KTR Sensational Comments On Congress Priyanka Gandhi And Revanth Reddy - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీ ఫ్ర‌స్టేష‌న్‌లో ఉంది.. ప్రియాంక క్ష‌మాప‌ణ చెప్పాలి: కేటీఆర్‌

Published Sun, May 7 2023 6:55 PM | Last Updated on Mon, May 8 2023 10:49 AM

KTR Sensational Comments Congress Priyanka gandhi Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ ఫ్రస్టేషన్‌లో ఉందని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రాజకీయ నిరుద్యోగులుగా మారిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం కోసం.. ఉద్యోగాలకు సిద్దమవుతున్న యువతను రెచ్చగొట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎపీపీఎస్సీ ద్వారా కాంగ్రెస్ భర్తీ చేసిన నియామకాలెన్ని? కేవలం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నియామకాలెన్నో తెలుసుకోవాలన్నారు. రాత పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణ బిడ్డలకు ఇంటర్వ్యూల్లో అన్యాయం చేసిన నాటి చేదు జ్ఞాపకాలు ఇంకా తమ కళ్ల ముందే కదలాడుతున్నాయన్నారు. 

ముక్కనేలకు రాసి క్షమాపణ చెప్పాలి
నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన మహోన్నత తెలంగాణ ఉద్యమంలో జరిగిన వందలాది యువత ప్రాణ త్యాగాలకు కాంగ్రెస్ పార్టీ ముందుగాల ముక్కనేలకు రాసి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మాట తాను మాత్రమే అనడం లేదన్న కేటీఆర్.. తెలంగాణ ఉద్యమంలో యువకుల బలిదానాలకు కారణం అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వమే అని. సోనియా గాంధీని బలిదేవత అన్న తమ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాటల మేరకైయినా తెలంగాణ యువతకు అధికారంలో ఉన్నప్పుడు.. ఉద్యమ కాలంలో చేసిన ద్రోహాలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

పొలిటికల్ టూరిస్టులకు స్వాగతం
హైదరాబాద్ నగరం విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటుందని లక్షలాది మంది టూరిస్టులకు స్వాగతం పలుకుతున్నదన్న కేటీఆర్.. ఢిల్లీ నుంచి వచ్చే ప్రియాంక గాంధీ లాంటి పొలిటికల్ టూరిస్టులకు కూడా స్వాగతం పలుకుతుందన్నారు. అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ పై దింపుడు కళ్లెం ఆశతో ఉన్న ప్రియాంకా గాంధీ తన ఈ పొలిటికల్ టూర్ ను ఎడ్యుకేషన్ టూర్‌గా మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంక గాంధీ స్వయంగా తెలుసుకోవాలన్నారు.
చదవండి: పొంగులేటి, జూపల్లి ఆ పార్టీలోకేనా?.. అప్పటి వరకు సస్పెన్స్‌ తప్పదు!

ఆవో, దేఖో, సీఖో
శంషాబాద్ విమానాశ్రయంలో దిగి నగరంలోకి వచ్చే సమయంలో కనిపించే అందమైన రోడ్లు, అద్భుతమైన ఫ్లే ఓవర్లు, కేబుల్ బ్రిడ్జిలాంటి అధునాతన నిర్మాణాలు, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల కార్యాలయాలు చూసైనా పరిపాలన పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివే కాంగ్రెస్ మార్క్ సంస్కృతిని పక్కనెట్టి ఇక్కడి పరిస్ధితులను అద్యయనం చేస్తూ “ఆవో, దేఖో, సీఖో” అని ప్రియాంకగాంధీకి కేటీఆర్ స్వాగతం పలికారు. 

ఆ ఘనత బీఆర్ఎస్‌దే
దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో సంక్షోభానికి సెంటర్‌గా ఉన్న తెలంగాణ, తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగిందన్నారు.  ఒక్క పంటకు కూడా సాగునీరు ఇవ్వలేని కాంగ్రెస్ చేతకానితనంతో ఒకప్పడు కమ్ముకున్న దుర్భిక్ష ఛాయలు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించవనడానికి కోటి ఎకరాల సిరుల మాగాణమే సాక్ష్యమన్నారు. ప్రాజెక్టు కట్టకముందే కాలువలు తవ్వి కమిషన్లు జేబులో వేసుకున్న కాంగ్రెస్ పాలన లెక్క కాకుండ ప్రపంచంలోనే అతి పెద్ద లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరంను మెరుపు వేగంతో పూర్తిచేసిన ఘనత బీఆర్ఎస్ సొంతమన్నారు.
చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు

కాంగ్రెస్ రాబందు పాలన- కేసీఆర్ రైతుబంధు పాలన
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూడా శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తుంటే.. తప్పుడు కేసులు వేసి అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలకు ప్రియాంకగాంధీ బుద్ధిచెప్పాలన్నారు. పెట్టుబడికే కాదు పంట నష్టపోయినా అన్నదాతకు పదివేల సాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ రాబందు పాలనకు కేసీఆర్ రైతుబంధు పాలనకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను తెలంగాణ సమాజం ఎప్పుడో గుర్తించిందన్నారు.

ప్రియాంకు సూచన
2004  కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో పెట్టినప్పుడే తెలంగాణ ఇచ్చి ఉంటే  వందల మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు జరిగి ఉండేవి కాదన్న సత్యాన్ని ప్రియాంకగాంధీ తెలుసుకోవాలన్నారు కేటీఆర్. సుదీర్ఘ ఉద్యమంలో ఏనాడు ప్రజల పక్షాన నిలబడకుండ ఇప్పుడొచ్చి మాట్లాడితే చైతన్యవంతమైన తెలంగాణ సమాజం నమ్ముతుందన్న భ్రమలో ఉండొద్దని హితవు పలికారు. కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణలో సాగుతున్న మానవీయ పాలన గురించి అధికారంలో ఉన్న ఒకటి అరా కాంగ్రెస్ ప్రభుత్వాలకు సోదాహరణంగా వివరించి ప్రజల మెప్పు పొందాలని ప్రియాంకగాంధీకి సూచించారు. 

గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించి
సోనియాగాంధీని బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలన్నారు కేటీఆర్. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ పార్టీనే స్వయంగా వీలునామా రాసుకుందన్నారు. కానీ తెలివిగల్ల తెలంగాణ ప్రజలు తమ చిరకాల స్వప్నమైన రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చేతిలోనే భవిష్యత్తును పదిలంగా భద్రపరుచుకున్న సంగతిని పొలిటికల్ టూరిస్ట్ ప్రియాంకగాంధీ ఈ పర్యటనలో తెలుసుకుంటారని కేటీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement