లక్నో: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదిపార్టీని ఏర్పాటు చేసి, రామ రాజ్యాన్ని నిర్మిస్తామని అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీకి చెందిన బహ్రైచ్‌లోని నాన్‌పరా సిట్టింగ్ ఎమ్మెల్యే మాధురీ వర్మ సమాజ్‌వాది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాగా, సమాజ్‌వాది పార్టీలో క్రిమినల్స్, గ్యాంగ్‌స్టర్లున్నారనే బీజేపీ ఆరోపణలపై.. అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు.
బీజేపీ నేరస్థులను, మాఫియా డాన్‌లను ప్రక్షాళన చేయడానికి వాషింగ్‌మెషిన్‌లను కొనుగోలు చేసిందా అంటూ వ్యంగ్యంగా స్పందించారు. శ్రీ కృష్ణుడు ప్రతిరోజు తనకలలో వస్తారని.. తాను రోజు ఆయనతో మాట్లాడతానన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ గెలుస్తుందని కృష్ణుడు కూడా అన్నారని పేర్కొన్నారు. అదే విధంగా, పొరుగు దేశం చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల పేర్లు మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. మన సీఎంని చూసి వారు కూడా గ్రామాల పేర్లు మారుస్తున్నారని తెలిపారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రాను యూపీ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై ఎస్పీ చీఫ్ స్పందించారు. యోగి నిద్రలో మత్తులో ఉండగా, ఆయన చీఫ్ సెక్రెటరీ మారిపోయారా.. అంటూ వ్యంగ్యంగా చమత్కరించారు.
ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గృహవినియోగ దారులకు 300ల యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు. అదేవిధంగా, 2012 నుంచి 2017 వరకు ఎస్పీ తమ హయంలో అనేక విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తుచేశారు. బీజేపీ వాటిని పూర్తి చేయలేదని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని అఖిలేష్‌యాదవ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment