జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురంలో నిజంగానే రిస్కులో పడ్డట్టే ఉన్నారు. ఆయన వ్యక్తం చేస్తున్న భావాలు కాని, పిఠాపురంలో తెలుగుదేశం నేత వర్మ చేస్తున్న ప్రకటనలు కాని గమనిస్తే ఆ నియోజకవర్గంలో పవన్‌కల్యాణ్‌కు తలనొప్పి తప్పదేమోనన్న అనుమానం వస్తోంది. ఇది ఆయన చేజేతులా చేసుకున్నట్లే అనిపిస్తుంది. తను రాజకీయ అజ్ఞానంతో మాట్లాడుతున్న వైనమే ఆయనను గందరగోళంలోకి నెడుతోంది. నటనలో ఆయనకు మంచిపేరే ఉండవచ్చు. రాజకీయాలలో ఆయన ఇంకా ఓనమాలు నేర్చుకోలేదనిపిస్తుంది.
పేరుకు పదిహేనేళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నట్లు కనిపిస్తున్నా, ఆయనకు అలవాటైంది.. ఎవరో ఒకరికి భజన చేయడం, లేదా ఎవరో ఒకరిని నోటికి వచ్చినట్లు దూషించడం తప్ప ఒక ప్రణాళికబద్దంగా రాజకీయం నడపడం ఆయనకు చేతకాదని పదే-పదే రుజువు చేసుకుంటున్నారు. తాను పిఠాపురంలో పోటీ చేయదలచినప్పుడు స్థానికంగా అక్కడ ఉండే తన పార్టీ నేతలతో, అలాగే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం నేతలతోను సత్సంబంధాలు పెట్టుకుని సంప్రదింపులు జరిపి ఉండాలి. నియోజకవర్గంలో గత ఐదేళ్లుగా పర్యటనలు చేయడం, స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవడం చేయాలి. అదేమి చేయలేదు.. అసలు నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ప్రజల ఆర్ధిక స్థితిగతులు ఏమిటో తెలుసుకోకుండా, కేవలం ఒక సామాజికవర్గం వారు అధికంగా ఉన్నారన్న భావనతో, తాను అక్కడికి వెళ్లగానే అంతా ఎగబడతారని ఆయన అనుకుని ఉండాలి.
పవన్ తనను ఎమ్మెల్యే అభ్యర్ధిగా ప్రకటించుకోగానే పిఠాపురంలో టీడీపీ నేత వర్మ అనుచరులు రచ్చ-రచ్చ చేసి ఆయన గాలి తీసేశారు. చంద్రబాబును, పవన్‌ను కలిపి బండబూతులు తిట్టారు. తదుపరి రెండు రోజులకు వర్మను చంద్రబాబు నాయుడు పిలిచి ఏదో సర్దిచెప్పి పంపించారు. దాంతో అంతా చల్లారిందనుకుంటే, మరో వివాదం తెచ్చిపెట్టుకున్నారు. తాను పార్లమెంటుకు వెళితే పిఠాపురం సీటును జనసేన స్థానిక నేత ఉదయ్ శ్రీనివాస్‌కు ఇస్తానని, అసెంబ్లీకే వెళితే ఉదయ్ లోక్ సభకు పోటీ చేస్తారని అన్నారు. ఇక్కడే వర్మకు మళ్లీ మండింది. పవన్‌కల్యాణ్ లోక్ సభకు పోటీచేస్తే పిఠాపురం సీటు తనకే ఇస్తానని చంద్రబాబు చెప్పారని ఆయన వెల్లడించారు.
పవన్ అయినా చంద్రబాబు చెప్పినట్లు వినాల్సిందేనని అన్నారు.. దీనిని బట్టి ఏమి తెలుస్తుంది! చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారనే కదా! ఒకసారి పిఠాపురం జనసేనకు కేటాయించాక మళ్లీ వర్మకు ఆశ చూపించడం ఏమిటి? పైకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి, అంతర్గతంగా పవన్ అక్కడ ఉండడులే అన్న సంకేతం ఇవ్వడం ఏమిటి? పవన్ చేసిన మరో తప్పిదం ఏమిటి? టీడీపీతో పొత్తు పదేళ్లు ఉంటుందని ప్రకటించడం. అంటే దీనిని బట్టి పొత్తులో ఉన్న సీట్లలో రెండో పార్టీకి, ఇప్పుడే కాకుండా వచ్చేఉపదేళ్లలో జరిగే రెండు ఎన్నికలు కూడా అవకాశం ఉండదన్నమాటే కదా! ఉదాహరణకు పిఠాపురం సీటును తీసుకోండి. పవన్‌కల్యాణ్ లేదా ఉదయ్ ఇక్కడ నుంచి ఈసారి పోటీచేస్తారనుకుందాం.
పవన్ చెప్పినదాని ప్రకారం 2029, 2034 లలో కూడా అదే ప్రకారం జనసేనే తీసుకుంటుందని కదా? అప్పుడు వర్మ వంటి నేతల పరిస్థితి ఏమిటి? రాజకీయంగా అవకాశాలు ఉండవనే కదా? ఆయన అనుచరులు ఇందుకు అంగీకరిస్తారా? ఇప్పుడే పవన్ లేదా, జనసేన అభ్యర్ధి ఎవరైతే వారిని ఓడిస్తే వచ్చే ఎన్నికలకు తమకు ఇబ్బంది ఉండదని అనుకోరా! అసలు ఐదేళ్ల తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎవరైనా చెబుతారా? ఆ మాటకు వస్తే 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్‌కల్యాణ్ 2019లో ఆ రెండిటికి దూరం అయి బీఎస్పీ, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీచేశారు కదా. అది చంద్రబాబుకు ఉపయోగపడాలన్న లక్ష్యమే కావచ్చు. కాని అధికారికంగా అయితే పొత్తు లేదు కదా! మళ్లీ 2024కి టీడీపీ, బీజేపీలతో అవగాహన పెట్టుకున్నారు. ఈ పరిస్థితిలో వచ్చే పదేళ్లు తాను పిఠాపురంలోనే ఉంటానని చెబితే వేరే పార్టీవారు అంగీకరిస్తారా? ఈ మాత్రం ఆలోచన పవన్‌కు లేకపోయింది.
మరో సంగతి చూద్దాం... తనకు లక్ష మెజార్టీ వస్తుందని ఒకసారి అంటారు. తనను ఓడించడానికి ఇంటికి లక్ష ఇవ్వబోతున్నారని మరోసారి అంటారు. వైసీపీ అభ్యర్ధి 2009లో ప్రజారాజ్యం ద్వారానే రాజకీయాలలోకి వచ్చారని, అందువల్ల ఆమె జనసేనలో చేరాలని ఆయన అన్నారు. ఇది ఎంత తెలివితక్కువతనం. నిజానికి వంగా గీత 1994 నుంచి టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ పక్షాన తూర్పుగోదావరి జడ్పి చైర్ పర్సన్‌గా ఉన్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారు. తదుపరి ఆమె ప్రజారాజ్యంలో చేరి పిఠాపురంలో పోటీ చేసి గెలిచారు. ఈ చరిత్ర తెలుసుకోకుండానే ఆయన మాట్లాడేసరికి వంగా గీత ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పవన్‌ను వైసీపీలోకి రమ్మంటే బాగుంటుందా? అన్న ప్రశ్న వేశారు. తాను గెలవడం ఖాయమని, మెజార్టీ ఎంతన్నదే ప్రశ్న అని ఆమె అన్నారు. పవన్‌కు తన గెలుపుపై ఏదో భయం రాబట్టే ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని తన పార్టీలోకి రావాలని బతిమలాడుతున్నట్లు మాట్లాడారు.
- నిజంగా గెలుపు ధైర్యం ఉంటే ఎవరినైనా ఎదుర్కుంటానని చెప్పాలి. పైగా ఎంపీగా పోటీ చేయాలని అమిత్-షా చెబితే అలాగే చేస్తారట. అంటే పిఠాపురంలో పోటీలో ఉంటానో, లేదో అని సస్పెన్స్‌లో పెట్టినట్లే కదా! ఆ మాత్రం తెలివి లేకపోతే ఎలా?
- నిజానికి తన పార్టీలో ఎవరు ఎక్కడ పోటీచేయాలో వేరే పార్టీవారు చెప్పడం ఏమిటి?
- అసెంబ్లీ టిక్కెట్లు ఏమో చంద్రబాబు సలహా మేరకు ఇస్తారా?
- ఎంపీ సీట్లు అమిత్-షా సూచన ప్రకారం చేస్తారా?
- జనసేనకు సొంత ఆలోచన ఉండదా?
- టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారికి జనసేన టిక్కట్లు ఇస్తుంటే అసలు పార్టీ నేతలు నెత్తి, నోరు మొత్తుకుంటున్నారు. పిఠాపురంలోనే ఉంటానని ఇప్పుడు చెబుతున్నారు. దానిని ఎలా నమ్మాలి?
- ఆయన సినిమా షూటింగ్‌లు మానుకుని పిఠాపురంలో ఉంటానని చెబితే ఎవరైనా విశ్వసిస్తారా?
- అసలు ఐదేళ్లుగా తాను మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నప్పుడు ఒక నియోజకవర్గం ఎంపిక చేసుకుని అక్కడ కేంద్రీకరించి తగు ఏర్పాట్లు చేసుకోవాలి కదా! అదేమి చేయలేదు. ఇప్పుడు సడన్‌గా వచ్చి ప్రజలంతా తన వెంట ఉండాలని అంటే, ప్రత్యేకించి ఒక కులం వారంతా తనకు మద్దతు ఇవ్వాలంటే ఇవ్వడానికి వాళ్లేమేనా పిచ్చోళ్లా?
నిజమే. కొంతకాలం క్రితం వరకు ఆ వర్గంలో పవన్‌పై ఒక ఆశ ఉండేది. ఈయన తమకు ఇష్టం లేకపోయినా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ఒక అరవై సీట్లు తెచ్చుకుని, సీఎం సీటులో వాటా కోరతారు అనుకుంటే, పూర్తిగా దిగజారిపోయి జనసేనను చంద్రబాబు కాళ్లదగ్గర పడేశారే అన్న బాధ వారిలో ఏర్పడింది. దాంతో ఆ వర్గంలో కూడా పవన్ పట్లవిముఖత ఏర్పడింది. ఇరవైనాలుగు సీట్లకు ఒప్పుకుని, తర్వాత దానిని 21 సీట్లకు తగ్గించడం, తనను ఎవరూప్రశ్నించరాదని అనడం, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను కలుస్తానని చెప్పి కలవకుండా అవమానించడం వంటి ఘట్టాలతో ఈయనపై పూర్తిగా అపనమ్మకం ఏర్పడింది. గతంలో కాపు ఉద్యమం జరిగితే కనీసం ఇటువైపు తొంగిచూడని పవన్‌కల్యాణ్ ఇప్పుడు తమను ఏమి ఉద్దరిస్తారన్న అభిప్రాయం ఏర్పడింది.
ఈ నేపధ్యంలోనే పవన్‌కల్యాణ్ భయపడుతున్నట్లుగా అర్ధం అవుతుంది. పిఠాపురంలో పవన్‌ను ఓడించడానికి వైసీపీ నేతలు మొహరిస్తున్నారని వాపోతున్నారు. ఇందులో తప్పేమి ఉంటుంది. ప్రత్యర్ది పార్టీవారిని ఓడించడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు. ఆయన కూడా రాష్ట్రం అంతా తిరిగి వైసీపీని పాతాళానికి తొక్కేస్తా అంటూ ఎలా చెప్పారు? అంటే రాజకీయంగా కనీస అవగాహన లేకుండా పవన్‌కల్యాణ్ వ్యవహరిస్తున్నారని తేలిపోతుంది. పవన్‌కల్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి కానప్పుడు తాము ఎందుకు ఆయనకు మద్దతు ఇవ్వాలని పిఠాపురం ప్రజలలో ఆలోచన వచ్చింది. అలాగే టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు మరింత గందరగోళంలోకి నెట్టాయి. ఈ నేపధ్యంలో పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేస్తారా? లేదా? అన్నది మళ్లీ అనుమానంగా మారింది. దానికి కారణం ఎక్కడ పోటీచేసినా గెలుస్తానో, లేదో అన్న సందేహం వపన్‌ను వెంటాడుతుండడమే అని వేరే చెప్పనవసరం లేదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment