సోనియా తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా! | Lakshmi Parvathi Fires On Opposition On Jagan Declaration In Tirumala | Sakshi
Sakshi News home page

అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు?

Published Wed, Sep 23 2020 3:35 PM | Last Updated on Wed, Sep 23 2020 4:17 PM

Lakshmi Parvathi Fires On Opposition On Jagan Declaration In Tirumala - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి డిక్లరేషన్ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత నందమూరి లక్ష్మీ పార్వతి విరుచుకుపడ్డారు. ప్రతి ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళంతా ఖాళీగా ఉంటూ ప్రభుత్వంపై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డిక్లరేషన్ పేరుతో అనవసరంగా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు విపక్షాలకు పట్టడం లేదని విమర్శించిన లక్ష్మీ పార్వతి.. మతం పేరుతో ప్రజలని రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ కల్చర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారో అలాగే ఇప్పడు మతం పేరుతో రెచ్చగొడుతున్నారన్నారు. (‘ఆ స్కామ్‌లో లోకేష్‌ అడ్డంగా దొరికారు’)

చంద్రబాబు కాంగ్రెస్ నుండి వచ్చారు కాబట్టి  కాంగ్రెస్‌ సంప్రదాయాలను ఇంకా మర్చిపోలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ నేతలు రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. టీడీపీ నేతలు మాట్లాడినట్లే బీజేపీ నాయకులు మూర్ఖంగా మాట్లాడుతున్నారని, హిందూ సంప్రదాయం చంద్రబాబు ఎప్పుడు పాటించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిందూ మతం పట్ల చంద్రబాబు నమ్మకం ఉంటే ప్రజలకు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రికి డిక్లరేషన్ గురించి మాట్లాడే వారు సోనియా గాంధీ తిరుమల వచ్చినప్పుడు డిక్లరేషన్ అడిగారా అని ప్రశ్నించారు. కాషాయం వేసిన మూర్ఖులు అంతా ఒక చోట చేరారని,, హిందూ అనేది ఒక మతం కాదని, హిందూ అనేది ఒక ధర్మం అన్నారు. మతం పేరు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. (మనసు చంపుకొని టీడీపీలో ఉండలేకపోయా..)

‘లోకేష్‌ను ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం భువనేశ్వరి క్షుద్ర పూజలు చేసింది. అమ్మవారి దేవాలయంలో అర్థరాత్రి క్షుద్ర పూజలు చేయించిన దుర్మార్గురాలు చంద్రబాబు భార్య. బీజేపీకి అస్సలు చిత్తశుద్ధి ఉంటే గతం సంవత్సరంలో కూడా జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తారు. భువనేశ్వరి, లోకేష్ కోసం చేసిన క్షుద్ర పూజల గురించి బీజేపీ నేతలు అడగాలి. ముఖ్యమంత్రికి రాష్ట్రంపై సర్వ హక్కులు ఉంటాయి. రాజు విష్ణువుతో సమానమని పురాణాలు చెప్తున్నాయి. రాజుకు మతాలు అంటగట్టడం దారుణం. బీజేపీ, టీడీపీ నేతలు డిక్లరేషన్ గురించి వాస్తవాలు మాట్లాడాలి. జగన్ ఎప్పుడో హిందువుగా మారారు. గతంలో స్వరూపానంద జగన్‌మోహన్‌రెడ్డిని తీసుకొని గంగా నదిలో పూజలు చేయించారు. గంగా నదిలో మూడు మునకలు మునిగి హిందువుగా మారారు. అలా అని క్రిస్టియానీటిని పక్కన పెట్టినట్లు కాదు. (అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం)

కొందరు స్వామీజీలు కాషాయం ధరించి రాజకీయాలు చేస్తున్నారు. ముస్లింగా ఉన్న  కరీం దాసు, బిబి నాంచారి ఎవరో స్వామిజీలకు తెలీదా. మతం పేరుతో ప్రజలలో హింసను రెచ్చగొట్టి మధ్య యుగంలోకి నెడతారా. కుహనా హిందువులను హెచ్చరిస్తున్నా అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సమాజానికి కావాల్సింది విద్యా, వైద్యం కానీ మతం, కులం కాదు. ఇప్పటికైనా రాజకీయ పక్షాలు అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేయాలి. డిక్లరేషన్ పై బహిరంగ చర్చకు ఎవరితో అయిన నేను సిద్ధం. హిందూ సంప్రదాయం, పురాణాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. నేను ఖురాన్, బైబిల్, భగవద్గీతను నేను చదివాను. సర్వమతాలను నేను ఆరాధిస్తాను’ అని  లక్ష్మీ పార్వతి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement