టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రజలలో సానుభూతి కోసం చాలా కష్టపడుతున్నారు. ఆయన తరపున ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు కూడా అదే తరహాలో పనిచేస్తున్నాయి. ఆయన భావోద్వేగానికి గురయ్యారంటూ అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఒక ఖాళీ కుర్చీ సన్నివేశాన్ని కూడా సృష్టించినట్లు అనిపిస్తుంది. అలాగే చంద్రబాబుకు తన తల్లి, భార్య విషం పెడతారంటూ కొందరు చేసిన ఆరోపణను కూడా సింపధీ కోసమే ప్రస్తావించినట్లు కనబడుతుంది.
✍️ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి యథా ప్రకారం సైకో వ్యాఖ్యలు చేయడం, లేనిపోని ఆరోపణలు మోపడం వంటివి చేశారు. తండ్రి చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో అరెస్టు అయి రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో పార్టీకి ఒక దశ,దిశ లేకుండా పోయాయని, పార్టీ కార్యకర్తలు నిరాశ, నిస్పృహలో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను తయారు చేసుకోవడం లో తప్పు లేదు. కాని ఆ సందర్బంలోనే ఖాళీ కుర్చీ ఉంచవలసిన అవసరం ఉంటుందా? అన్న సందేహం వస్తుంది. అది చంద్రబాబు పట్ల గౌరవంతో చేసిందే కావచ్చు. కాని కొద్ది రోజుల క్రితం ఆయన బావమరిది, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు స్థానంలో కూర్చుని అద్యక్షత వహించారన్న ప్రచారం నేపథ్యంలో ఇలా చేసి ఉండవచ్చు.
✍️ఆ తర్వాత బాలకృష్ణకు సంబంధించిన వార్తలను తెలుగుదేశం మీడియానే బహిష్కరించింది. దాంతో ఇదేదో నందమూరి, నారా కుటుంబాల మధ్య అంతరం ఏర్పడిందా అన్న చర్చకు ఆస్కారం ఏర్పడింది. ఆ తర్వాత బాలకృష్ణను సైడ్ లైన్ చేశారు. తెలంగాణ పార్టీని చూసుకోవాలని చెప్పినట్లు ఉన్నారు. దాని సంగతేమో కాని, ఆయన హాపీగా సినిమా ఫంక్షన్‌లలో పాల్గొని అమ్మాయిల మీద చెణుకులు విసురుతున్నారు. అది వేరే విషయం.
✍️ఇక ఈ సమావేశం విషయానికి వస్తే లోకేష్ కూడా అధ్యక్ష స్థానంలో కూర్చోకుండా జాగ్రత్తపడ్డారని టీడీపీ వర్గాలు భావించవచ్చు. కాని గతంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావుకు ఈ పాటి గౌరవం అయినా దక్కలేదే అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎన్.టి.ఆర్. స్థాపించిన టీడీపీని చంద్రబాబు లాక్కొన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి కిందకు తోసేశారు. ఆయన పార్టీ గుర్తు స్వాధీనం చేసుకున్నారు. చివరికి పార్టీ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలోని డబ్బును కైవసం చేసుకున్నారు. పార్టీ నుంచి బయటకు పంపినట్లు ప్రకటించారు.
✍️వైస్రాయి హోటల్ వద్ద చెప్పులు వేసి మరీ అవమానించారు. పైగా అప్పట్లో చంద్రబాబే స్వయంగా ఎన్.టి.ఆర్.కు విలువలు లేవని విమర్శలు చేశారు. అంతే తప్ప, పార్టీలో గొడవలు జరిగినా ఎన్.టి.ఆరే తమ నాయకుడని ఆయన జీవించి ఉన్నంత కాలం ఏనాడు అనలేదు. ఒక ఖాళీ కుర్చీని ఆయన కోసం వదలివేయలేదు. ఎన్.టి.ఆర్. మరణించిన తర్వాత అసలు తామే ఎన్.టి.ఆర్. వారసులమని మాత్రం ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించుకున్నారు. అయినా ఆయన కోసం ఇలా ఖాళీ కుర్చీ వదలలేదు. అంటే దీని అర్ధం ఎన్.టి.ఆర్.ను ఆయన కుమారులు, అల్లుళ్లు ఎవరూ గౌరవించలేదని అనుకోవాలా? కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఇలాంటి ఖాళీ కుర్చీ సన్నివేశాలు జరిగినా, వాటి గురించి,ఆ సందర్భాల గురించి ఇక్కడ ప్రస్తావించడం సముచితంగా ఉండదు.
✍️ఇక లోకేష్ చేస్తున్న విమర్శలను పరిశీలిద్దాం. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి లు చంద్రబాబుకు విషం పెడతారని అంటారా అని కొందరు వైసీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. నిజమే ఎవరూ అలా అనరాదు. కాని అందుకు అవకాశం ఇచ్చింది లోకేష్, ఇతర కుటుంబ సభ్యులే కదా! చంద్రబాబును జైలులోనే ఏదో చేసేస్తారని, కుట్రలు జరుగుతున్నాయని అన్నప్పుడు అందుకు సమాధానంగా .. అయ్యా.. చంద్రబాబుకు ఇంటి నుంచే ఆహారం వస్తోంది కదా? అందులో ఏమైనా చేస్తే కుటుంబం వారే చేయాలి కదా అని పేర్కొన్నారు. ఆరోపణ చేసేటప్పుడు దానికి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఆలోచించుకోకుండా చేస్తే ఇలాగే ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి.
✍️లోకేష్ అయితే తన తండ్రి ఆరోగ్యంపై భావోద్వేగం చెందారని ఈనాడు పత్రిక రాసిందే. మరి అంతకుముందే ఇతర టీడీపీ నేతలు అంతా బాగుందని చెప్పారే. తండ్రి ఆరోగ్యంపై అనవసర అనుమానాలు లేవనెత్తింది ఎవరు? జైలు పై దాడి జరిగే అవకాశం ఉందని కూడా ఆయన సందేహపడ్డారు. మరో వైపు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వంటివారు జైలు గోడలు బద్దలు కొట్టి అయినా చంద్రబాబును బయటకు తీసుకు రావాలిపిస్తోందని ఎందుకు అన్నారో చెప్పాలి. అప్పుడు ఎవరి మీద డౌట్లు వస్తాయి? తన తల్లిని,భార్యను అంటారా అంటూ లోకేష్ ముఖ్యమంత్రి పై మళ్లీ దారుణమైన ఆరోపణలు చేశారు.
✍️మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్‌పై నేరుగా ఆరోపణలు చేస్తున్న లోకేష్‌కు అది సైకోలాగా మాట్లాడడం అని తెలియదా? తాను ఏమైనా మాట్లాడవచ్చుకాని, ఎదుటివారు ఏదైనా అన్నప్పుడు అమ్మో అంత మాట అంటారా అంటే కుదురుతుందా? జగన్ గతంలో జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కాని, టీడీపీ నేతలు కాని ఎన్ని నీచమైన విమర్శలు చేశారో బహుశా లోకేష్‌కు తెలిసి ఉండకపోవచ్చు. అప్పట్లో ఆయన రాజకీయాలలోకి రాలేదు. అమెరికాలో చదువుకుంటూ ఎంజాయ్ చేస్తున్న రోజులవి. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు టీడీపీ సృష్టించిన వదంతులు ఎన్నో ఆనాటివారందరికి తెలుసు.
✍️అంతెందుకు రెండేళ్ల క్రితం రాజంపేట పర్యటనకు వెళ్లి చంద్రబాబు ఏమన్నారో గుర్తు లేదా! జగన్ గాలిలో వస్తాడు.. గాలిలోనే పినిష్ అవుతారని అన్నప్పడు అవి సైకో మాటలు అనిపించలేదు. ఈ సంగతులు పక్కనబెడితే లోకేష్ తెలిసి అంటున్నారో, తెలియక అంటున్నారో కాని, వ్యవస్థలను జగన్ మేనేజ్ చేసి చంద్రబాబును జైలులో ఉంచుతున్నారని, బెయిల్ రాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానికి జగన్‌కు అంత శక్తి ఉంటే ఇన్నేళ్లుగా టీడీపీ నుంచి ఇన్ని సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కుంటారు? కోర్టుల్లో పదుల సంఖ్యలో లాయర్లు, అంతర్జాతీయ స్థాయి లాయర్లను ఉపయోగించి కేసు కొట్టివేయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడితే అందుకు జగన్ కారణం ఎలా అవుతారు?
✍️కేసులో చంద్రబాబు పై వచ్చిన అభియోగాలలో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జిలు భావించడం కాదా? లోకేష్ వ్యాఖ్యలు జడ్జిలను అవమానించడం కాదా? ఈ కేసులో మిగిలినవారికి ముప్పై రోజులలో బెయిల్ వచ్చిందని, తన తండ్రికి ఎందుకు రాలేదని ఆయన అంటున్నారు. నిజమే.. వారు కేసులలో విచారణకు ఎంతో కొంత సహకరించారు. తప్పులను కొన్నిటినైనా ఒప్పుకున్నారు. చంద్రబాబు అలా చేయడం లేదు కదా? అంతదాకా ఎందుకు మాజీ పి.ఎస్.పెండ్యాల శ్రీనివాస్ ఎందుకు అమెరికా పారిపోయింది చెప్పగలిగే పరిస్థితి లోకేష్‌కు ఉందా? పైగా 17 ఎ ఉపయోగపడితే కేసులు లేకుండా పోతాయని భావించి బెయిల్ కోసం అప్లై చేయంది టీడీపీ లాయర్ల టీమ్ కాదా? ఇవన్ని వదలిపెట్టి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ఏమి ఉపయోగం? తన తండ్రి నిస్వార్దపరుడని లోకేష్ ప్రచారం చేసుకోవచ్చు.
చదవండి: ఆ ప్రశ్నకు ఎందుకు సమాధానం దాటేశావ్ లోకేషా?
✍️అచ్చం పార్టీ సభ్యులు వంద రూపాయలు చొప్పున కట్టిన సొమ్మే టీడీపీ ఖాతాలో ఉందని చెప్పవచ్చు. కాని దానిని ఎంత మంది నమ్ముతారు? కనీసం టీడీపీ క్యాడర్ అయినా నమ్ముతుందా? ప్రజల కోసమే తప్ప కుటుంబం కోసం చంద్రబాబు ఆలోచించలేదని లోకేష్ చెప్పడం వినడానికి బాగానే ఉంటుంది. నిజానికి కుటుంబం గురించి పట్టించుకోవడం తప్పేమీ కాదు. కాని బిల్డప్ కోసం అబద్దాలు చెప్పడమే తప్పు. లోకేష్ అమెరికాలో చదువుకోవడానికి ఎవరి నుంచి సాయం పొందింది తెలియదా? లోకేష్ రాజకీయాలలోకి రారని గతంలో ఒక సందర్భంలో చెప్పారు. కాని కనీసం ఎమ్మెల్యే కాకుండా ఎందుకు ఎమ్మెల్సీని చేశారు? ఆ తర్వాత ఏమి అనుభవం ఉందని ఆయనను మంత్రిని చేశారు? అది కూడా మూడు శాఖల మంత్రి.
✍️అంతేకాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే మొత్తం చక్రం తిప్పిందంతా లోకేష్ కాదా? ఇప్పుడేవో కథలు చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వింటారా? చంద్రబాబు మాదిరి ఎదుటివారిపై వ్యక్తిగత దూషణల ద్వారా తాను కూడా రాజకీయం చేయాలని లోకేష్ భావిస్తున్నట్లుగా ఉంది.కాని ఈ రోజులలో అది అయ్యే పనికాకపోవచ్చు. ఒకవైపు చంద్రబాబు జైలులో ఉంటే, భార్య భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉండి ఆయనకు అవసరమైన ఆహార విషయాలను జాగ్రత్తగా చూసుకుంటారనుకుంటే, ఆమె కూడా రాజకీయ యాత్ర ఎందుకు చేస్తున్నారు? ఏమిటి ఆమె లక్ష్యం? సానుభూతి రాజకీయం కాదా? ఇంకో విషయం ఏమిటంటే చంద్రబాబు పక్షాన నలభై ఐదు రోజులపాటు లోకేష్ మీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తారట. అంటే అప్పటిదాకా చంద్రబాబు జైలునుంచి బయటకు రాలేరని లోకేష్ ముందుగానే ఫిక్స్ అయిపోయారా?
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment