తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్
మార్చి 1న కేటీఆర్ నేతృత్వంలో పార్టీ కీలక నేతల పర్యటన
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను ప్రజల్లోనే ఎండగడతాం: కేటీఆర్
మాతో వస్తే కాంగ్రెస్ మంత్రులనూ వెంట తీసుకెళ్తాం
మేడిగడ్డలో 3 పిల్లర్లకు పగుళ్లు ఉంటే కాళేశ్వరాన్ని కూల్చేసే కుట్ర
పాడైన బ్యారేజీల మరమ్మతుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు
సాక్షి, హైదరాబాద్: ‘మేడిగడ్డ బ్యారేజీలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ ప్రభు త్వం మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే కుట్ర చేస్తోంది. మేడిగడ్డపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎండగట్టడంతోపాటు కాళేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తాం. దీని కోసం మార్చి 1న ‘చలో మేడిగడ్డ’కార్యక్రమం చేపడుతున్నాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతోపాటు మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నేత లు తెలంగాణ భవన్ నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి వెళ్తాం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు.
మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్ తదితరులతో కలిసి కేటీఆర్ మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దశలవారీగా కాళేశ్వరంలోని ప్రతీ రిజర్వాయర్‌ను సందర్శించడంతోపాటు కాంగ్రెస్ మంత్రులు తమ వెంట వస్తే వారినీ తీసుకెళ్తామని చెప్పారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు కేటీఆర్ మాటల్లోనే...
రైతాంగంపై కక్షపూరిత వైఖరి మానుకోండి
మరమ్మతులు చేపట్టకుండా వచ్చే వర్షాకాలంలో కాళేశ్వరంలో అంతర్భాగమైన మూడు బ్యారేజీలు వరదలో కొట్టుకుపోయేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. నేరపూరిత మనస్తత్వంతోనే బ్యారేజీలకు మరమ్మతు చేయకుండా రోజూ వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతోంది. గతంలోనూ కాంగ్రెస్ హయాంలో కడెం, గుండ్లవాగు, మూసీ, సింగూరు, పులిచింతల సహా అనే ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయి. బ్యారేజీల మరమ్మతుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నా యి. రాజకీయ లబ్ధి మానుకుని రైతు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కాఫర్‌డ్యాంను నిర్మించి మేడిగడ్డలో దెబ్బతిన్న మూడు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వచ్చే వేసవిలో సాగునీరే కాదు.. మంచినీళ్లు కూడా ఇవ్వలేమని అధికారులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్‌పై దు్రష్పచారం చేసినా రైతుల జీవితాలను దెబ్బతీసి పొలాలను ఎండబెట్టకండి.
కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు
కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని మూడు బ్యారేజీలు, అనేక రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, సొరంగాలు, కాలువల సమాహారం. 40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే కామధేనువు కాళేశ్వరం వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శిస్తాం. తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాల ద్వారానే నీరు అందించడం సాధ్యం. కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి జలాల కోసం 60 ఏళ్ల పాటు పోరాటాలు జరిగినా తెలంగాణకు నీళ్లకు బదులుగా కన్నీళ్లు మిగిల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. నీళ్ల గోసను గద్దర్, సదాశివుడు వంటి కవులు వివరిస్తే, జలసాధన ఉద్యమాల ద్వారా కేసీఆర్ పల్లెలను జాగృతం చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసి తుమ్మిడిహెట్టి వద్ద తట్టెడు మట్టి కూడా తీయలేదు. గోదావరి జలాలను తెలంగాణ పొలాలకు మళ్లించే సంకల్పంతోనే సీడబ్ల్యూసీ, నిపుణుల సూచనతో మహారాష్ట్రతో సంప్రదించి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు.
కాగ్ నివేదిక పవిత్ర గ్రంథం కాదు
కాగ్ రిపోర్టును నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సహా అనేక మంది తప్పుపట్టి అదేమీ పవిత్ర గ్రంథం కాదని తేల్చారు. గతంలో జలయజ్ఞం సహా కల్వకుర్తి ప్రాజెక్టులో రూ.900 కోట్ల గురించి కాగ్ ప్రస్తావించింది. కాగ్ నివేదికపై ద్వంద్వ వాదన వినిపిస్తున్న కాంగ్రెస్ సమాధానాలు చెప్పాలి. గతంలో జలయజ్ఞంలో రూ.52 వేల కోట్ల అవినీతి జరిగిందని కాగ్ ఎత్తి చూపింది. అప్పుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రస్తుతం కొత్తగా అప్పులు తేవొద్దు.
Comments
Please login to add a commentAdd a comment