తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ జీవితంలో పలు రికార్డులు సృష్టించారు. ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో ఆ పార్టీలో చేరిన వ్యక్తులలో కేసీఆర్ ఒకరు. కేసీఆర్ కు అప్పటికే మూడు భాషలలో మాట చాతుర్యం ఉండడం కలిసి వచ్చింది. 1983 ఉమ్మడి ఏపీ శాసనసభ ఎన్నికలలోనే సిద్దిపేట నుంచి ఆయనకు పోటీచేసే అవకాశం వచ్చింది. కాని ఆ ఎన్నికలో కేసీఆర్ ఓటమి చెందారు. వైఫల్యాలే సాఫల్యాలకు మెట్టు అన్న సూక్తి కేసీఆర్ విషయంలో బాగానే వర్తిస్తుంది. తొలిసారి పరాజయం చెందినా, ఆ తర్వాత 1985 లో అక్కడ నుంచే గెలుపొందారు. అంతే.. ఆ తర్వాత ఆయనకు తిరుగు లేదు. సిద్దిపేటను ఆయన తన కంచుకోటగా మార్చుకున్నారు. నిత్యం ప్రజలలో ఉండడం , తన వాగ్దాటితో వారిని ఆకర్షించడం ఆయనకు కలిసి వచ్చింది.1989 ప్రాంతంలో కొద్దికాలం కరువు పరిస్థితులను పర్యవేక్షించే వారిలో ఈయన కూడా ఒకరయ్యారు. వీరికి క్యాబినెట్ హోదా ఉండడంతో కరువు మంత్రులని పిలిచేవారు.1985, 1989, 1994, 1999, 2001, 2004లలో సిద్ది పేట నుంచి గెలిచారు.
✍️2014,2018లలో గజ్వేల్ నుంచి విజయపతాకను ఎగురవేశారు. ఈ చరిత్రను పరిశీలిస్తే 1995లో తెలుగుదేశంలో తిరుగుబాటు సమయంలో కేసీఆర్ కూడా చంద్రబాబునాయుడి పక్షంలోనే ఉన్నారు. అయినా చంద్రబాబు తన క్యాబినెట్ లో స్థానం ఇవ్వలేదు. అది ఆయనకు అసంతృఫ్తి కలిగించింది. సిద్దిపేట నుంచి వచ్చిన ఈయన మద్దతుదారులు రాజ్ భవన్ వద్ద ఆందోళన చేసినంత పనిచేశారు.తదుపరి విస్తరణలో మంత్రి పదవి ఇచ్చారు. జన్మభూమి వంటి ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనలో ఈయకు పాత్ర ఉంది. 1999 ఎన్నికలలో వాజ్ పేయి సానుభూతి అస్త్రం పనిచేసి టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎందువల్లో కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వడానికి ఇష్టపడలేదు.
✍️సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసి రిటైరైన విజయరామారావుకు తటస్థుల కోటా అంటూ ఖైరతాబాద్ టిక్కెట్ ఇవ్వడం ఆయన గెలుపొందడం , మంత్రి కావడం జరిగింది. అదే ఉమ్మడి ఏపీ రాజకీయాలలో పెద్ద మలుపు అని చెప్పవచ్చు. కేసీఆర్ దీనిని తీవ్ర అవమానంగా భావించారు.ఈయనను శాంతింప చేయడానికి ఉప సభాపతి పదవిని చంద్రబాబు ఇచ్చారు. అయినా సంతృప్తి చెందలేదు. కేసీఆర్‌కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుండా చారిత్రక తప్పిదం చేశారని చాలామంది సమైక్య రాష్ట్ర వాదులు భావిస్తుంటారు. మంత్రి పదవి ఇచ్చి ఉంటే ప్రత్యేక రాష్ట్ర ఆలోచన వైపు కేసీఆర్ వెళ్లకపోయేవారన్నది చాలామంది అభిప్రాయం. అదే టైమ్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ కొన్ని వర్గాలు ఆందోళన చేస్తుండేవి. మాజీ మంత్రి ఇంద్రారెడ్డి వంటివారు ఈ డిమాండ్ చేస్తుండేవారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటివారు తెలంగాణ మేధావులుగా అప్పటికే గుర్తింపు పొందారు.
✍️అలాంటివారందరితో ఆయన చర్చలు జరిపేవారు. అందుకు ఆయన హోదా కూడా బాగా ఉపయోగపడింది.ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి , సిద్దిపేట సీటుకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి ,ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఈ టిక్కెట్ మీదే పోటీచేసి ఉప ఎన్నిక ద్వారా చంద్రబాబుకు సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఓడించడానికి చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డారు. కాని ఓడించలేకపోయారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్, బీఆర్‌ఎస్‌లోనే ఉన్న సీనియర్ నేత వేణుగోపాలాచారి వంటివారెందరో సిద్దిపేటలో టీడీపీ పక్షాన పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్‌వి అన్నీ రికార్డులే అని చెప్పాలి. 2004 లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తన పార్టీకి 26 సీట్లు సాధించారు.అదే టైమ్ లో ఆయన కరీంనగర్ నుంచి లోక్ సభ కు కూడా పోటీచేసి విజయం సాధించి కేంద్ర మంత్రి అయ్యారు. కాని తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై కాంగ్రెస్ అంత సానుకూలంగా లేదని భావించి పదవికి రాజీనామా చేశారు. ఆ దశలో అప్పటి మంత్రి ఎమ్.సత్యనారాయణరావు చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా తన ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో మరోసారి గెలుపొందారు. అక్కడితో ఆగలేదు. తన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయాలని ఆయన ఆదేశించగా పదహారు మంది మాత్రమే దానిని పాటించారు.అయినా పట్టు వీడలేదు. తాను కూడా పదవికి మళ్లీ రాజీనామా చేసి ఇంకోసారి ఉప ఎన్నికలో పోటీచేసి గెలిచారు. ఒక నేత ఇలా ఒకే టరమ్ లో ఒక సాధారణ ఎన్నికతో సహా రెండు ఉప ఎన్నికలలో గెలుపొందడం ఒక రికార్డు. 2009లో మహబూబ్ నగర్ నుంచి లోక్ సభకు పోటీచేసి నెగ్గారు. తిరిగి 2014లో తెలంగాణ వచ్చాక గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ నుంచి లోక్ సభకు పోటీచేసి మళ్లీ గెలుపొందారు.
✍️అప్పటికి ఏడుసార్లు అసెంబ్లీకి, ఐదుసార్లు లోక్ సభకు ఒక నేత ఎన్నికవడం తొలిసారి అని చెప్పాలి.2018 లో ఎనిమిదో సారి అసెంబ్లీకి ఎన్నికై తెలంగాణలోనే అన్నిసార్లు ఎన్నికైన ఏకైక నేతగా రికార్డు సృష్టించారు. 2023లో మళ్లీ రెండు చోట్ల శాసనసభకు పోటీచేస్తూ తన రికార్డును తానే అధిగమించే యత్నంలో ఉన్నారు.తెలుగు రాష్ట్రాలలో ఇన్నిసార్లు ఎన్నికలలో పోటీచేయడం, గెలవడం చేయగలిగింది కేసీఆర్ ఒక్కరే అని చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు నాలుగు ఎన్నికలలో తొమ్మిది చోట్ల పోటీచేసి ఒకచోట ఓడిపోయి ఎనిమిది చోట్ల గెలిచారు.కేసీఆర్ అలాకాకుండా తొమ్మిది ఎన్నికలలో పోటీచేసి ఎనిమిది సార్లు గెలవడం , మళ్లీ పదోసారి పోటీకి సిద్దం అవడం విశేషం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండుసార్లు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం మరో రికార్డు. అన్నిటిని మించి ఒక తెలంగాణ నేత ఇన్నేళ్లపాటు సీఎంగా ఉండడం సరికొత్త రికార్డు అని చెప్పాలి. తెలంగాణ నేతలలో ఎవరూ తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి చేయలేదు. పివి నరసింహారావు,జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్యలకు ఒక టరమ్ పూర్తిగా చేసే అవకాశమే రాలేదు. ఈ రకంగా కూడా కేసీఆర్‌ది ఒక రికార్డు. తెలంగాణ ఉద్యమాన్ని ఒంటిచేతితో నడపడమే కాకుండా ప్రజాస్వామ్య చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని కేసీఆర్ సుస్థిరం చేసుకున్నారని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment