ఈవీఎంలపై మరిన్ని అనుమానపు మబ్బులు! | KSR Comment On Vote Casting Doubts On EVMs | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై మరిన్ని అనుమానపు మబ్బులు!

Published Tue, Dec 3 2024 11:08 AM | Last Updated on Tue, Dec 3 2024 6:41 PM

KSR Comment On Vote Casting Doubts On EVMs

దేశ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ (ఈవీఎం)పై మరోసారి గట్టిగా గొంతెత్తింది. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్‌ పేపరుతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేసింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ ఈవీఎంలపై సందేహాలు రోజురోజుకూ ఎక్కువ అవుతున్నాయని, వాటిని తీసేసి అహ్మదాబాద్‌ గోడౌన్‌లో పెట్టాలని విమర్శించారు. బీజేపీ ఈవీఎంల సాయంతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.

ఇటీవలి కాలంలో ఈవీఎంలపై ఆరోపణలు పెరిగిపోతున్న మాటైతే నిజం. వాటి పనితీరు, ట్యాంపరింగ్‌ చేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాన్‌ మస్క్‌ లాంటి టెక్‌ దిగ్గజాలు ఈవీఎంలను నియంత్రించవచ్చునని అంటున్నారు. అయితే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఖండించాల్సిన, సందేహాలను నివృత్తి చేయాల్సిన ఎన్నికల సంఘం ఆ పని సమర్థంగా చేయలేకపోతోంది. దీంతో అందరి అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఈవీఎంల పనితీరుపై పలు సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత హర్యానా, తాజాగా మహారాష్ట్రలోనూ ఈవీఎమ్‌లతో ఏదో మోసం జరిగిందన్న అనుమానాలను ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేశాయి. ఇందుకు పలు ఆధారాలను చూపుతున్నా ఎన్నికల కమిషన్‌ మాత్రం కిమ్మనడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా నిర్దిష్ట సమాధానాలు ఇవ్వకుండా దబాయింపునకే పరిమితం అవుతోంది.అభ్యర్థులు కోరితే వీవీప్యాట్‌ స్లిప్‌లలో ఐదు శాతం ఈవీఎంలతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పిచ్చినా ఎన్నికల సంఘం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలందరి అంచనాలను తారుమారు చేస్తూ వైఎస్సార్‌సీపీకి కేవలం11 స్థానాలే దక్కడం కూడా ఈవీఎంలపై అనుమానాలు వచ్చేందుకు ఆస్కారం కల్పించాయి. ఒంగోలు, విజయనగరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వీవీప్యాట్‌ స్లిప్‌లను, ఈవీఎంలలోని సమాచారంతో సరిపోల్చి చూడాలని ఫీజులు చెల్లించి మరీ ఎన్నికల సంఘాన్ని కోరినా ఎన్నికల సంఘం దాటవేయడం ఇంకో అనుమానాస్పద చర్య. పైగా ఏపీలో అప్పటి ఎన్నికల ముఖ్య అధికారి పోలింగ్ అయిన పది రోజులకే వీవీపాట్ స్లిప్‌లను దగ్ధం చేయాలని ఆదేశాలు పంపడం వాటిని మరింత పెంచింది. ఆశ్చర్యకరంగా కొన్ని బూత్ లలో వైఎస్సార్‌సీపీకి ఒక్క ఓటే నమోదైంది.

హిందుపూర్‌లోని ఒక వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ ఇంట్లోనే ఏడు ఓట్లు ఉంటే, సంబంధిత బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఒక్క ఓటు వైఎస్సార్‌సీపీకి నమదైంది. ఇదే బూత్‌లో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థికి మాత్రం 475 ఓట్లు రావడం విశేషం. క్రాస్‌ ఓటింగ్‌ జరిగినా అది ఈ స్థాయిలో ఉండటం అసాధ్యం. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్, కౌంటింగ్‌ల మధ్యలో సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా నమోదై ఉండటం, ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో తేడాలు ఉండటం మనం ఇప్పటికే చూశాం. పోలింగ్ నాడు ఏబై శాతం మాత్రమే ఉన్న బాటరీ ఛార్జింగ్, కౌంటింగ్ నాటికి 90 శాతానికి చేరడం పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది.

మాజీ మంత్రి రోజా  వైఎస్సార్‌సీపీకి అత్యధిక బలం ఉన్న  వడమాల పేట మండలంలో టీడీపీకి మెజార్టీ రావడంపై సంశయాలు వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు రెండు, మూడువేల ఓట్ల ఆధిక్యతతోనే  గెలుపొందగా, ఆయన కుమారుడు టీడీపీ పక్షాన పోటీచేయగా ఏకంగా నలభైవేల ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇంతటి ఆధిక్యత టీడీపీకి రావడం ఎలా సాధ్యమైందని రోజా ప్రశ్నిస్తున్నారు. ఏదో మతలబు ఉందన్నది ఆమె అనుమానం. వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని కోరిన అప్పటి ఒంగోలు వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాలంలో జనసేన పార్టీలో చేరి దీని గురించి మాట్లాడకపోవడం కూడా గమనించాల్సిన అంశమే. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ ఎన్నికలలో మోసం జరిగిందని అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత ఆయన ఈవీఎంల ద్వారా కాకుండా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగడం మంచిదని సూచించారు. రాజ్యాంగ దినోత్సవం నాడు ఆయన ఒక సందేశం ఇస్తూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిజాయితీగా జరగడమే కాకుండా.. అలా జరుగుతున్నాయన్న నమ్మకాన్ని కూడా కలిగించాలని అన్నారు.

అంతేకాదు.. ఒకప్పుడు ఈవీఎంలపై పలు విమర్వలు చేయడమే కాకుండా.. బ్యాలెట్ల పేపర్‌తో ఎన్నికలు నిర్వహించాలని జాతీయ స్థాయిలో డిమాండ్‌ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఈ ఆరోపణలపై స్పందించక పోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. దురదృష్టవశాత్తు న్యాయ వ్యవస్థ కూడా దీనిపై తగిర రీతిలో స్పందించినట్లు కనిపించడం లేదు.

ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో ఏభై సీట్లు గెలుచుకున్న బీజేపీ అదేరోజు జరిగిన పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు గెలవకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏపీ, ఒడిశాల తర్వాత హర్యానా ఎన్నికలలో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేశాయి. ఫలితాల ట్రెండ్ కూడా తొలుత దానికి అనుగుణంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత వాతావరణం మొత్తం బీజేపీకి అనుకూలంగా మారింది. 

ఇదంతా ఈవీఎమ్‌ల  మహిమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అక్కడ వీవీప్యాట్‌  స్లిప్‌లు లెక్కించాలని కోరినా, ఎన్నికల సంఘం స్పందించినట్లు లేదు. తాజాగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో విజయం సాధించడంతో ఈవీఎంల టాంపరింగ్ పై కాంగ్రెస్ తో సహా వివిధ పక్షాలు ఆరోపణలు చేశాయి. అక్కడ కూడా పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య  లక్షల  ఓట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక నియోజకవర్గంలో 1170 ఓట్లు  అధికంగా నమోదు అయ్యాయని తేలిందట. అక్కడ బీజేపీ అభ్యర్ది సుమారు  1100 ఓట్లతో గెలిచారట. నాందేడ్‌లో కూడా ఓట్ల శాతంలో మార్పులు కనిపించాయి.

అక్కడ లోక్ సభ ఉప ఎన్నికలో  కాంగ్రెస్ గెలిస్తే, ఆరు సెగ్మెంట్ లలో బీజేపీ గెలించింది. ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలోనే శివసేన నేత సంజయ్ రౌత్ ఇదంతా ఈవీఎంల టాంపరింగ్ మహిమే అని వ్యాఖ్యానించారు. ఆరు నెలల క్రితం జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమి 30 సీట్లు గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో దారుణంగా 288 సీట్లకుగాను, ఏభై సీట్లు కూడా సాధించ లేకపోయింది. 

వీటిని దృష్టిలో ఉంచుకునే మల్లిఖార్జున్ ఖర్గే ఈవీఎంలు వద్దు..బాలెట్ పత్రాలే ముద్దు అని అంటున్నారు. దీని కోసం  దేశ వ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ నిజమే అయితే.. జమ్ము-కశ్మీర్, జార్ఖండ్‌లలో కాంగ్రెస్ కూటమి ఎలా గెలిచిందన్నది బీజేపీ ప్రశ్నిస్తోంది. సీనియర్ నేత శరద్ పవార్ సమాధానం దీనికి ఇస్తూ పెద్ద రాష్ట్రాలలో ఈవీఎంలను మేనేజ్ చేస్తూ, చిన్న రాష్ట్రాలను వదలి పెడుతున్నారని, అందువల్ల ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ కూడా ఈ అంశంపై దీనిపై ఆసక్తికర విశ్లేషణ చేశారు.

మహారాష్ట్ర మ్యాజిక్ ఏమిటీ అని అంటూ, ఎన్నికలు జరిగిన నవంబర్ ఇరవయ్యో తేదీ సాయంత్రం ఐదు గంటలకు పోలైన  ఓట్ల శాతం 58.22 గా ఉందని, ఆ తర్వాత రాత్రి 11.30 గంటలకు అది 65.02 శాతంగా తేల్చారని, కాని కౌంటింగ్ కు ముందు ఆ శాతం 66.05 శాతం ఈ రకంగా మొత్తం 7.83 శాతం పెరిగిందని, అదే మహారాష్ట్ర మేజిక్ అని వ్యాఖ్యానించారు. అదే మ్యాజిక్‌ జార్ఖండ్‌లో ఎందుకు లేదని ప్రశ్నించారు ఆయన. జార్ఖండ్‌లో తొలిదశలో  పోలింగ్ సాయంత్రానికి 64.66 శాతం నమోదైతే, రాత్రి 11.30 గంటలకు 66.48 శాతంగా ప్రకటించారు.

అంటే తేడా కేవలం 1.79 శాతమేనని, రెండో దశ పోలింగ్ లో సాయంత్రానికి, రాత్రికి ప్రకటించిన ఓట్ల శాతాలలో తేడా 0.86 శాతమేనని, అంటే ఇక్కడ మాజిక్ తక్కువగా జరిగిందని ప్రభాకర్ సెటైర్ గా వ్యాఖ్యానించారు. 

మహరాష్ట్రలోని కొన్ని గ్రామాలు ఈవీఎంల పలితాలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మాజీ ముఖ్య కమిషనర్ ఖురేషి కూడా మహారాష్ట్రలో పోలింగ్ నాటికి, కౌంటింగ్ నాటికి మధ్య ఓట్ల తేడా 7 శాతంపైగా ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యినికి  మంచిది కాదని ఆయన అన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో బాలెట్ పత్రాల వైపు ఎన్నికల సంఘం మొగ్గు  చూపకపోయినా,  లేదా ఈవీఎంలలో ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదని నిరూపించకపోయినా,  దేశంలో ఎన్నికలపై నీలి నీడలు అలుముకునే అవకాశం ఉంది. అది ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement