ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటనే చేశారు. ఏపీలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ జరిపి చర్య తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఎంత గొప్పగా సెలవిచ్చారు!. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు ఏపీ పర్యటనలో ఆరోపణలు చేశారు కనుక వెంటనే విచారణ జరపాలని ఆయన అంటున్నారు. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని ఒక నానుడి ఉంది. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ఉద్దేశించి అలా అనకూడదేమోకాని, అనక తప్పని పరిస్థితిని ఆయన తెచ్చుకున్నారు.
స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుంటే, చంద్రబాబు వాటిని ఎటిఎం మాదిరి వాడుకుని అవినీతికి పాల్పడుతున్నారని చెప్పారు. అయినా ఇంతవరకు విచారణే జరగలేదు. పోలవరం నిర్వాసితుల భూముల కుంభకోణం కాని, ప్రాజెక్టు కాంట్రాక్టుల మార్పులో వచ్చిన ఆరోపణపై కానివ్వండి.. సీబీఐ విచారణ చేయాలని ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కోరితే ఇంతవరకు కేంద్రం పట్టించుకోలేదు. అది చంద్రబాబు మేనేజ్‌మెంట్ స్కిల్ అని అనుకోవాలా? దీని కంటే ముఖ్యమైనది స్వయంగా ఆయన పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి 2 వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని అధికారిక ప్రకటన చేశారు.
ఇది జరిగి అప్పుడే నాలుగేళ్లు అయింది. అయినా ఇంతవరకు ఆ ఫైల్ కదలలేదు. వైసీపీ ప్రభుత్వం అమరావతి లాండ్ స్కామ్ గురించికాని, స్కిల్ డెవలప్‌మెంట్ నిధుల స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్ వంటివాటిలో చంద్రబాబుపై కేసులు పెట్టింది. అంతేకాక వాటిపై సీబిఐతో విచారణ జరిపినా తమకు అభ్యంతరం లేదని రాష్ట్రం తెలిపింది. అయినా కేంద్రంలో ఉలుకులేదు.. పలుకు లేదు. అది చంద్రబాబు ఆర్ట్ అని అనుకోవాలి. అదే టైమ్ లో ఈ స్కామ్ లలో జగన్ ప్రభుత్వం విచారణ చేపట్టరాదని తెలుగుదేశం నేతలు హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. చివరికి సుప్రింకోర్టు వరకు వెళ్లి పోరాడి కొంత మేర విచారణకు ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇన్ని కథలు ఇక్కడ పెండింగులో ఉన్నాయి కదా! చంద్రబాబు నాయుడు ఏమని కోరాలి? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినట్లు చెబుతున్న ఏ స్కామ్ పైన అయినా విచారణ చేసుకోవచ్చని ధైర్యంగా ఎన్నడైనా చెప్పారా? పోనీ జగన్ సర్కార్ అయితే రాజకీయ లక్ష్యంతో దర్యాప్తు జరిపించే అవకాశం ఉందని అనుకుంటే ఆయనే స్వయంగా సీబిఐకో, లేక కేంద్ర హోం శాఖ కో, లేక ప్రధాన మంత్రికో లేఖ రాసి ఉండవచ్చు కదా! అప్పుడు ఆయన పేరు దేశం అంతటా మారుమోగేది కదా! ఆ పని చేయకపోగా, ఏ ఒక్క కేసు ముందుకు కదలకుండా ఎన్నో బ్రేకులు ఎందుకు వేస్తున్నారు. పైగా తన ప్రభుత్వంలోని అవినీతి పై విచారణ చేస్తే అది కక్ష అని చంద్రబాబు ఎందుకు ప్రచారం చేస్తున్నారు.
అమరావతి లాండ్ స్కామ్‌లో అలైన్ మెంట్ మార్పులో క్విడ్ ప్రో కింద లింగమనేని రమేష్ నుంచి భవనాన్ని చంద్రబాబు ఉత్తపుణ్యానికి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. మరి దానిపై ఇంతవరకు సవివరమైన వివరణ ఎందుకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఆ ఇంటిని ప్రభుత్వం జప్తు చేయాలని సంకల్పించింది. అలాగే తన వద్ద మంత్రిగా పనిచేసిన నారాయణ తన బినామీలతో ఎన్ని ఎకరాల భూమిని కొనుగోలు చేసింది సీఐడీ ఆధార సహితంగా చూపిస్తోంది కదా! దానిని అవినీతి అంటారా? అనరా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలే బయటకు వస్తాయి. కాకపోతే కుప్పం పర్యటనలో చంద్రబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది.
చదవండి: అమిత్ షా, జేపీ నడ్డా మాటల్లో నిజమెంత?
చంద్రబాబు తనకు ఎన్ని మచ్చలు ఉన్నా వాటిని ఎవరూ చూడరులే అనుకున్నట్లుగా మాట్లాడితే జనం అమాయకులా! బీజేపీ పెద్దలు జగన్ ప్రభుత్వంపై ఎక్కడైనా నిర్దిష్ట ఆరోపణలు చేశారా?లేదే. సాధారణంగా అన్ని వ్యతిరేక పక్షాల మీద చేసినట్లే విమర్శలు చేసి వెళ్లిపోయారు. ఫలానా ప్రాజెక్టులో అవినీతి అని కాని, ఫలానా స్కీమ్‌లో అవినీతి కాని ఒక్కటైనా చెప్పారా?లేదే!. ముఖ్యమంత్రి జగన్ పేదలకు ఇంతవరకు రెండులక్షల పది వేల కోట్ల మేర ఆర్దిక సాయం అందిస్తే, అందులో ఒక్క రూపాయి అవినీతికి ఆస్కారం లేకుండా కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా పంపిణీ చేస్తున్నది వాస్తవం కాదా!.
చంద్రబాబు టైమ్‌లో ఇసుక మాఫియా ఎలా విజృంభించింది అందరికి తెలుసు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను ఎలా హింసించింది గుర్తుకు తెచ్చుకుంటేనే ప్రజలకు వళ్లు మండుతుంది. అయినా వాటన్నిటిని జనం మర్చిపోయి ఉంటారులే అనుకునో, లేక యథాప్రకారం తన స్వభావానికి అనుగుణంగా ఈ స్టేట్ మెంట్ ఇచ్చారో తెలియదు కాని, అది చంద్రబాబుకే బూమ్ రాంగ్ అవుతుందన్న సంగతి గుర్తించాలి. ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వంలో ఏవైనా అక్రమాలు జరిగాయని భావిస్తే, అవేమిటో చెప్పి విచారణ కోరాలి కాని, గుడ్డకాల్చి ముఖాన పడవేసినట్లు వ్యవహరిస్తే సరిపోతుందా?.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ నేతగా ఉన్న సోము వీర్రాజు ఒక ఆరోపణ చేసేవారు. ఆనాటి ప్రభుత్వ పెద్దలు, టీడీపీవారు కలిసి చెట్టు-నీరు నిధులు కాని, మరుగుదొడ్ల నిర్మాణానికి వెచ్చించాల్సిన కేంద్ర నిధులు కాని పదమూడువేల కోట్లు తినేశారని చెప్పేవారు. అంత స్పష్టంగా ఆయన ఆరోపణలు చేసినా చంద్రబాబు ప్రభుత్వం రాయిమాదిరి మౌనంగా ఉందే తప్ప ఎన్నడైనా స్పందించిందా! ఇప్పుడు మాత్రం ప్రభుత్వంపై విచారణ చేయాలట. ఏదో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ బానిస పత్రికలకు హెడ్‌లైన్స్ ఇవ్వడానికి ఈ డిమాండ్ చేసినట్లు కనిపిస్తుంది తప్ప ఇంకొకటి కాదు.
చదవండి: ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కేసీఆర్ ఏమంటారో!
చంద్రబాబులో కనీస విజ్ఞత ఉన్నా, ఆయనకు ధైర్యం ఉన్నా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌ల విచారణకు సిద్దమని చెప్పి లేఖ రాసి, ఆ తర్వాత ఈ ప్రభుత్వంపై ఏదైనా ఆరోపణ చేస్తే కొంతైనా అర్ధం ఉంటుంది తప్ప, లేకుంటే ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ విశ్వాసంలోకి తీసుకోరు. ఇంకో సంగతి చెప్పాలి. లక్ష మెజార్టీ సాధించాలన్న నినాదంతో చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారట. గత స్థానిక ఎన్నికలలో టీడీపీ కుప్పంలో దారుణంగా పరాజయం చెందిన నేపథ్యంలో తనకు అపజయం ఎదురుకాకుడదన్న భయంతో ఇదేదో కొత్త ట్రిక్కు ప్రయోగిస్తున్నట్లుగా ఉంది.
టీడీపీ పత్రికలోనే వచ్చిన ఒక విషయం ప్రకారం స్థానిక ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇళ్లకే పరిమితమైన టీడీపీ క్యాడర్ అనండి.. స్థానిక నేతలనండి.. వారిని కలిసి ఆత్మస్థైర్యం నింపడానికి చంద్రబాబు యత్నిస్తున్నారట. దీనిని బట్టి ఏమి అర్ధం అవుతుంది. ఇప్పటికే కుప్పంలో టీడీపీ క్యాడర్ కాడి పారేసిందనిపించడం లేదా! ఆ కష్టాల నుంచి బయటపడడానికి చంద్రబాబు ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు కుప్పంలో కష్ట పడుతున్నారు. లక్ష మెజార్టీ సంగతి దేముడెరుగు.. ముందు తనను గెలిపిస్తే చాలు అన్న విధంగా చంద్రబాబు యాత్ర జరుగుతోందన్న భావన కలగడం లేదా!. ఇదిలా ఉంటే చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఏదో అడ్డుపడుతోందన్న మరో అబద్దపు ఆరోపణ. నాకు తెలిసింది ఏమిటంటే ఇంతవరకు చంద్రబాబు తరపున లాండ్ కన్వర్షన్ కే దరఖాస్తు చేయలేదట. అది అయిన తర్వాత హౌస్ ప్లాన్‌కు అనుమతి వస్తుంది. ఇంత సీనియర్ నేతకు ఈ విషయం తెలియదా!
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment