మెజారిటీ.. మ్యాజిక్‌ ఫిఫ్టీ పంచ్‌ | TS Assembly Polls 2023: A Lead Of More Than Half A Lakh Votes In 33 Seats, Know Who And When Did They Get A Majority - Sakshi
Sakshi News home page

మెజారిటీ.. మ్యాజిక్‌ ఫిఫ్టీ పంచ్‌

Published Mon, Nov 6 2023 3:25 AM | Last Updated on Mon, Nov 6 2023 8:44 AM

A lead of more than half a lakh votes in 33 seats - Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడమంటేనే ఓ కిక్కు..1000లోపు ఓట్లతో గెలిస్తే అబ్బా..చాలా తక్కువ మెజారిటీ వచ్చిందే.. అయినా బుల్లెట్‌ దిగిందా లేదా.. అంటారు. 10వేలు దాటితే ఫర్వాలేదంటారు..20వేలు దాటితే ఇరగదీశాడని మెచ్చుకుంటారు..30వేలు దాటితే ఏదో మ్యాజిక్‌ చేశాడంటారు..40వేలు దాటిందంటే నెవర్‌ బిఫోర్‌ అని సర్టిఫికెట్‌ ఇచ్చేస్తారు..అదే 50వేల మెజారిటీ దాటిందంటే...ఇక ఆ కిక్కే వేరు. లాస్ట్‌ పంచ్‌ మనదైతే ఎంత కిక్కు ఉంటుందో 50వేల మెజారిటీ దాటిందంటే అంతకంటే ఎక్కువే కిక్కొస్తుంది.  

తెలంగాణలో జరిగిన అనేక ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ఈ కిక్కు.. అదే ఘనత సాధించారు. ఆ జాబితాలో సీఎం కేసీఆర్‌తో సహా పలువురు రాష్ట్రమంత్రులు, కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. కొన్ని స్థానాల్లో అయితే వరుసగా రెండు, మూడు దఫాలుగా ఒకే అభ్యర్థికి 50వేల కంటే ఎక్కువ మెజారిటీ ఇస్తున్నారు ఆయా నియోజకవర్గాల ప్రజలు. ఇక మరో విశేషమేమిటంటే... ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఏ పార్టీకి చెందిన అభ్యర్థికి కూడా 50వేల మెజారిటీ రాలేదు. అంటే ఆయా స్థానాల్లో మరీ ఏకపక్షంగా పోలింగ్‌ ఎప్పుడూ జరగదని, ఎన్నికలెప్పుడు జరిగినా సీన్‌ సితారేనని అర్థమవుతోంది. 

ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు, ఎప్పుడు 50 వేల కంటే ఎక్కువ మెజారిటీ సాధించారంటే
2014 ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి చిన్నం దుర్గయ్య (టీఆర్‌ఎస్‌) తన సమీప ప్రత్యర్థి గుండా మల్లేశ్‌ (సీపీఐ)పై 52,528 ఓట్ల ఆధిక్యత సాధించారు.  
 ఇవే ఎన్నికల్లో మంచిర్యాల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ది­వాకర్‌రావు తన ప్రత్యర్థి అరవింద్‌రెడ్డి (కాంగ్రెస్‌)పై 59,250 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే, 2010లో జరిగిన ఉప ఎన్నికలో అరవింద్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జి. హనుమంతరావు (టీడీపీ)పై ఏకంగా 78,047 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  
♦ 2011లో జరిగిన ఉప ఎన్నికలో బాన్సువాడ నుంచి పోచారం శ్రీనివాస్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) సరిగ్గా 50వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై గెలిచారు.
2004లో కామారెడ్డి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన షబ్బీర్‌అలీ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మురళీధర్‌గౌడ్‌పై 52,763 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  
♦ 2010 ఉప ఎన్నికలో కోరుట్ల నుంచి జువ్యాడి రత్నా­క­ర్‌రావు (కాంగ్రెస్‌)పై కె.విద్యాసాగర్‌రావు (టీఆర్‌ఎస్‌) 56,525 ఓట్ల మెజారిటీతో గెలిచారు.  
 2018లో జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్‌కుమార్‌ (టీఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 61,125 ఓట్ల ఆధిక్యత సాధించారు.  
♦ 2010 ఉప ఎన్నికలో ధర్మపురి నుంచి గెలిచిన కొప్పుల ఈశ్వర్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై 58,891 ఓట్ల ఆధిక్యత లభించింది. అదే 2018 ఎన్నికల్లో ఈశ్వర్‌ కేవలం 441 ఓట్ల తేడాతో అదే లక్ష్మణ్‌కుమార్‌పై విజయం సాధించడం గమనార్హం. ఇక కొప్పుల ఈశ్వర్‌ 2004 ఎన్నికల్లో రామగుండం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 56,563 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి మూలం మల్లేశంపై గెలిచారు.  
పెద్దపల్లి నియోజకవర్గంలో 2014లో జరిగిన ఎన్నికల్లో దాసరి మనోహర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌) 62,677 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్‌ అభ్యర్థి భానుప్రసాదరావుపై గెలిచారు.
♦ చొప్పదండిలో 2014లో బొడిగె శోభ (టీఆర్‌ఎస్‌) తన సమీప ప్రత్యర్థి సుద్దాల దేవయ్య (కాంగ్రెస్‌)పై 54,981 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  
♦ 2010 ఉప ఎన్నికలో వేములవాడ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌ 50,451 ఓట్ల మెజారిటీ సాధించారు.  
హుజూరాబాద్‌ నుంచి 2010 ఉప ఎన్నికల్లో 79,227, 2014 సాధారణ ఎన్నికల్లో 57,037 ఓట్ల మెజారిటీని ఈటల రాజేందర్‌ సాధించ
గ లిగారు.  
♦ నారాయణ్‌ఖేడ్‌లో 2016 ఉప ఎన్నిక, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి వరుసగా 53,625 ఓట్లు, 58,508 ఓట్ల ఆధిక్యత సాధించారు. 
♦ నాగర్‌కర్నూల్‌లో మర్రి జనార్దనరెడ్డి 2018 ఎన్నికల్లో 54354 ఓట్ల తేడాతో నాగం జనార్దనరెడ్డి (కాంగ్రెస్‌)పై గెలిచారు. 
♦ దుబ్బాక నియోజకవర్గంలో సోలిపేట రాంలింగారెడ్డి (టీఆర్‌ఎస్‌) తన సమీప ప్రత్యర్థి నాగేశ్వర్‌రెడ్డి (కాంగ్రెస్‌)పై 66,421 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 
♦ సంగారెడ్డిలో 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కె. సదాశివరెడ్డి తన ప్రత్యర్థి పి. రామచంద్రారెడ్డి (కాంగ్రెస్‌)పై 57,550 ఓట్ల మెజారిటీ సాధించారు. 

గ్రేటర్‌ హైదరాబాద్‌లోనూ.. 
♦ 2018 ఎన్నికల్లో మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావు (టీఆర్‌ఎస్‌) 73,968 ఓట్ల మెజారిటీ సాధించారు.  
♦ రాజేంద్రనగర్‌లో ప్రకాశ్‌గౌడ్‌ 2018 ఎన్నికల్లో 57,331 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల్లో అరికెపూడి గాంధీ తన సమీప ప్రత్యర్థి శంకర్‌గౌడ్‌ పై శేరిలింగంపల్లి నుంచి 75,904 ఓట్ల ఆధిక్యత సాధించారు.  
♦ ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వై. సుధాకర్‌రెడ్డిపై 62,598 ఓట్ల ఆధిక్యత సాధించారు. 
పాతబస్తీలో అలవోకగా లక్ష ఓట్ల మెజారిటీ 
♦ చార్మినార్‌ స్థానం నుంచి అసదుద్దీన్‌ ఓవైసీ 1999లో 93,505 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం నుంచే పోటీ చేసిన అహ్మద్‌ పాషా ఖాద్రి తన సమీప ప్రత్యర్థి తయ్యబా తస్లీం (టీడీపీ)పై 1,07,921 ఓట్ల మెజారిటీతో గెలిచారు.  
♦ చాంద్రాయణగుట్ట నుంచి అక్బరుద్దీన్‌ ఒవైసీ (ఎంఐఎం) గత రెండు ఎన్నికల్లోనూ 50వేల కంటే ఎక్కువ మెజా రిటీ సాధించారు. 2014లో 59,279 ఓట్లు, 2018లో 80,263 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.  
♦ బహుదూర్‌పుర నుంచి మౌజంఖాన్‌ వరుసగా మూడుసార్లుగా 50వేల కంటే ఎక్కువ ఓట్ల ఆధిక్యత సాధిస్తున్నారు. 2009లో 56,735  ఓట్లు, 2014లో 95,045 ఓట్లు, 2018లో 82,518 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 

గత ఎన్నికల్లో అరలక్ష దాటిన మంత్రులు 
♦ ప్రస్తుతం మంత్రిగా ఉన్న వి.శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌  నుంచి 2018 ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఎం.చంద్రశేఖర్‌ (టీడీపీ)పై 57,775 ఓట్ల మెజారిటీ సాధించారు.  
♦ ఇదే ఎన్నికల్లో వనపర్తి నుంచి మరో మంత్రి ఎస్‌. నిరంజన్‌రెడ్డి 51,685  ఓట్ల మెజారిటీతో గెలిచారు.  
♦ పాలకుర్తి నుంచి ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాఘవరెడ్డిపై 53,053 ఓట్ల ఆధిక్యత సాధించారు. 
♦ మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి 2018 ఎ­న్ని­కల్లో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కాంగ్రెస్‌)పై 88,066 ఓట్ల ఆధిక్యత సాధించారు. 

అత్యధిక మెజారిటీ రికార్డు విష్ణుదే 
ఉమ్మడి ఏపీలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ మంత్రి పీజేఆర్‌ తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి అత్యధిక మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడంతో లోక్‌సత్తా అభ్యర్థి కఠారి శ్రీనివాసరావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యత సాధించారు.  

మెజారిటీ పెంచుకుంటూ కేటీఆర్‌..  లక్ష దాటిన హరీశ్‌ 
రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల నుంచి మూడోసారి వరుసగా భారీ మెజారిటీ సాధించారు. 2009లో కేవలం 171 ఓట్లతో గెలిచిన ఆయన 2010 ఉప ఎన్నికల్లో ఏకంగా 68,220 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో 53,004 ఓట్లు, 2018లో 89,009 ఓట్ల మెజారిటీ సాధించడం గమనార్హం.

సిద్దిపేట నుంచి మరో మంత్రి హరీశ్‌రావు కూడా వరుసగా ఐదుసార్లు 50 వేల కంటే ఎక్కువ మెజారిటీ సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో 58,935, 2009లో 64,677, 2010 ఉప ఎన్నికల్లో 95,858, 2014లో 93,328 మెజారిటీ సాధించగా, ఇక, 2018 ఎన్నికల్లో ఆయన ఆధిక్యత లక్ష ఓట్లు దాటింది. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డి (కాంగ్రెస్‌)పై 1,18,699 ఓట్ల మెజార్టీతో గెలిచి తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించారు. 

ఒక్కసారే కేసీఆర్‌కు.. 
సీఎం కేసీఆర్‌ మాత్రం 50 వేల  కంటే ఎక్కువ మెజారిటీతో ఒకే ఒక్కసారి గెలిచారు. 2018 ఎన్నికల్లో వి.ప్రతాప్‌రెడ్డి (కాంగ్రెస్‌)పై 56,922  ఓట్ల ఆధిక్యత సాధించారు. 

లక్షకు దగ్గరగా ఆరూరి రమేశ్‌ 
వర్ధన్నపేటలో ఆరూరి రమేశ్‌ వరుసగా రెండుసార్లు 50 వేల ఓట్ల మెజారిటీ  సాధించారు. 2014లో 86,349  ఓట్లు, 2018లో 97,670 ఓట్ల  ఆధిక్యత ఆయనకు లభించింది. 

వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గం నుంచి దాస్యం వినయ్‌భాస్కర్‌ 2014 ఎన్నికల్లో 56,304 ఓట్ల ఆధిక్యత సాధించారు. అంతకుముందు జరిగిన 2010 ఉప ఎన్నికల్లో 
67,524 ఓట్ల మెజారిటీ ఆయనకు వచ్చింది.  

ఈస్ట్‌ నుంచి 2014 ఎన్నికల్లో కొండా సురేఖ 55085 ఓట్ల ఆధిక్యతతో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచారు. 


-మేకల కళ్యాణ్‌ చక్రవర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement