద్రం బాధ్యతను ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం అన్నిటికి జగన్‌నే నిందిస్తూ రాజకీయ లబ్ది కోసం తంటాలు పడుతున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఒక్క మాట అనడానికి సాహసించలేని దుస్థితిలో ఉన్నారు. పోలవరం అన్నది జాతీయ ప్రాజెక్టు. కేంద్రం పూర్తి వ్యయంతో నిర్మించాలి. కాని దానిని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసమో, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో తానే నిర్మిస్తానని చెప్పి ప్రాజెక్టును రాష్ట్ర పరిధిలోకి తీసుకు రావడం మొత్తం సమస్యకు మూలం అయింది. కేంద్రం సాయం కోసం ఎదురు చూసే పరిస్థితిని సృష్టించారు. ప్రాజెక్టు ఆరంభం రోజుల్లో పునరావాస పనులు పెద్దగా అవసరం ఉండదు కనుక అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.
వీటన్నిటిని కప్పిపుచ్చి, తానేదో చేసేసినట్లు..
ప్రాజెక్టు నిర్మాణం జరిగి వరద నీరు నిలిచే కొద్ది గ్రామాలు ముంపునకు గురి అవడం పెరుగుతుంటుంది. ఆ విషయాన్ని దాచేస్తూ చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఈనాడు, జ్యోతి తదితర మీడియా ఎంతసేపు జగన్ ప్రభుత్వంపై రోదిస్తుంటాయి. అదే ప్రాజెక్టు పనులతో సమాంతరంగా నిర్వాసితులకు ఆవాసం కల్పించే పని, పరిహారం ఇచ్చే పని పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఆ సమస్య ఉండేది కాదు. కాని గత ప్రభుత్వం పరిహారంలో సైతం అవకతవకలకు పాల్పడిందని అప్పట్లో బీజేపీ నేతలు విమర్శిస్తుండేవారు. ప్రధానమంత్రి మోదీ స్వయంగా చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఎటిఎం మాదిరి వాడుకున్నారని విమర్శించారు. వీటన్నిటిని కప్పిపుచ్చి, తానేదో చేసేసినట్లు, జగన్ ఏదో పాడు చేసినట్లు పిక్చర్ ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు.
చంద్రబాబు విఫలం..
డెబ్బై రెండు శాతం పని తన హయాంలోనే పూర్తి అయిందని అసత్యాలు చెబుతున్నారు. మొత్తం ఏభై ఆరువేల కోట్ల వ్యయం అవుతుందని చంద్రబాబు ప్రభుత్వమే అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపించింది. చంద్రబాబు టైమ్‌లో మొత్తం మీద పదివేల కోట్ల వ్యయం జరిగింది. నిజంగానే డెబ్బై రెండు శాతం పని పూర్తి అయి ఉంటే నలభై వేల కోట్లకు పైగా వ్యయం చేసి ఉండాలి కదా? కేంద్రం నుంచి సకాలంలో నిధులు సాధించడంలో విఫలం అయిన చంద్రబాబు గొప్పలు మాత్రం బాగానే చెప్పుకుంటారు. అసలు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లకుంటే చంద్రబాబు అసలు పట్టించుకునేవారే కాదు.
ఈనాడు, జ్యోతి డబ్బా..
ఎందుకంటే అంతకుముందు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ప్రాజెక్టు ఊసే రానిచ్చేవారు కాదు. ఇప్పుడు మాత్రం తన కల అని అబద్దాలు చెప్పుకు సాగుతున్నారు. దానికి ఈనాడు, జ్యోతి డబ్బా కొడుతుంటాయి. ఈనాడు మీడియా అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నిసార్లు పునరావాసంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టోరీలు అల్లిందో చెప్పలేం. కొద్ది రోజుల క్రితం సీఎం వరద ప్రాంతాలలో పర్యటిస్తారనగా, మళ్లీ చెత్త కథనాన్ని ఇచ్చింది. కేంద్రం నిర్వాసితులకు నిధులు ఇవ్వడంలో జాప్యం చేస్తోందని ఈ మీడియా రాయలేదు. జగన్ సర్కార్ నిర్వాసితులను ముంచేస్తోందని నీచంగా రాసింది. వరదలు వచ్చినప్పుడు ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కవలసి వస్తోందని రాసింది.
ఈనాడు పుచ్చు వార్తలు..
నిజానికి ప్రభుత్వం సహాయ శిబిరాలు ఏర్పాటు చేస్తుంది. ఆ విషయాన్ని కప్పిపుచ్చింది.ప్రాజెక్టు లేకపోయినా, అనేక గ్రామాలు నీటబారిన పడుతుంటాయి. అప్పుడు కూడా క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఎవరైనా కొద్ది మంది వాటిలోకి రాకపోతే కొండలు ఎక్కుతుంటారు.అది వేరే సంగతి. ప్రజలు వంకాయలు, బంగాళా దుంపలు కోరుకోవడం లేదట. శాశ్వత పునరావాసం అడుగుతున్నారట. మరి చంద్రబాబు టైమ్‌లో వంకాయలు ఇచ్చినా ఫర్వాలేదనుకున్నారా? ఇక్కడ ఇంకో మాట చెప్పాలి. జగన్ ప్రభుత్వం కూరగాయలు, నిత్యావసరాలు సరఫరా చేసినా ఈనాడు మీడియా ఎంత ఘోరంగా వార్తలు ఇచ్చిందంటే వంకాయలు పుచ్చిపోయాయని, అక్కడ అందలేదు.. ఇక్కడ అందలేదు.. అంటూ పుచ్చు వార్తలు రాసింది.
చదవండి: పక్కా స్కెచ్చేనా..? అందుకే వాస్తవాలు రాయడానికి చేతులు రాలేదా రామోజీ?
తెలంగాణలో వరదల వల్ల నలభై మంది చనిపోతే అక్కడ కేసీఆర్ వరదలను బాగా కంట్రోల్ చేశారని రామోజీరావు సంపాదకీయం రాశారు. అదే ఏపీలో ఒకరు కూడా వరదల వల్ల చనిపోకపోయినా, లంక గ్రామాలలో సహాయ చర్యలు చేపట్టినా, జగన్ గోదావరి వరదను ఆపలేకపోయారని రాశారంటే వారు ఎంత కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తలుగా మారిపోయారో అర్ధం అవుతుంది. జగన్ వరద ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఎవరూ తమకు సాయం అందలేదని చెప్పకపోవడంతో ఈనాడుకు దిక్కుతోచలేదు. అందుకే ఏమని రాశారో తెలుసా? గ్రామ సచివాలయాలలో ఉండే గ్రామ పోలీసులతో ప్రజలకు మంచినీళ్లు అందించారని తప్పు పట్టింది. బందోబస్త్ విధులలో వారిని వాడబోమని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందట.
చదవండి: పుంగనూరు అల్లర్లు: ఆ 2 వేల మంది ఎవరు?
రామోజీ దిగజారుడు రాతలు..
అయినా వాళ్లతో ప్రజలకు మంచినీళ్లు ఇప్పిస్తారా అంటూ దిగజారుడు రాతలు రాసిందంటే రామోజీ ఎంత నేలబారుగా మారిపోయారో అర్ధం అవుతుంది. జగన్‌కు ప్రజలు తమ పరిహారం గురించి అడిగినప్పుడు చాలా స్పష్టంగా కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నామని, కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తే పదిహేడువేల కోట్లు వస్తాయని, వాటిలో నిర్దిష్ట భాగం పరిహారంగా చెల్లిస్తామని చెప్పారు.అంతేకాక ప్రాజెక్టు ఆలస్యానికి కారణాలు వరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా డయాఫ్రం వాల్ నిర్మించడం వల్ల వరదలకు అది దెబ్బ తిన్న విషయాన్ని తెలిపారు. అందువల్ల 2025 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తి అవుతుందని చెప్పారు. ఇది ఆయనకు కొంత ఇబ్బంది అయిన విషయమే. కాని ఆయన అసత్యం చెప్పకుండా వాస్తవం చెప్పడానికి యత్నించినట్లు అర్దం అవుతుంది. ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్టు అవాంతరాలను అధిగమించి సత్వరమే పూర్తి అవుతుందని ఆశిద్దాం.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment