ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఊహించిన విధంగానే ఈనాడు రామోజీరావు మరోసారి కాలకూట విషాన్ని కక్కారు. అమరావతి రాజధాని గ్రామాలలో పేదలకు జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రామోజీ విరుచుకుపడ్డారు. పేదలపై తన అక్కసు, ద్వేషాన్ని వెళ్లగక్కడమే కాకుండా జగన్ చెబుతున్నట్లు తనది పెత్తందారి పక్షమే అని ఆయన రుజువు చేసుకున్నారు. జగన్‌కు ఆయన ఎన్నెన్ని శాపనార్దాలు పెట్టారు? జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రామోజీ ఇదే పని చేస్తున్నారు. ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వల్ల జగన్ ను దెబ్బతీయడం అవ్వదని అనుకున్నారేమో తెలియదు కాని, పూర్తి స్థాయిలో రామోజీ రంగంలో దిగి ఈనాడును తెలుగుదేశం కరపత్రికగా నిస్సిగ్గుగా మార్చేశారు.
జర్నలిజం ముసుగు తీసేసి పచ్చి రాజకీయ రాక్షసుడిగా ఆయన మారిపోయారు. లేకుంటే ఇలాంటి చెత్త సంపాదకీయాలు రాస్తారా! ఏభై ఒక్క శాతం ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకుని గంజాయి మొక్కతో పోల్చాడంటే ఎంత దురహంకారం ఉండాలి? ఏపీలో తాలిబన్ల రాజ్యం అంటూ దారుణమైన ,నీచమైన వ్యాఖ్యలు చేస్తారా? తాజాగా ఉన్మాదమే ఊపిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అంటారా? నిజానికి ఉన్మాదం ఎవరిది? కచ్చితంగా రామోజీదే. తన ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగడం లేదన్న దుగ్దతో నిత్యం అబద్దాలతో తన పత్రికను, టీవీ చానల్ ను నింపివేస్తున్న రామోజీ ఇంతకన్నా గొప్పగా రాస్తారని ఆశించడం పెద్ద తప్పే అవుతుంది.
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఆయన ఇలా పేదలకు వ్యతిరేకంగా సంపాదకీయాలు రాస్తున్న తీరు చూశాక ఆయనకన్నా పెద్ద ఉన్మాది ఎవరు ఉంటారు అన్న ప్రశ్న వస్తే ఏమి జవాబు చెబుతాం? మార్గదర్శి చిట్ ఫండ్సంస్థ ద్వారా వందల కోట్ల రూపాయల బ్లాక్ మనీని సర్కులేట్ చేస్తున్నారన్న అబియోగాన్ని ఎదుక్కుంటున్న ఆయన ఇంతకన్నా మంచిగా ఉంటారా? జర్నలిజంలో సమతుల్యత ఉండాలని, కొంచెం అయినా ప్రమాణాలు పాటించాలని అంతా అనుకుంటాం. కాని ఈ పెద్ద మనిషి ఎనభైఏడేళ్ల వయసులో కూడా ఇంత ఘోరంగా ఒక ప్రభుత్వంపై పిచ్చి రాతలు రాస్తారా? ఇంతకాలం రామోజీకి చంద్రబాబు అంటే వెర్రి ప్రేమ అనుకునేవారం. తన ఎదుట చేతులు కట్టుకుని కూర్చునే ముఖ్యమంత్రి పై ఆ మాత్రం లవ్ ఉండదా అని బావించేవారు.
కాని అవన్ని హద్దులు దాటిపోయాయి. ఆ ప్రేమ ఉన్మాది స్థాయి నుంచి ఉగ్రవాదిగా ఆయనను తీసుకువెళ్లింది. ఉచ్చనీచాలు మరచిపోయి ప్రచారం చేస్తున్నారు. చివరికి ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలలో వాస్తవాలు బయటకు వస్తున్నాయన్న భావనతో వాటిని కూడా వద్దని చెప్పేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.అది నిజమో ,కాదో తెలియదు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలంటే ప్రేమ లేదట.. ఈ విషయాన్ని రామోజీ కనిపెట్టారు. తన ఫిలిం సిటీలో కొండమీద ఒంటి స్తంభం మేడ మీద కూర్చుని కొంగ జపం చేస్తున్న రామోజీ ఈ మాట అంటే ఎవరైనా నమ్ముతారా? జగన్ తన పాదయాత్రలో పేద, బలహీనవర్గాలతో కలిసిమెలిసిపోయిన తీరు ఎన్నడైనా రామోజీ గమనించారా? జగన్ కు ప్రజలంటే , ప్రత్యేకించి పేదలంటే, నిమ్న జాతులవారంటే ప్రేమ లేనిదేనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తారా?ఇళ్ల నిర్మాణం చేపడతారా? పేదలు చదువుకునే ప్రభుత్వ స్కూళ్లను బాగు చేస్తారా?వారికోసం ఆంగ్ల మాద్యమం తీసుకు వస్తారా?
అమ్మ ఒడి స్కీమ్ నుప్రవేశపెడతారా? ఇంటింటికి డాక్టర్ ను పంపిచే స్కీము తెస్తారా? రామోజీ కళ్లుమూసుకుని ఉండవచ్చు. లేదా ఉష్ట్రపక్షి మాదిరి వ్యవహరిస్తుండవచ్చు . అయినా ప్రజలంతా ఎవరు పేదల పక్షపాతి? ఎవరు ధనికుల పక్షపాతి అన్నది గమనించారు. జగన్ నిత్యం చెబుతున్నట్లుగా రామోజీరావు తన అగ్రకుల దురహంకారంతోనో, పెత్తందారి మనస్తత్వంతోనో ఇలాంటి మతిలేని రాతలు రాస్తున్నారన్న విమర్శలు సహజంగానే వస్తాయి. ఎవరో పోలీసు అధికారి రాజధాని గ్రామాలలో పేదల స్థలాలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వారిని ఉద్దేశించి ఏదో అన్నారట. ఆయన నిజంగా అన్నారో లేదో తెలియదు.
పోలీసులు దౌర్జన్యం చేశారని వీరే వార్త ఇవ్వడం, ఆ తర్వాత సంపాదకీయం రాయడం నిత్య కృత్యంగా పెట్టుకున్నారు. అసలు ఉద్యమం నడుపుతున్నది ఈనాడు, ఇతర టీడీపీకి చెందిన ఎల్లో మీడియానే అన్న సంగతి అందరికి తెలిసిందే. ఒకప్పుడు ఇదే రామోజీరావు సారా నిషేధ ఉద్యమాన్ని హైజాక్ చేశారు. దానిని సంపూర్ణమద్యనిషేధ ఉద్యమం గా మార్చి తన పత్రికలో హోరెత్తించారు. నిజంగానే అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోందేమోనని భ్రమించేలా ప్రచారం చేశారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం అంటూ తెలుగుదేశం తో పాటు ఈనాడు మీడియా విపరీతంగా పేజీలకు,పేజీలు రాస్తున్నారు , టివీలలో గంటల కొద్ది మాట్లాడిస్తున్నారు. పాపం.. ఆ రోజుల్లో రామోజీ ప్రచారాన్ని నమ్మి కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి.రామారావులు సారాని ,మద్యాన్ని నిషేధించారు. ఆ తర్వాత యధా ప్రకారం వీరిద్దరికి రామోజీ శఠగోపం పెట్టారు. కోట్ల 1994 లో ఓటమి తర్వాత స్వయంగా మీడియాతో మాట్లాడుతూ రామోజీ ఎంతటి విశ్వాసఘాతకుడో చెప్పేవారు. ఎన్.టి.ఆర్. తను చెప్పిన వాగ్దానాలను నెరవేర్చినా, తన కోరికలు తీర్చలేదనో,మరొకటనో, చంద్రబాబుకు వంతపాడి ఆయనను ఎంతగా అవమానించారో అందరికి తెలుసు. ఎన్.టి.ఆర్.సైతం రామోజీపై ఎంతగానో మండిపడ్డారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మద్య నిషేధాన్ని ఎత్తివేసినా, రేషన్ బియ్యం రేటు పెంచినా, విద్యుత్ చార్జీలు పెంచినా, పూర్తిగా మద్దతు ఇచ్చి తన అసలు స్వరూపం బయటపెట్టుకున్నారు. రామోజీకి వ్యాపార, రాజకీయ ప్రయోజనాలే మిన్న అని రుజువు చేసుకున్నారు. కోట్ల ,ఎన్.టి.ఆర్.ల మాదిరిగా జగన్ అలివి కావడం లేదన్నదే ఆయన బాద. చంద్రబాబు అయితే తన చెప్పు చేతలలోఉంటారు కనుక ఆయనకు మద్దతు ఇస్తారు. అందుకే ఆయన ఎన్ని వాగ్దానాలు నెరవేర్చకపోయినా, అమరావతి గ్రామాలలో బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కొన్నా, రైతుల పంటపొలాలు తగలబెట్టించినా అన్ని అరాచకాలకు ఆనాడు రామోజీ సపోర్టు చేశారు.
లక్ష కోట్ల రుణాల మాఫీ చేస్తానని చంద్రబాబు నాలుక మడతపెడితే ఎన్నడైనా రామోజీ ప్రశ్నించారా? రైతులు భూములు త్యాగం చేశారని అంటున్నారు. కాని వారికి ప్రతి ఏడాది ఏభైవేల రూపాయల వరకు ఎకరాకు కౌలు ఇస్తున్న విషయాన్ని మాత్రం చెప్పకుండా జాగ్రత్తపడతారు. అమరావతి స్వయం సమృద్దమైతే కేంద్రాన్ని లక్షల కోట్ల సాయం ఎందుకు అడిగారో చెప్పాలి కదా ?తమ రియల్ ఎస్టేట్ వెంచర్ వ్యాపారానికి దెబ్బ తగిలిందని ఏడిస్తే ఫర్వాలేదుకాని, ఇలా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించి ఈనాడు బరితెగించి ప్రభుత్వంపై విషం చిమ్మడం మాత్రం దారుణం. జగన్ రాజధానిపై మాట తప్పారన్నది ఆయన అబియోగం. మాట తప్పడం వేరు. పరిస్థితిని బట్టి అబిప్రాయాలు మార్చుకోవడం వేరు.
అసలు రైతుల పంటపొలాలు తీసుకోవద్దని ,ప్రభుత్వ భూములు ఉన్న చోట రాజధాని పెట్టాలని ఆయన సూచించిన విషయాన్ని దాచేయాలని ఈనాడుయత్నం. శివరామకృష్ణన్ కమిటీ అసలు మూడు పంటలు పండే భూములలో రాజధాని వద్దని చెప్పిన విషయం ఆ మీడియాకు కనిపించదా? విశాఖలో ఒక కొండపై భవనం కడుతుంటేనే పర్యావరణం అంటూ యాగీ చేసే ఈనాడుకు ముప్పైవేల ఎకరాల పంట భూములను చంద్రబాబు ప్రభుత్వం బీడు భూములుగా మార్చితే పర్యావరణానికి నష్టం అని ఎందుకు రాయలేకపోయింది. చంద్రబాబు ఉంటున్న కరకట్ట ఇల్లు అక్రమమని ఏనాడైనా ప్రశ్నించిందా? ఏపీ ఇప్పటికే అంధయుగాలలోకి వెళ్లిపోయిందని రామోజీ గుడ్డి రాతలు రాస్తున్నారు. చంద్రబాబు పాలనలో గుప్తుల యుగమో, స్వర్ణయుగమో అని ఈయన భావిస్తుంటారు.
ఎందుకంటే తనకు ఆర్దికంగా, ఇతరత్రా మేలు చేకూరితే ప్రజలందరికి సమకూరినట్లేనని భావించే రామోజీ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏమి ఆశించగలం. ధనిక వర్గాలకు మాత్రమే ప్రతినిదిగా మారిన రామోజీకి రాజధాని గ్రామాలలో పేదలు ఉండడం ఎందుకు ఇష్టం ఉంటుంది ? ప్రజలు గత ఎన్నికలలోనే అమరావతి పేరుతో ఒకే చోట కేంద్రీకరించడాన్ని , లక్షల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడాన్ని వ్యతిరేకించారు. కొత్తగా వచ్చే ఎన్నికలలో చెప్పేదేమీ ఉండదు. అమరావతినే ఎజెండా చేసుకొని తెలుగుదేశం పార్టీని ఎన్నికలలోకి వెళ్లమని రామోజీ సలహా ఇస్తారేమో చూడాలి. మరో మీడియా ఏకంగా పిచ్చిరేగినట్లు టీడీపీ ప్రభుత్వం వస్తే ఈ పేదల పట్టాలన్నిటిని రద్దు చేస్తుందని నిర్లజ్జగా ప్రకటించింది.తద్వారా వీరి మానసిక పరిస్థితిని బయటపెట్టుకుంటున్నారు. రామోజీకాని, ఇతర టీడీపీ మీడియా కాని ఎన్ని శాపనార్దాలు పెడితే జగన్ కు అంత మంచిదని చెప్పాలి. వీరి దుష్ట తలంపును ప్రజలు గమనించి జగన్ ను అంత ఎక్కువగా ఆశీర్వదిస్తారు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment