ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రసంగాలకు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడుగా విమర్శలకు గురి అవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు చేస్తున్న ఉపన్యాసాలకు ఉన్న తేడా గమనించండి. వయసు , అనుభవం పెరిగే కొద్దీ హుందా తనం రావాలి. ఏదైనా మాట్లాడితే దానికి విలువ ఉండాలి. పది మందికి ఆదర్శంగా కనిపించాలి. జగన్‌లో ఆ మెచ్యూరిటీ కనిపిస్తుంటే, చంద్రబాబు, పవన్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ తరచూ అసహనంతో ఊగిపోతున్నారు.
చంద్రబాబు, పవన్‌లో పెరిగిపోయిన అసహనం
పవన్ కళ్యాణ్ అంటే ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో నిరాశ అలముకుంటుంది కనుక, ఆ నిస్పృహతో ఏదైనా ఆవేశపడితే పడవచ్చు.అది కూడా పద్దతిగా లేకపోతే పరువుపోగొట్టుకుంటారు. ప్రస్తుతం ఆయన అదే పరిస్థితిలో ఉన్నారు. కాని అందరికన్నా సీనియర్‌ని అని చెప్పుకునే డెబ్బైనాలుగేళ్ల చంద్రబాబు నాయుడు అసహజమైన రీతిలో ప్రసంగాలు చేస్తూ, ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్లు దూషిస్తూ తన హోదాకు తానే అప్రతిష్ట తెచ్చుకుంటున్నారు. అంగళ్లు గ్రామం వద్ద చంద్రబాబు వాడిన భాషకాని , హావభావాలు కాని, టీడీపీ వారిని రెచ్చగొట్టిన వైనం కాని కచ్చితంగా అభ్యంతరకరమైనవే. తనను, తన భార్యను ఎవరో ఏదో అన్నారని మీడియా సమావేశంలో నాటకీయంగా ఏడుపు లంఖించుకున్న చంద్రబాబు, మరి తను వాడిన బూతులతో ఎంతమంది బాధపడతారో తెలుసుకోలేకపోయారు.
ముఖ్యమంత్రిని పట్టుకుని సైకో అని, ఎన్ని తిట్లు వస్తే అన్నీ తిడుతున్న తీరు ఆయన మానసిక సమతుల్యతను కోల్పోతున్నారన్న సంగతిని పదే,పదే బయటపడుతుంది. ఆయన కుమారుడు లోకేష్ అదే బాటలో మాట్లాడుతూ అపరిపక్వతతో పాదయాత్ర చేస్తున్నారు. ఇక దత్తపుత్రుడుగా పేరొందిన పవన్ కళ్యాణ్ అచ్చం టీడీపీ భాషనే వాడుతూ చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడానికే అన్నట్లు ఇష్టారీతిన ప్రసంగ కళను ప్రదర్శిస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి ఎపిలో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారంటే ఆశ్చర్యం కాదు. వాటన్నిటికి ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పిన తీరు అందరిని ఆకట్టుకునే రీతిలో ఉందని చెప్పవచ్చు.
వారికి అధికారం ఇస్తే ఎవరినీ వదలరట!
ఎక్కడా అభ్యంతరకర భాష వాడకుండా, అదే సమయంలో పదునైన వ్యాఖ్యలతో చంద్రబాబును, పవన్ కళ్యాణ్ లను ఏకిపారేస్తున్నారు. అమలాపురంలో జరిగిన సభ చూడండి. ఆయన తన లైన్ వీడలేదు. మొదటి భాగం అంతా తాను అమలు చేస్తున్న వివిద పదకాలు, ప్రత్యేకించి ఆ రోజు ప్రజలకు సున్నా వడ్డీ సాయం స్కీము మొదలైనవాటి గురించి మాట్లాడారు. తదుపరి ప్రతిపక్షానికి జవాబు ఇస్తూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ఎక్కడా సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేస్తామని చెప్పడం లేదని, వాటి గురించి చెబితే జనం నమ్మరని తెలిసి ప్రజల మద్య వైషమ్యాలు సృష్టించేలా రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. జగన్ ఇంకా ఇలా అన్నారు..
'వారు మాట్లాడుతున్న మాటలు వినండి.. అధికారం ఇస్తే వారు ఏమిచేస్తారో వారి నోటితోనే చెప్పారు. తమకు అధికారం ఇస్తే ఎవరిని వదలరట. అంతు చూస్తారట.మట్టుబెడతారట. అందుకోసం వారికి అధికారం కావాలట..." అని జగన్ చేసిన కామెంట్ కు చంద్రబాబు, పవన్ , లోకేష్ ల నుంచి జవాబు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. అంగళ్లు, పుంగనూరులలో విధ్వంసం సృష్టించడానికి యత్నించిన తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతున్న సంగతి తెలిసిందే. ఒక కానిస్టేబుల్ కంటి చూపు చంద్రబాబు వల్లే పోయిందని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటివారికి సెక్యూరిటీ ఇవ్వాలా అని ప్రజలను ప్రశ్నించారు. నిజంగానే జగన్ వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ లు ఏమి జవాబు ఇవ్వగలరు? ఎవరికో నరకం చూపించడానికి వీరికి అధికారం కావాలా? లేక ప్రజలకు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు చేయడానికి అదికారం కావాలా? ఎక్కడ వీలైతే అక్కడ అమాయకులను రెచ్చగొట్టడం, అది కుదరకపోతే వేరే ప్రాంతాలనుంచి కార్యకర్తలతోపాటు రౌడీలు, గూండాలను తెప్పించి అల్లర్లు చేయడం వంటివాటితో చంద్రబాబు అప్రతిష్టపాలవుతున్నారు. ఇదే పద్దతి కొనసాగిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పటికే దాదాపు వందమందిని పోలీసులు అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. అంటే చంద్రబాబు వల్లే వారంతా జైలు పాలయ్యారన్నమాట.ఇవి అక్రమ కేసులని చంద్రబాబు డబాయించినా,తెలుగుదేశం కరపత్రికగా మారిన ఈనాడు వంటివి అలాగే ప్రచారం చేసినా, ప్రజలకు అక్కడ ఏమి జరిగింది, నలభైఏడు మంది పోలీసులు ఎలా గాయపడింది అందరికి తెలిసిపోయింది.
జనంలో పెద్దగా మార్పు కనిపించకపోవడమే వీరికి ఫ్రస్టేషన్
అందువల్లే ఈనాడు రాసే రాతలకు విలువ లేకుండా పోతోంది. చివరికి రౌడీలకు, గూండాలకు మద్దతు ఇచ్చే దుస్థితికి ఈనాడు దిగజారిపోయింది.ఈనాడుతో పాటు, జ్యోతి, టివి 5 వంటివి సరేసరి. గత కొంతకాలంగా చంద్రబాబు , లోకేష్, పవన్ లు ఎక్కడా తమ ఎజెండా ఏమిటో చెప్పలేకపోతున్నారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిద కార్యక్రమాలను విశ్లేషించడం లేదు. ఏదో ఒక పిచ్చి ఆరోపణ చేయడం, ఏదో రూపంలో పార్టీ కార్యకర్తలను, అబిమానులను రెచ్చగొట్టడం మాత్రమే చేస్తున్నారు. వీరు బాగానే ఉన్నారు. కాని వీరిని నమ్ముకున్నందుకు టీడీపీ కార్యకర్తలు తమ పిల్లలకు, భార్య, తల్లితండ్రులకు, సోదరులకు దూరం అయి చెరశాల పాలయ్యారు.వీరు చేసింది ఏమైనా వీరోచిత చర్యనా అంటే అదేమో రౌడీమూకల విద్వంసంగా స్పష్టంగా కనబడిపోతోంది. దాంతో వారు సమాజంలో కూడా చిన్నబోయే పరిస్తితి తెచ్చుకున్నారు.ఈ ముగ్గురు పోటీపడి తిరుగుతూ జగన్ ను ఎంతగా తిడుతున్నా, జనంలో పెద్దగా మార్పు కనిపంచకపోవడమే వీరిలోని ఫ్రస్టేషన్ కు కారణం.
అమలాపురంలో జగన్ కు వచ్చిన స్పందన గమనిస్తే ఆయన ఒక్కడు ఈ ముగ్గురిని ఎలా ఆడుకుంటున్నారో తెలుస్తుంది. ఎప్పుడు సర్వే వచ్చినా అది జగన్ ప్రభుత్వానికి పూర్తి అనుకూలంగా వస్తోంది. మళ్లీ సీఎం జగనే అని స్పష్టం చేస్తోంది.దాంతో అసహనానికి గురై శాంతిభద్రతల సమస్య ఎలా సృష్టించాలా అన్నదానిపైనే వారు కేంద్రీకరించినట్లుగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏదో రూపంలో వలంటీర్ల మీద విషం కక్కుతూనే ఉన్నారు. ఏదో డేటా పోయిందని అంటారు. వలంటీర్ల అర్హతలు చూడడం లేదట. వలంటీర్ల ఎంపిక తీరు తెలిస్తే ఇలా మాట్లాడతారా?పోనీ ఇంకో రకంగా ఆలోచిస్తే ఏ అర్హత ఉందని పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారో చెప్పగలరా? సినిమాలలో నటించడమే అర్హత అని ఆయన అనుకుంటున్నారా? మరి ఆయన వ్యక్తిగత జీవితంపై ఉన్న విమర్శల సంగతేమిటి? ఒక వలంటీర్ ఏదో చేశారని అందరిని తిడుతున్న ఆయన ఆత్మ విమర్శ చేసుకోరా? రుషికొండ వద్ద రాద్దాంతం చేయాలని చూస్తున్న ఆయనకు టీడీపీ నేతల భూ కబ్జాల గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు.
ఆ ‘కొండ’లపై ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్?
ఈ ఒక్క కొండ విషయంలోనే ఈయనకు సమస్య వచ్చిందా? విశాఖ సముద్ర తీరంలో ఉన్న కొండలన్నిటిపైన అపార్టుమెంట్లు, ఇతర వ్యాపార సంస్థలు వచ్చిన విషయం ఆయనకు కనపడదా? అమరావతిలో ముప్పైమూడు వేల ఎకరాలు సేకరించడం పర్యావరణ ప్రయోజనమా?హైదరాబాద్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కొండలమీద ఇళ్లు ఎలా నిర్మించారు? రామోజీరావు ఇల్లు కొండ మీద ఉన్న సంగతి తెలియదా! ఏమిటో .. ప్రతిదానికి ఏదో రకంగా అడ్డుపడాలన్న తాపత్రయంతో వ్యవహరిస్తూ చంద్రబాబుకు నిజంగానే దత్తపుత్రుడేమో అన్న భావన కలిగిస్తున్నారు.
చంద్రబాబు, పవన్, లోకేష్ లు అందరికి ఒక్క మాటలో జగన్ ఘాటైన రిప్లై ఇచ్చారని చెప్పాలి. చంద్రబాబు చేసిన నరకం కామెంట్ కు ఆయన పాలనలో జరిగిన అనేక లోటుపాట్లను ఎత్తి చూపుతూ ఆ నరకం ఇప్పుడు మళ్లీ ప్రజలకు ఇవ్వాలని అనుకుంటున్నారా అని జగన్ ప్రశ్నించారు.పేదలకు ఆంగ్ల మీడియంను కూడా వీరు అడ్డుకుంటున్న వైనాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు బృందం వారం రోజుల పాటు గొంతు చించుకుంటూ ,ఆయా వర్గాలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తుంటే జగన్ ఒక రోజులో ఒక గంటలో సమాదానం చెప్పి వారికి అయోమయ పరిస్థితిని సృష్టిస్తున్నారు.వారికి సంక్షేమ , అభివృద్ది ఎజెండా లేదని జగన్ రుజువు చేస్తున్నారు. జగన్ అడుగుతున్న వాటికి వారు జవాబులు చెప్పలేకపోతున్నారు.
--కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment