తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీనపడుతున్నారా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోనూ బాబు స్థానాన్ని క్రమేపీ కుమారుడు లోకేష్ ఆక్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బాబును ఇరకాటంలో పెడుతున్నాయి.
రాజ్యసభకు పార్టీ ఎంపికలు, పవన్ అన్న నాగబాబుకు మంత్రి పదవి వంటి నిర్ణయాలు ఆ ఇబ్బందికి నిదర్శనమంటున్నారు. టీడీపీకి రాజ్యసభలో అసలు బలం లేని నేపథ్యంలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన బాబు ఆ స్థానాలకు ఇతర పార్టీల వారికి కట్టబెట్టడం ఆయన పరిస్థితిని సూచిస్తోంది. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ తాను వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే.. అన్న నాగబాబుకు ముందు టీటీడీ ఛైర్మన్ పదవి ఆ తరువాత రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారని పలు వదంతులు వచ్చాయి. అయితే, లోకేష్ ఒత్తిడితో టీటీడీ ఛైర్మన్ పదవి కాస్తా టీవీ-5 ఛైర్మన్ బీఆర్.నాయుడికి దక్కిందని, రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ లోకేష్ తన మాట నెగ్గించుకున్నారని సమాచారం.
ఇక, నాగబాబుకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి రహస్యమేమీ కాదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి ఆయన తన ఆసక్తిని పలు రూపాల్లో వ్యక్తం చేశారు కూడా. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత కూడా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రచారంలోనే ఉన్నారు ఆయన. సినిమాల్లో బాగా నష్టపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నను ఆదుకున్నట్లు చెబుతారు. కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు నాగబాబు ‘‘తాము పిలిచినా రాకపోతే ఏం చేయాలి’’ అని పవన్‌ను ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించినా.. తరువాతి కాలంలో ఆయనతోనే రాజకీయ పయనం సాగించడం గమనార్హం. ఇందులో భాగంగా 2019లో నరసాపురం నుంచి లోక్‌సభకు జనసేన తరఫున పోటీ చేసినా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు ఆయన. తరువాతి కాలంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో నాగబాబు కూడా ఆయన వెంట నడిచారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని టాక్ వచ్చినా.. పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని బీజేపికి వదులుకోవాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంతోనే టీటీడీ ఛైర్మన్ ఆయనకు ఇప్పించేందుకు పవన్ ప్రయత్నించినా లోకేష్ ప్రాభవం ముందు నిలవలేకపోయారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ తన కుటుంబ సభ్యులకు పదవి అడగలేదని పవన్ చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ తరువాత రాజ్యసభ సీటైనా నాగబాబుకు ఇప్పించాలని పవన్ నానా ప్రయత్నాలూ చేశారు. బీజేపీ ఈ స్థానాన్ని ఆశించకపోతే అన్నకు దక్కుతుందన్న అంచనాతో ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మంతనాల వెనుక బాబు ఉండి ఉండవచ్చు. అయితే, బీజేపీ అనూహ్యంగా ఏపీ నుంచి ఒక సీటు ఆశించడంతో నాగబాబుకు మళ్లీ ఆశాభంగమైంది. మూడు రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీ ఒకటే తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంచనాతో నాగబాబును సీటు వదులుకోమని చంద్రబాబే నచ్చజెప్పి ఉండాలి. అదే సమయంలో పవన్ అసంతృప్తికి గురి కాకుండా మంత్రి పదవి ఆఫర్ చేసి ఉండవచ్చు.
అయితే, దీనిపై టీడీపీ, జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఏర్పడింది. జనసేన కోసం పనిచేస్తున్న పలువురు నేతలను కాదని, సోదరుడి పదవి కోసం పవన్ పట్టు పట్టారన్న విషయం విమర్శలకు దారి తీసింది. జనసేన కూడా కుటుంబ పార్టీయేనని తేలిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ జనసేన నుంచి నలుగురు మంత్రులు ఉంటే ముగ్గురు కాపు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పదవులు వద్దంటూనే పవన్, నాగబాబులు వాటి కోసం పాకులాడారని భావిస్తున్నారు. పవన్‌కు ఆర్థికంగా అండదండలు అందించిన లింగమనేని రమేష్‌కు రాజ్యసభ స్థానం దక్కుతుందని కథనాలు వచ్చినా, పవన్, చంద్రబాబులిద్దరూ ఇప్పటికైతే మొగ్గు చూపలేదు.
మరోవైపు.. టీడీపీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ తదితరులు రాజ్యసభ స్థానం ఆశించి భంగపడ్డారు. మంత్రిపదవి కూడా దక్కని నేపథ్యంలో యనమల చిరకాల వాంఛ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెను ఎక్కడంలో యనమలది కీలక భూమిక అన్నది తెలిసిందే. గతంలో స్పీకర్‌గా ఉండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం సులువైన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కంభంపాటి రామ్మోహన్ రావు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేస్తూ చంద్రబాబుకు ఉపయోగపడుతుంటారు. గతంలో ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండేవారు. మళ్లీ అదే పదవి అయినా ఇస్తారో, లేదో చూడాలి.
2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఇచ్చినట్లే ఇచ్చి, చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకు కేటాయించారు. ఈసారి రామయ్య పేరును పరిశీలనకు తీసుకోలేదు. గల్లా జయదేవ్ కూడా ఆశించినా అవకాశం ఇవ్వలేదు. మరో నేత అశోక్ గజపతిరాజు ప్రస్తావన వచ్చినా, ఈ పోటీలో ఆయన వెనుకబడిపోయారు. వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, లోకేష్‌కు సన్నిహితుడైన సానా సతీష్‌కు చెరో సీటు లభించింది. సానా సతీష్ కాకినాడ నుంచి జనసేన తరఫున లేదంటే టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ పదవి పొందారు. ఈయన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరపడంలో పేరు గాంచడంతోపాటు ఆర్థికంగా బలవంతుడు అవడం, అన్నిటికి మించి లోకేష్ అండదండలతో పదవి పొందారని అనుకోవాలి. బీదా మస్తాన్ రావు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే. నెల్లూరు జిల్లాలో రొయ్యల సీడ్ ప్లాంట్‌లు తదితర వ్యాపారాలు ఉన్నాయి.
2019 ఎన్నికలలో టీడీపీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత వైఎస్సార్‌సీపీలో రాజ్యసభ సీటు సంపాదించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ అదే స్థానాన్ని టీడీపీ నుంచి పొందడం విశేషం. ఈయన సోదరుడు రవిచంద్ర కూడా లోకేష్ కు సన్నిహితుడుగా చెబుతారు. టీడీపీలో కాకలు తీరిన నేతలను కాదని, వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఈయనకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తికి తావిచ్చారని చెప్పాలి. మరో సీటును బీజేపీకి కేటాయించారు. ఈ సీటు కూడా మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారు. బీజేపీకి వేరే నేతలు ఎవరూ లేనట్లు తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు మళ్లీ ఇదే సీటు ఇవ్వడంపై ఆ పార్టీలోనే అసమ్మతి ఉంది.
గతంలో ప్రధాని మోడీని అసలు బీసీ నాయకుడే కాదని, పలు విమర్శలు చేసిన కృష్ణయ్యకు ఈ పదవి ఇవ్వడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణయ్య తనకు సీటు ఇచ్చిన రోజునే బీజేపీలో చేరడం కొసమెరుపుగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలని ఇలా చేసి ఉండవచ్చని అంటున్నా, టీబీజేపీ నేతలు ఈయనపట్ల పెద్దగా ఆసక్తిగా లేరు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఈయనకు విశేష ప్రాధాన్యం ఇచ్చి పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇస్తే ఇప్పుడు ఇలా చేశారు. రాజ్యసభ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులను టీడీపీ ఆకర్షించింది. వారిలో ఇద్దరు మళ్లీ టికెట్లు పొందితే, మరో నేత మోపిదేవి వెంకట రమణకు దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో చూడాలి. ఈ ఎంపికలకు సంబంధించి మరో విశేషం చెప్పుకోవాలి.
చంద్రబాబుకు తానే ప్రధాన సలహాదారుడనని, టీడీపీ ప్రభుత్వం తనవల్లే నడుస్తోందని భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీవీ-5 యజమాని బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడాన్ని రాధాకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారట. అయినా లోకేష్ పట్టుబట్టి ఈ పదవి ఇప్పించడం ద్వారా రాధాకృష్ణకు ఝలక్ ఇచ్చారన్న విశ్లేషణలు వచ్చాయి. ఆ వార్తకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక తీరు కూడా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో అక్టోబర్‌లోనే సానా సతీష్‌కు వ్యతిరేకంగా రాధాకృష్ణ పెద్ద కథనం రాయించారు. అందులో సతీష్‌పై పలు ఆరోపణలు చేశారు. కాకపోతే సానా అన్న పదం బదులు చానా అని రాసి పరోక్షంగా రాసి హెడ్డింగ్ కూడా చానా ముదురు అని ఇస్తూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. లోకేష్ పేరుతో దందాలు చేస్తున్నారని, ఉత్తరాంధ్రలో మైనింగ్ తదితర రంగాలలో అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని, సీబీఐలో సైతం చిచ్చు పెట్టిన వ్యక్తి, అనేక స్కామ్‌లతో సంబంధం ఉన్నవాడని ఆంధ్రజ్యోతి రాసింది. అయినా లోకేష్ దానిని లెక్క చేయలేదు. తండ్రిపై ఒత్తిడి తెచ్చి సతీష్‌కే రాజ్యసభ పదవి ఇప్పించారు. రాధాకృష్ణను లోకేష్ నమ్ముతుండకపోవచ్చు. లేదా తన తండ్రి మాదిరి రాధాకృష్ణ బ్లాక్ మెయిలింగ్‌కు తాను లొంగనన్న సంకేతం ఇచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.
అంతేకాక, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీని మోయడం తప్ప గత్యంతరం లేదని, అందువల్ల ఆయన మాటకు అంత విలువ ఇవ్వనవసరం లేదని భావించి ఉండవచ్చని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రతిసారీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో డబ్బు, సిఫారసులు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినా, నాటకీయత కోసమైనా టీడీపీ కోసం పని చేసేవారు ఒకరిద్దరికైనా ఈ పదవులు దక్కుతుండేవి. కానీ, ఈసారి అసలు పార్టీతో సంబంధం లేని ముగ్గురు ఈ పదవులు దక్కించుకున్నారు. తద్వారా టీడీపీపై కార్యకర్తలలో అపనమ్మకం ఏర్పడడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు చేతిలో నిర్ణయాధికారం పెద్దగా లేదన్న భావన కూడా ఏర్పడుతోంది.
ఈ ఎంపికలపై వ్యతిరేకత ఉన్నా ఎల్లో మీడియా కూడా నోరు మూసుకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్లు కూటమి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంగా మారింది. తండ్రి, కొడుకులు చంద్రబాబు, లోకేష్, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులు మంత్రివర్గంలో ప్రముఖంగా ఉన్నారు. రెండు కుటుంబాల వారు ఇలా మంత్రివర్గంలో ఉండటం ఇదే ప్రథమం కావచ్చు. అటు కొడుకును కాదనలేక, ఇటు పవన్ కళ్యాణ్‌ను వదలుకోలేక, వారిద్దరి మధ్య అంతర్గత పెనుగులాటలో చంద్రబాబు బలహీనపడుతున్నారా?.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment