ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తుపాను బాధిత ప్రాంతాల పర్యటన సందర్భంగా ఒక వ్యాఖ్య చేశారు. తుపాను బాధితులను ఆదుకోవడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన తర్వాత మీడియా గురించి ప్రస్తావించారు. పనికట్టుకుని తన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 వంటి మీడియా సంస్థల ద్వారా వచ్చే పత్రికలు చదవవద్దని, టీవీలు చూడవద్దని ప్రజలకు పిలుపు ఇచ్చారు. నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విషయాన్ని చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ, నిత్యం విసిగిస్తున్న ఎల్లో మీడియా గురించి చెప్పకపోతే వారు ప్రచారం చేసే అబద్దాలనే నమ్మే అవకాశం ఉందని భావించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తుపాను నేపథ్యంలో సీఎం జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. అధికారులను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసి సహాయ శిబిరాలకు బాధితులను తరలించారు. వారికి అక్కడ ఆహార వసతులు కల్పించారు. తదుపరి వారు వెళ్లేటప్పుడు రెండువేల రూపాయల చొప్పున చేతిలో పెట్టడమే కాకుండా, అవసరమైన నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారు. రైతులకు సంబంధించి పంట నష్టం అంచనాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయచర్యలను పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలను కోరారు. ఈ సహాయ చర్యలు పూర్తి అయిన తాను స్వయంగా సాయం అందిందా? లేదా అని ప్రజలను అడుగుతానని, అప్పుడు ఎవరూ అందలేదని చెప్పే పరిస్థితి ఉండకూడదని సీఎం జగన్ స్పష్టం చేశారు. వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థలను కూడా ఇందుకు వినియోగించుకున్నారు. ఇంత చేస్తే అసలు సీఎం జగన్ ఏమీ చేయలేదని పిచ్చిపిచ్చిగా ఈనాడు మీడియా ప్రచారం చేస్తోంది. ఈనాడు వారు ఏదో కల గన్నారట. అలా ముఖ్యమంత్రి చేసేయాలట. ఆయన అనుకున్న విధంగా ప్రజలకు సాయం చేయరాదట.
గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి తుపానులను ఆపానని చెప్పాలట. ఎవరూ తుపానులను ఆపలేరని తెలిసినా, తాను తుపాను కంట్రోల్ చేశానని ఆయన చెబితే, అవునవునని బ్యాండ్ బాజా వాయించిన ఈనాడు మీడియా ఈ ప్రభుత్వం మీద మాత్రం విషం చిమ్ముతోంది. అంతేకాదు.. అమరావతిలో అధిక డిగ్రీల ఉష్ణోగ్రతలు అంటే ఎండ వేడి తగ్గించాలని అధికారులను చంద్రబాబు ఆదేశిస్తే ఆయన ఎంత మేధావి అని ప్రచారం చేశారే తప్ప, ఇదేమి చిత్రం అని అడగలేదు. అధికారులు మాత్రం విస్తుపోయి, తలలు పట్టుకున్న సంగతి అప్పట్లో అందరికి తెలిసిందే. హుద్ హుద్ తుపాను సమయంలో ఆయన పదేపదే విశాఖలో తిరగడంతో అధికారులు తమ పని తాము చేసుకోలేకపోతున్నామని గగ్గోలు పెట్టారు. అయినా అప్పుడు చంద్రబాబు గొప్పగా పనిచేశారని ఈనాడు సర్టిఫికెట్ ఇచ్చింది.
హుద్ హుద్ తుపానుతో అరవై వేల కోట్ల నష్టం వచ్చిందని ఒకసారి, ముప్పైవేల కోట్ల నష్టం అని మరోసారి, ఇలా రకరకాల అంచనాలు ప్రచారం చేసి చివరికి ఇరవై వేల కోట్లకు కేంద్రానికి నివేదికను చంద్రబాబు ప్రభుత్వం పంపించింది. తదుపరి ప్రధాని నరేంద్ర మోదీ వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. ఆ తర్వాత ఆయన స్వయంగా విశాఖపట్నం వచ్చి అన్నింటిని పరిశీలించారు. రాష్ట్రం ఇచ్చిన నివేదిక అభూత కల్పన అని భావించి చివరికి ఆరువందల కోట్లతో సరిపెట్టారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్దిని ఏనాడైనా ఈనాడు మీడియా ప్రశ్నించిందా?. ఇప్పుడు మాత్రం ఎక్కడా తుపాను బాధితులు తమకు సాయం అందలేదని రోడ్డు ఎక్కకపోయినా, ఈనాడు మాత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో కొండెక్కి ఏదేదో కూస్తోంది. బాధితులను స్వయంగా పరామర్శించి, సీఎం జగన్ వారికి భరోసా ఇచ్చి వస్తే మరింత నీచంగా మరో చెత్త వార్తను వండింది. దానిని బ్యాననర్ కథనంగా ఇచ్చేసింది.
అసలు రామోజీరావు కానీ, ఆయన తరపున పనిచేసే సంపాదక బృందం కానీ ఎన్నడైనా ఏపీకి వచ్చి పరిస్థితిని పరిశీలించారా? లేక ఫిల్మ్ సిటీలో కూర్చుని కట్టుకథలు రాస్తున్నారా!. చంద్రబాబు హయాంలో ఆయన చొక్కా, ప్యాంట్ అన్నింటికి బురద రాసుకుని తిరిగారని ఈనాడు చెబుతోందా!. సీఎం జగన్ రైతులతో మాట్లాడకుండా వెళ్లిపోయారని కూడా రాసేసింది. సీఎం జగన్ వెళ్లిన ప్రతీ చోటా ప్రజలతో మాట్లాడారు. రైతులకు జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. సభ పెట్టి అందరిని ఆదుకుంటామని చెప్పారు. దానికి తగినట్లుగానే నష్టాలపై ఎన్యుమరేషన్ జరుపుతున్నారు. సంక్రాంతిలోగా నష్ట పరిహారం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈలోగా సబ్సిడిపై విత్తనాలు అందించే కృషి జరుగుతోంది. ఇంత చేస్తున్నా, ఏవేవో పిచ్చి పోలికలతో ఈనాడు వార్తలు రాయడం, వాటిని చంద్రబాబు మాట్లాడడం ఇదో కార్యక్రమంగా మారింది.
చంద్రబాబు వరద బాధితుల పరామర్శ పేరుతో టూర్ చేస్తూ, రాజకీయాలు మాట్లాడితే మాత్రం గొప్ప విషయంగా కనిపిస్తుంది. టీడీపీ-జనసేన పార్టీలను ఆయన గెలిపించాలని కోరుతూ తిరుగుతున్నారు. పార్టీ సమీక్ష సమావేశాలు పెట్టుకుంటున్నారు. వెళ్లిన పని మాని చంద్రబాబు రాజకీయాలు చేయడం ఏమిటని ఈనాడు ప్రశ్నించలేదు. పైగా ఆయన నోటి నుంచి వెలువడ్డ మాటలన్ని ఆణిముత్యాలన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేసింది. సీఎం జగన్ పొటాటోని ఉర్లగడ్డ అని అంటే అదేదో తప్పు జరిగిపోయిందని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. రాయలసీమలో బంగాళాదుంపను ఉర్లగడ్డ అని, ఉల్లిపాయను ఎర్రగడ్డ అని అంటారు. ఆ సంగతి లోకేష్‌కు తెలియదంటే అర్ధం చేసుకోవచ్చు. ఆయనకున్న మిడిమిడి జ్ఞానంతో పాటు రాయలసీమలో ఆయన పుట్టి, పెరగలేదు కనుక. కానీ, చంద్రబాబు ఆ ప్రాంతం వారే కదా!. ఆయనకు కూడా తెలియదా?. టీడీపీ మీడియా, సోషల్ మీడియా కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు హడావుడి చేసింది. ఇలా వ్యవహరించిన టీడీపీపై రాయలసీమ భాషా పరిరక్షణ సమితి మండిపడింది. రాయలసీమ భాషను టీడీపీ అవమానిస్తోందని వ్యాఖ్యానించింది.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, తదితర మీడియా సంస్థలు ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేస్తున్నాయి కనుకే ముఖ్యమంత్రి జగన్ వాటిని చదవవద్దని, చూడవద్దని ప్రజలను కోరారు. ఇందులో చాలా వాస్తవం ఉంది. ప్రభుత్వాలలో జరిగే తప్పు, ఒప్పులను విశ్లేషించి రాస్తే తప్పు కాదు. అలాకాకుండా పూర్తి ద్వేషంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఎంతకాలం ఓపిక పడతారు?.. నేనైతే ఒక మాట చెబుతుంటాను. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కావాలంటే ఈనాడు, జ్యోతి పత్రికలు చదవండి, టీవీలు చూడండి అని. ఆ వ్యాధులు వద్దనుకుంటే వాటిని ఫాలో కావద్దన్నదే నా అభిప్రాయం. ఉదయాన్నే ఈనాడు, జ్యోతి ఏపీ ఎడిషన్లు చూడగానే ఒక్కసారిగా బీపీ వస్తుంది. ఏమిటి ఇన్ని అబద్దాలు రాశారని, అయినా తమాయించుకుని చూసి వాటిపై కామెంట్ చేయవలసి వస్తోంది.
ఒక ఉదాహరణ చెప్పాలి. పోలవరం ప్రాజెక్టు మీద వారానికి ఒకసారి స్టోరీలు ఇస్తుంటారు. అందులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విషం చిమ్మడమే ఎక్కువ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు చూపుతూ, దానికేదో బీటలు వచ్చినట్లు కల్పిత ఫోటో వేశారు. అది చూసిన ఏ ఆంధ్రుడికైనా ఈనాడు మీద తీవ్ర ఆగ్రహం కలుగుతుంది. వారికి సీఎం జగన్ ప్రభుత్వంపై ఎంత కక్ష ఉన్నా, ఇలా ప్రజలపై పగపట్టి, జీవనాడిపై తప్పుడు వార్తలు రాస్తారా? అన్న ఆవేశం వస్తుంది. ఈ మీడియా అసలు బాధ ఏపీలో కొంచెం ఆలస్యంగా అయినా వర్షాలు పడ్డాయని. ఈ ఏడాది మే నెలలో వర్షాలు బాగానే పడ్డాయి. ఆ తర్వాత కాలంలో కొంత తక్కువగా కురిశాయి. అయినా పంటలు బాగానే వేసుకున్నారు. కానీ, గత రెండు నెలల్లో వర్షాలు మందగించడంతో ఎల్లో మీడియా చెలరేగిపోయింది. మొత్తం రాష్ట్రం అంతా కరువు తాండవిస్తోందని ప్రచారం చేసింది. మొత్తం 400పైగా మండలాలలో కరువు వచ్చేసిందని, వంద మండలాలలోనే కరువు ప్రకటించారని గొడవ చేసేసింది.
కానీ, తుపాను రావడం, వర్షాలు కురవడం, వాగులు పొంగడం, చెరువులు నిండటంతో వారికి ఎక్కడలేని బాధ కలిగింది. దాంతో మళ్లీ ప్లేట్ మార్చి పంటలన్నీ పాడైపోయాయని, ప్రభుత్వం ఏమీ చేయడంలేదని ప్రచారం మొదలు పెట్టారు. ఎల్లో మీడియా గతంలో చెప్పింది నిజమయితే, పంటలన్నీ కరువుకు ఎండిపోయి ఉంటే, ఇప్పుడు ఇంత భారీ నష్టం ఎలా వాటిల్లుతుంది? కరువు వల్ల కొంత నష్టం ఉండవచ్చు. అలాగే తుపాను వల్ల కొంత నష్టం ఉంటుంది. దేనికది వాస్తవిక అంకెలతో రాస్తే జనం నమ్ముతారు. లేదంటే వీరు ఇలాగే అబద్దాలు రాస్తుంటారులే అని జనం సరిపెట్టుకుంటారు.
రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయలు ఇస్తూ వారికి అవసరమైన సేవలన్నీ గ్రామాలలోనే అందించేలా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఒక్కనాడు కూడా మంచిగా రాయని ఈనాడు, తదితర ఎల్లో మీడియా ఇప్పుడు రైతుల పట్ల సానుభూతి నటిస్తూ కపట ప్రేమను చూపుతూ వారిలో అనుమాన బీజాలు వేయాలని విశ్వయత్నం చేస్తోంది. ఇలాంటి మీడియాను నమ్మవద్దని, వాటిని చదవవద్దని, చూడవద్దని ముఖ్యమంత్రి జగన్ చెప్పడంలో తప్పేముంటుంది!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment