బీఆర్‌ఎస్‌ సర్కారుతోనే పారిశ్రామిక అభివృద్ధి  | KTR Says Industrial development with BRS Govt | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ సర్కారుతోనే పారిశ్రామిక అభివృద్ధి 

Published Thu, Nov 9 2023 5:14 AM | Last Updated on Thu, Nov 9 2023 8:33 AM

KTR Says Industrial development with BRS Govt - Sakshi

పారిశ్రామికవేత్తల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రైతుబంధు పెద్దవాళ్లకే ఇస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. నాకు రెండెకరాలు ఉంది. సంవత్సరానికి 20వేలు వస్తుంది పెట్టుబడికి. మరొకాయనకు 10 ఎకరాలకు లక్ష రూపాయలు వస్తుంది. నాకు వస్తున్న 20వేల మీద సంతోషం లేదు. పక్కాయనకు వచ్చే లక్ష రూపాయల మీద దృష్టి ఉంది. పొలం ఎంత ఉంటే అంత వస్తుంది. అయినా డబ్బులున్న వాళ్లకు ఎందుకు ఇస్తున్నారన్న ప్రజల బాధను నేను అర్థం చేసుకోగలను. దీన్ని సరిదిద్దే అవకాశాన్ని పరిశీలిస్తాం. నాలుగు లేదా ఐదు ఎకరాలకు తగ్గించే విషయాన్ని ఆలోచిస్తున్నాం.

ఈసారి ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా సరిదిద్దుతాం’’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందని, లక్ష కోట్లు నష్టమని చెబుతూ.. ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని.. 147 టీఎంసీల నీరు లభ్యతగా ఉండేలా ప్లాన్‌ చేశామని చెప్పారు. రూ.80వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్‌గాంధీ ఆరోపించడం శోచనీయమన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఖర్చు రూ.1,839 కోట్లు అని.. అందులో రెండు పిల్లర్లు కుంగితే లక్ష కోట్లు మునిగినట్టు ప్రచారం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు ఇంజనీరింగ్‌ సమస్యలు సాధారణమేనని చెప్పారు. 

స్థిరమైన ప్రభుత్వంతోనే అభివృద్ధి 
సమర్థవంతమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వంతోనే రాష్ట్రం పురోగతి సాధిస్తుందని.. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర సాధించిన ప్రగతి దీనికి నిదర్శన మని కేటీఆర్‌ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి పరిశ్రమలు వస్తున్నాయని.. ప్రభుత్వంలో స్థిరత్వం లేకపోతే ముందుగా దెబ్బతినేది పరిశ్రమలేనని పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసే పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పించడంతోపాటు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితులను తెచ్చామన్నారు.

హైదరాబాద్‌ శివార్లతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా ముందుకు వచ్చాయని వివరించారు. తాను పూర్తి రాజకీయ నాయకుడిగా పారిశ్రామికవేత్తల మద్దతు కోసం ఈ సమావేశానికి వచ్చామన్నారు. రాష్ట్రంలో వేరేవాళ్లు అధికారంలోకి వస్తే వారు ప్రతిదానికి ఢిల్లీ వెళ్లి పర్మిషన్‌ తీసుకోవాలని, అన్ని రకాలుగా మెప్పించాల్సి వస్తుందని పేర్కొన్నారు.

నాడు విద్యుత్‌ సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో అందరికీ తెలుసని, ఇప్పుడు 10 నిమిషాలు కూడా కరెంట్‌ పోతే తట్టుకోలేని స్థితికి వచ్చామని చెప్పారు. 2014కు ముందు హైదరాబాద్‌ శివార్లలో 14 రోజులకోసారి మంచినీళ్లు ఇచ్చేవారని.. ఇప్పుడు రోజూ వస్తున్నాయని తెలిపారు. రోజుకు 24 గంటలు నీళ్లు ఇవ్వాలనేది తమ ఆలోచన అని వివరించారు. ఈ సమావేశంలో సు«దీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement