ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరే వేరుగా ఉంటుంది. అసత్యాలను సమర్ధంగా, అలవోకగా చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అని ఎవరైనా ఒప్పుకోవల్సిందే. 2024 ఎన్నికలలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ప్రజలను మాయ చేసిన చంద్రబాబు ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న అత్యాచారాలు, హత్యలు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నా, వాటి గురించి ప్రస్తావించడం లేదు .పలు గ్రామాలలో డయేరియా వ్యాపిస్తున్నా, దానిపై ఆయన సీరియస్‌గా స్పందించడం లేదు.
ప్రస్తుతం ఆయనకు మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న పరిణామాలు వివాదంగా కనిపిస్తుంది. తనకు సంబంధం లేదంటూనే ఆయన చేయవలసిన విమర్శలన్నీ చేశారు. పైగా అన్నిటిని మించి జగన్‌కు సమాధానం చెప్పవలసి రావడం ఆయనకు సిగ్గు అనిపిస్తోందట. తల్లి, చెల్లిని జగన్ రోడ్డుపైకి లాగారట. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో చూడండి. షర్మిల తన సోదరుడు జగన్ బెయిల్ రద్దు అయినా ఫర్వాలదన్నట్లుగా వ్యవహరిస్తుంటే, ఆమెకు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారు. సడన్‌గా షర్మిల మీద ఆయనకు సానుభూతి ఏర్పడింది. ఆమె తన రాజకీయ ట్రాప్‌లో నుంచి జారి పోకుండా, ఆమెను అడ్డం పెట్టుకుని కధ నడిపిస్తూ, ఇతర ముఖ్యమైన అంశాలను డైవర్ట్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారు.
మాజీ మంత్రి పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సమాదానాలు చెప్పగలిగితే , అవి కన్విన్సింగ్‌గా ఉంటే కచ్చితంగా చంద్రబాబు ఎవరికి సిగ్గుపడనవసరం లేదు. ఒకవైపు జగన్‌పై కుట్రలు చేస్తూ, ఇంకో వైపు ఏమీ ఎరగనట్లుగా నటించడం చంద్రబాబు అర్ట్‌గా చెప్పాలి. ఆయన చేసిన ఒక వ్యాఖ్యను గమనించండి. ఆస్తి ఇవ్వడానికి తల్లి, చెల్లికి కండిషన్లు పెట్టే జగన్, ప్రజలకు సేవ చేయడానికి ఎలాంటి షరతులు పెడతారో అని ఆయన అన్నారని టీడీపీ మీడియా పేర్కొంది. ఇలాంటి వ్యక్తులతో రాజకీయం చేస్తానని ఊహించలేదు. ఇవేం చిల్లర రాజకీయాలు? అలాంటి వారికి సమాధానం చెప్పడానికి సిగ్గు అనిపిస్తోందని ఆయన అంటున్నారు.
సిగ్గుపడాల్సిన విషయం కాదట
అసలు ఎవరికి అర్దం కాని విషయం ఏమిటంటే సొంత కుటుంబంలో గత నాలుగు దశాబ్దాలుగా సాగిన ఉదంతాలపై సిగ్గు పడకుండా, జగన్ కుటుంబంలో వివాదాలపై చంద్రబాబు సిగ్గుపడడం ఏమిటో ఎవరికి అర్దం కాదు. సూపర్ సిక్స్ హామీలు అంటూ చేసిన హామీలను అమలు చేయలేకపోవడం సిగ్గుపడాల్సిన పని కాదట. మహిళాశక్తి అంటూ ప్రతి మహిళకు 1500 ఇస్తానని చెప్పి మహిళా లోకానికి ఆశపెట్టి ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం విషయమే కాదట. తల్లికి వందనం పేరుతో, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ చిన్నపిల్ల్ని సైతం చాక్లెట్ల మాదిరి ఊరించి చివరకు ఇవ్వకుండా మోసం చేయడం సిగ్గుపడాల్సిన విషయం కాదట.
షర్మిలకు జగన్ అదనంగా ఇస్తానని చెప్పిన ఆస్తులు ఇవ్వలేదని చంద్రబాబు సిగ్గుపడతారట. ఒక పక్క తానిచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు షరతులు పెడుతూ ప్రజలకు సేవ చేయడానికి జగన్ ఎలాంటి షరతులు పెడతారో అంటూ ఈయన సిగ్గు పడుతున్నారట. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను జగన్ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేసిన విషయాన్ని కప్పిపుచ్చడానికి బాబు ఎలాంటి డ్రామా ఆడుతున్నారో.
చంద్రబాబు సుద్దులు చెబుతున్నారు..
జగన్‌వి చిల్లర రాజకీయాలట. ప్రతిపక్షంలో ఉన్నా , అధికారపక్షంలో ఉన్నా చిల్లర విషయాల్ని సైతం తన రాజకీయాలకు వాడుకునే చంద్రబాబు ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు. సరే! జగన్, షర్మిల మధ్య ఏదో వివాదం నడుస్తోంది. మరి చంద్రబాబు కుటుంబంలో అసలు వివాదాలే జరగలేదా! ఆయన చేసినవి చాలా నాణ్యమైన రాజకీయాలా? లేక నాసిరకం రాజకీయాలా? అన్నవి ఆయన గత చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది కదా. 1978 కాంగ్రెస్ టికెట్ పొంది గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో గ్రూప్ రాజకీయాలు నడపడం, పార్టీనుంచి సస్పెండ్ అవ్వడం, మామ ఎన్టీఆర్ మీదనే పోటీచేస్తానని తొడకొట్టి సవాల్ చేయడం, ఆ తర్వాత తుస్సుమని జారుకోవడం ఆయన దృష్టిలో ఇవేవీ చిల్లర రాజకీయాలు కాకపోవచ్చు.
1983లో కాంగ్రెస్ అభ్యర్దిగా ఘోర పరాజయం తర్వాత తన భార్యను అడ్డంపెట్టుకొని మామ ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చి టీడీపీలో చేరడానికి నానా తంటాలు పడడం, విలువలతో కూడిన రాజకీయమని చంద్రబాబు భావన కావచ్చు. పార్టీలోకి వచ్చాక టీడీపీలో ఒక వర్గాన్ని నడిపి చివరకు తన మామ ఎన్టీఆర్ సీఎం కుర్చీకే ఎసరు పెట్టడం అత్యంత విలువైన రాజకీయమని ఆయన ఉద్దేశ్యం. ఇందుకోసం వైస్రాయ్ హోటల్‌ను వేదికగా చేసుకోవడం, అక్కడకు తన భార్య లక్ష్మీపార్వతితో కలిసి వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పులు వేయడం చాలా ఆప్యాయతతో కూడిన రాజకీయమన్నమాట.
ఇలాంటి అల్లుడిని రాజకీయంగా ఆదరిస్తానని ఎన్టీఆర్ ఊహించలేకపోయారు. ఆ విషయాన్ని ఆయనే వెల్లడిస్తూ చంద్రబాబును ఎంత ఘోరంగా దూషించారో వినడానికి సిగ్గేసింది కానీ, చంద్రబాబు రాజకీయం ప్రకారం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అప్పట్లో లక్ష్మీపార్వతిపై అభూత కల్పనలు, వదంతులు సృష్టించడం, ఎన్టీఆర్‌కు నైతిక విలువలు లేవని చెప్పడం ఆయన మరణం తర్వాత తానే ఎన్టీఆర్ కు అసలైన వారసుడినని అంటూ చెప్పుకొని తిరగడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని ఆయన భావించి ఉండాలి. తన బావమరిది హరికృష్ణతో జరిగిన గొడవలేవీ కుటుంబ తగాదా కాదు. హరికృష్ణను ఈయన రోడ్డు పైకి లాగలేదు. ఆయన సొంతంగా పార్టీ పెట్టుకొని చంద్రబాబును విమర్శించలేదు. ఇన్ని జరిగినా చంద్రబాబు మాత్రం నీతులు చెప్పగల సమర్థుడు. చెత్త రాజకీయాలు ప్రజలను కాపాడలేవని చంద్రబాబు సెలవిచ్చారు.
నాలుగు నెలల్లో ఎన్ని ఘోరాలు!
మంచిదే! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి రోజూ చెత్తరాజకీయాలు చేయడానికి ఎక్కడా సిగ్గుపడకపోయినా ఇప్పుడు జగన్ కేవలం ప్రజాసమస్యలనే మాట్లాడుతున్నా, వాటిని చెత్త రాజకీయాలు అని ప్రచారం చేస్తున్నారు. విలువల్లేని మనుషులు సమాజానికి చేటు, కనీసం విలువలు ఉండాలి, ''బురద వేస్తాను. మీరు తుడుచుకోండి అన్నట్టుగా'' జగన్ వ్యవహరిస్తున్నారట. ఇంతకంటే అన్యాయమైన ఆరోపణ ఏమైనా ఉంటుందా? చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ఈవీఎంల మాయో, మరో విధంగానో అధికారంలోకి వచ్చాక ఈ నాలుగు నెలల్లో జరిగినన్ని ఘోరాలు ఇంకెప్పుడైనా జరిగాయా?
తిరుమల లడ్డూలో వాడిన నేతిలో జంతుకొవ్వు కలిసిందని దారుణైమన అబద్దపు ఆరోపణ చేయడం, ఆ తర్వాత నాలుక కరుచుకోవడం మంచి రాజకీయమవుతుందా? విలువలతో కూడిన రాజకీయమవుతుందా? చెత్త రాజకీయమవుతుందా? వరదల సమయంలో సమర్థంగా పని చేయలేక ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చిన బోట్లను కుట్రగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడడం విలువలతో కూడిన రాజకీయం అవుతుందా? చెత్త రాజకీయం అవుతుందా?
ఈ అంశాల్లో జగన్‌పై చంద్రబాబు వేసింది బురదగా చూడాలా? పన్నీరుగా చూడాలా? గాజు అద్దాల మేడలో కూర్చొని ఎదుటివాళ్లపై రాళ్లు వేసి ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివాటిని అడ్డం పెట్టుకొని ఎంతసేపూ రాజకీయ ప్రత్యర్ధులపై బురద చల్లడం , డైవర్షన్ రాజకీయాలు చేయడం ఇవన్నీ నీచ రాజకీయాల కిందకు వస్తాయా? లేక స్వచ్ఛమైన రాజకీయాల కిందకు వస్తాయా ? అనేది చంద్రబాబే ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది. కానీ ఆత్మతో సంబంధం లేకుండా ఎలాంటి రాజకీయాలనైనా నడపగలిగిన చంద్రబాబునుంచి విలువలతో కూడిన రాజకీయాలను ఆశించడమంటే ఇసుకనుంచి తైలం తీసినట్టే అవతుందేమో!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment