శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో ఈనాడు రామోజీరావు దగ్గర సలహాలు తీసుకోవాలి కాబోలు. వైఎస్సార్‌సీపీ రెండో జాబితాలో చేసిన మార్పులు, చేర్పులపై ఈనాడు ఒక చెత్త కథనాన్ని వండింది.
✍️ఇన్ చార్జీల నియామకంపై పద్దతి ప్రకారం సమీక్షిస్తే తప్పుకాదు. కాని నీచమైన రీతిలో ప్రతిదానిని తప్పుపడుతూ ఒకసారి, ఒకదానికిఒకటి విరుద్దంగా మరోసారి కథనాలు ఇస్తున్న తీరు చూస్తే, వీరు పత్రికలు నడపడం కంటే తెలుగుదేశం కరపత్రిక నడపడం బెటర్ అని చెప్పవచ్చు. వైసీపీ సీట్ల మార్పిడిలో బడుగు, బలహీనవర్గాలే బలి అని ఒక తప్పుడు వార్తను ఈనాడు పత్రిక అచ్చేసింది. ఈ వార్త చదివితే నిజంగానే ఈనాడు అచ్చోసిన ఆంబోతు మాదిరి తయారై పాఠకులను బెంబేలెత్తిస్తోందని అర్ధం అవుతుంది.
✍️ఆ పత్రిక చదివేవారి సహనాన్ని మెచ్చుకోవాలి. ఇంత ఛండాలంగా కూడా పత్రిక నడపవచ్చా! వార్తలు రాయవచ్చా! అని అందరూ ఆశ్చర్యపోయేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయా టూర్లలో కాని, ఆయన కుమారుడు లోకేష్ యువగళంలో కాని పలువురు టీడీపీ అభ్యర్ధులకు టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు కనుక ఆయన ప్రకటన చేశారనుకున్నా, లేదా ఇన్‌చార్జీల నియామకం చేశారన్నా అర్ధం చేసుకోవచ్చు.
✍️అందులో తప్పొప్పుల సంగతి వేరే విషయం. కాని ఏ అధికారంతో లోకేష్ ఆయా చోట్ల ఫలానా వ్యక్తి తెలుగుదేశం అభ్యర్ధి అని ప్రకటిస్తూ వచ్చారు? అంటే అది పెత్తందారి ధోరణి కాదా! ఈనాడుకు అది ఎంత కమ్మగా కనిపించిందో! అంతేకాదు.. ఈ ఇద్దరు నేతలు ఆయా చోట్ల తిరుగుతూ దాదాపు వైసీపీ ఎమ్మెల్యేలందరిపైన ఎలాంటి ఆరోపణలు చేశారు?వాటిలో నిజం ఉన్నా, లేకపోయినా ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి పెద్ద,పెద్ద అక్షరాలతో రాసి, టీవీలలో చూపి ప్రచారం చేశాయి కదా! వారి ఆరోపణలే కాదు. ఇప్పటికీ ఈ ఎల్లో మీడియా పత్రికలు,టీవీలు రోజూ వైసిపి ఎమ్మెల్యేలపై అనేక తప్పుడు వార్తలు ఇస్తున్నాయి కదా! వారిలో కొందరిని పార్టీ అంతర్గత సర్వేల ఆధారంగా మార్చితే ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి మెచ్చుకోవాలి కదా! ఇప్పుడు కూడా ఎందుకు ముఖ్యమంత్రి జగన్‌పై పడి ఏడుస్తున్నారు? అంటే వీరు ఆశించిన విధంగా ఎవరిని మార్చకపోతే, అప్పుడు ఇంకేముంది.. కేసీఆర్ ఇలాగే మార్చలేదు. ఓడిపోయారు..ఇప్పుడు జగన్ పని అంతే అని ప్రచారం చేసేవారు.
✍️ఆయన మార్చుతుండేసరికి రాగం మార్చి అమ్మో అంత మందిని మార్చుతారా? ఇంత మందిని మార్చుతారా అని తెగ వాపోతున్నారు. అసలు వీరికి బుద్ది, జ్ఞానం లేదని పదే, పదే రుజువు చేసుకుంటున్నారు. ఎస్సీ,ఎస్టీ రిజర్డ్‌డ్ నియోజకవర్గాలలో కొందరిని మార్చితే బలహీనవర్గాలవారికి అన్యాయం జరగడం ఏమిటి?. కనీస ఇంగితం అయినా రామోజీరావుకు, రాధాకృష్ణకు ఉందా? ఆ నియోజకవర్గాలలో ఎస్సీ వారిని కాకుండా వేరే వారిని అభ్యర్ధులుగా చేయగలుగుతారా?. రేపు చంద్రబాబు నాయుడు ఎస్సీ నియోజకవర్గాలలో అభ్యర్ధులను మార్చితే అలాగే ప్రచారం చేస్తారా? అప్పుడేమని రాస్తారంటే చంద్రబాబు కాబట్టి, ఆయన అన్ని సర్వేలను దగ్గర పెట్టుకుని ప్రజాభిప్రాయం మేరకు మార్చారని వండుతారు.
✍️గత ఎన్నికలలో పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత ను కొవ్వూరు సీటుకు ఎందుకు మార్చారు. కొవ్వూరులో ఉన్న మంత్రి జవహర్‌ను తిరువూరుకు ఎందుకు తీసుకు వచ్చారు? తిరువూరులో ఉన్న ఎస్సి నేతను ఎందుకు గాలికి వదలివేశారు? దీనికి రామోజీ, రాధాకృష్ణలు సమాధానం ఇవ్వగలరా?వైసీపీ ఎమ్మెల్యే ఎమ్.ఎస్.బాబు ఏదో అన్నారట. అది ఇప్పుడు వారికి మహా ప్రసాదం అయింది. అదే ఎమ్మెల్యేపై లోకేష్ ఎన్ని విమర్శలు చేశారు? అయినా ఆయననే కొనసాగించాలని ఇప్పుడు ఈనాడు మీడియా రాయడంలోని దురుద్దేశం అర్ధం కాదా?
✍️ముగ్గురు రెడ్డి ఎమ్మెల్యేలను మార్చి బీసీ, ముస్లిం వర్గం నేతలకు జగన్ టిక్కెట్ ఇస్తే, రామోజీ, రాధాకృష్ణ వంటి తెలుగుదేశం ఏజెంట్లకు కనిపించలేదా? మంగళగిరి, ఎమ్మిగనూరులలో చేనేత వర్గం నేతలు చిరంజీవులు,మాచాని వెంకటేష్‌లకు, కదిరిలో ముస్లిం మైనార్టీకి టిక్కెట్లు ఇస్తే కూడా ఏడుపేనా! మంత్రి అమరనాథ్‌కు టిక్కెట్ ఇవ్వకపోయినా, ఆయనేమీ బాధపడలేదు. పైగా తాను వైసీపీకి ప్రచారం చేస్తానని చెబుతున్నారు. దానిని మాత్రం పట్టించుకోరు. మరో మంత్రి వేణుగోపాలకృష్ణకు రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్‌కు మార్చి టిక్కెట్ ఇచ్చినా వీరికి బాధగానే ఉంది. రామచంద్రపురంలో ఆయన బదులు మరో బిసి వ్యక్తికే టిక్కెట్ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ లో అగ్రవర్ణం బదులు బీసీ వ్యక్తిగా వేణుకు టిక్కెట్ లభించింది. దానిని మాత్రం చెప్పరు.ముగ్గురు ఎంపీలను మార్చారట. ఎల్లో మీడియాకు అది కూడా తప్పుగానే కనిపించింది.
✍️పోనీ వారి బదులు వేరేవారికి ఇచ్చారా అంటే అదేమీ కాదు. మళ్లీ బీసీ, ఎస్టీ నేతలకే టిక్కెట్లు లభించాయి. వైఎస్అ వినాష్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చేస్తున్నారని ఒకటే రొద చేస్తున్నారు. ఆయనపై వివేకా హత్య కేసులో ఆరోపణలు వచ్చాయి కనుక టిక్కెట్ ఇవ్వకూడదని అన్నారు. మరి ఇదే సూత్రం టీడీపీకి వర్తించదా! మాజీ మంత్రి పరిటాల రవిపై ఎన్ని హత్యకేసులు ఉన్నాయో రామోజీ,రాధాకృష్ణలకు తెలియదా? అయినా ఎందుకు అప్పట్లో టీడీపీ టిక్కెట్ పలుమార్లు ఇచ్చారు? పరిటాల రవి హత్యకేసులో స్వయంగా ఆయన భార్య సునీత మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డిపైనే ఆరోపణలుచేశారే. అయినా 2014లో చంద్రబాబు నాయుడు ఎలా ఎంపీ టిక్కెట్ ఇచ్చారు? వైసీపీలో ఉన్న గౌరు వెంకటరెడ్డి ఒక హత్యకేసులో జీవిత శిక్ష అనుభవించారు. ఆ టైమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి జైలులో ఉన్న ఆయనను పరామర్శించడానికి వెళితే చంద్రబాబు తీవ్రంగా తప్పుపట్టి ప్రచారం చేశారే!. అలాంటి వ్యక్తిని టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నారు. ఆయన భార్యకు ఎలా టిక్కెట్ ఇచ్చారు? అంటే చంద్రబాబు ఏమి చేసినా సమర్ధించడం,జగన్ ఏమి చేసినా తప్పుడు ప్రచారం చేయడం.
✍️ఇదే నిత్యకృత్యంగా పెట్టుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియాలను జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లినా టిక్కెట్ ఇవ్వలేదని ఈనాడు ఏడ్చింది. ఒకే! మరి అదే విధంగా వైసీపీ నుంచి వెళ్లిన తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవికి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డికి లేదా మరొకరికి ఎవరికైనా టిడిపి టిక్కెట్ ఇవ్వకపోతే ఇలాగే ఏడుస్తారా? వార్తలు రాయకుండా ఏడుపుగొట్టుతనంతో స్టోరీలు ఇస్తున్న తీరును సభ్యసమాజం అసహ్యించుకుంటోంది.
✍️అయినా వారి తీరుమారడం లేదు.ఇంకో చిత్రమైన సంగతి. ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డికి టిక్కెట్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టిన ఈనాడు మీడియా, మళ్లీ ఆయన చెప్పినవారికే టిక్కెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తోంది? ఆయన పెత్తనాన్ని కొనసాగిస్తున్నారట.ఈ గొడవలన్ని ఎందుకు! వైసిపి వారు ముందుగా తాము ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నది జాబితా సిద్దం చేసి రామోజీకి పంపితే ఆయన ఆమోద ముద్ర పడిన తర్వాత ప్రకటించాలేమో! ప్రస్తుతం జగన్ తన పార్టీతో వారితో మాట్లాడుకుంటూ, తన వద్ద నివేదికల ఆధారంగా టిక్కెట్లు కేటాయిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనసాగించినా ఈనాడు మీడియా ఇలాగే చెత్తగా రాస్తుంది. కొనసాగించకపోయినా ఆయా నేతలను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది.
✍️ఇదంతా దేనికి ?తన ఎదుట కూర్చుని జీహుజూర్ అనే చంద్రబాబు కోసమే కదా? రామోజీరావు, రాధాకృష్ణలే పెత్తందారి బూర్జువా మనస్తత్వంతో దారుణంగా ఏపీ సమాజానికి శత్రువులుగా మారారు. ఇంతవరకు టీడీపీ, జనసేనల సీట్ల పంపిణీపై ఒక అవగాహనకురాలేదు. టీడీపీలో గతసారి పోటీ చేసిన ఎంతమందికి టిక్కెట్లు ఇస్తారో తెలియదు.టీడీపీ, జనసేన కార్యకర్తలు కొట్టుకున్నా కప్పిపుచ్చుతున్నారు. టీడీపీలో ఆయా చోట్ల రెండు,మూడు వర్గాలు ఘర్షణలుపడినా దాచేస్తున్నారు. తిరువూరులో ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్ని వర్గాలు తన్నుకున్నా దానిని జిల్లా పేజీకే పరిమితం చేసి మిగిలిన రాష్ట్రానికి తెలియకుండా చేయాలనుకున్న విషయం అర్ధం కాదా?
✍️జగ్గంపేటలో టీడీపీ, జనసేనలు ఎలా ఘర్షణ పడ్డాయన్నది బహిరంగ రహస్యమే అయినా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆ వార్తలను మొదటి పేజీలో ఎందుకు ఇవ్వలేదు?సోషల్ మీడియాలో ఇవన్ని క్షణాలలో వచ్చేస్తున్నాయి కదా?. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన క్యాబినెట్ లో ఏకంగా పదిహేడు మంది బలహీనవర్గాలవారికి అవకాశం ఇచ్చారు కదా! ఎన్నడైనా మెచ్చుకున్నారా?
✍️రాష్ట్రంలో ఉన్న వివిద పదవులలో ఏభై శాతం బడుగువర్గాలకు ఇచ్చిన నేత జగన్ కాకుండా మరెవరైనా ఉన్నారా? వాటినీ ఇంకో రకంగా తప్పుపడుతూ, తమ అగ్రవర్ణ దురహంకారాన్ని ఎల్లో మీడియా పెద్దలు ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకుంటూనే ఉన్నారు. జనం వీటిని గమనిస్తూనే ఉన్నారు. టిక్కెట్ల సమయంలో అన్ని పార్టీలలోను నిరసనలు ఉంటాయి.కాని వైసీపీలోనే ఇలాంటివి ఉన్నట్లు చెత్త రాతలు రాస్తున్న ఎల్లో మీడియా తీరే ఘోరంగా ఉంది.ఒక పద్దతి, పాడు లేకుండా విశ్లేషణలు ఇస్తున్న వీరి వైనం నీచాతినీచంగా ఉంది. అందువల్లే ఈనాడు, జ్యోతి వంటి వాటిని ఎల్లో వైరస్ గా జనం అనుకునే పరిస్థితి ఏర్పడింది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్.
ఇదీ చదవండి: చంద్రబాబుకు చెక్!.. కేశినేని నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment