Maharashtra Political Crisis Live Updates Telugu - Sakshi
Sakshi News home page

అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సీఎం ఉద్దవ్‌ ఠాక్రే

Published Wed, Jun 22 2022 9:46 AM | Last Updated on Wed, Jun 22 2022 9:54 PM

Maharashtra Political Crisis LIVE Updates Telugu - Sakshi

Maharashtra Political Crisis Updates:

►సీఎంగా దిగిపోవడానికి తాను సిద్ధమని ప్రకటించిన ఉద్దవ్‌ ఠాక్రే బుధవారం రాత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.

సీఎంగా దిగిపోవడానికి సిద్ధం: ఉద్దవ్‌ ఠాక్రే
►మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రసంగించారు. సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్‌ అయ్యానని తెలిపారు. రెబల్‌ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటానని పేర్కొన్నారు. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉందన్న సీఎం.. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని గవర్నర్‌కు కూడా తెలియజేశానని చెప్పారు. తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందన్నారు.

►  ‘శివసేన చీఫ్‌గా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను చేసిన తప్పేంటో రెబల్‌ ఎమ్మెల్యేలు చెప్పాలి. సీఎం నివాస గృహం వర్షను ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. చర్చలకు రావాలని రెబల్‌ ఎమ్మెల్యేలను‌, ఏక్‌నాథ్‌ షిండేను ఆహ్వానిస్తున్నా. నేను నమ్మకద్రోహానికి గురయ్యాను. నాతో ఏక్‌నాథ్‌ షిండే నేరుగా మాట్లాడాలి. శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేను.’ అని ఉద్ధవ్‌ ఠాక్రే స్పష్టం చేశారు.

కిడ్నాప్‌ చేశారు
►రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండేతో కలిసి సూరత్‌ వెళ్లిన శివసేన ఎమ్మెల్యే నితిన్‌ దేశ్‌ముఖ్‌ అక్కడి నుంచి తిరిగి మహారాష్ణ చేరుకున్నారు. నాగ్‌పూర్‌ ఎయిర్‌పోర్టులో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని ఆరోపించారు. బలవంతంగా ఆసుపత్రిలో చేర్పించి తనకు గుండెపోటు రానప్పటికీ ఇంజెక్షన్లు ఇచ్చారని పేర్కొన్నారు. సూరత్‌ నుంచి తప్పించుకొని సురక్షితంగా బయటపడ్డానని అన్నారు. తను శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేకు మద్దతుగా ఉన్నానని స్పష్టం చేశారు. 

శివసేన అల్టిమేటంపై తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాత్‌ షిండే స్పందించారు. శివసేన చీఫ్‌ విప్‌ సునీల్‌ ప్రభు లెటర్‌ చెల్లదని ఏక్‌నాథ్‌ అన్నారు. శివసేన చీఫ్‌ విప్‌ను ఏక్‌నాథ్‌ షిండే మార్చారు. చీఫ్‌విప్‌గా భరత్‌ గోగ్‌వాలేనునియమించారు. ఈ తీర్మాణంపై 34 మంది ఎమ్మెల్యే సంతకాలు చేశారు.

►ఉద్దవ్‌ వర్గానికి విప్‌ జారీ చేసే అధికారం లేదని ఏక్‌నాథ్‌ షిండే అన్నారు.  ఉద్దవ్‌ నివాసంలో జరిగే ఎమ్మెల్యేల భేటీ రాజ్యంగ విరుద్దమన్నారు. ఈ సందర్భంగా ఉద్ధవ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నట్లు తెలిపారు.

శివసేన అల్టీమేటం
►రెబల్‌ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం జారీ చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోపు ఎమ్మెల్యేలు సమావేశానికి రావాలని విప్‌ జారీ చేసింది. రాకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని శివసేన వార్నింగ్‌ ఇచ్చింది

ఉద్దవ్‌ ఠాక్రేకు కరోనా
►మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఉద్దవ్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఉద్దవ్‌కు కరోనా కారణంగా కలవలేకపోయానని కమల్‌నాథ్‌ తెలిపారు. ఇప్పటికే కరోనాతో మహారాష్ట్ర గవర్నర్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. దీంతో గోవా గవర్నర్‌ శ్రీధరన్‌ పిల్లైకు మహారాష్ట్ర ఇంచార్జ్‌ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించారు.

మహారాష్ట్ర కేబినెట్‌ భేటీ
► మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే రాజీనామాపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మరోవైపు మహారాష్ట్ర కేబినెట్‌ వర్చువల్‌గా భేటీ అయ్యింది. కేబినెట్‌ సమావేశానికి 8 మంది మంత్రులు హాజరు కాలేదు. కేబినెట్‌కు గైర్హాజరైన మంత్రులు..
1. ఏక్‌నాథ్‌ షిండే.
2. గులాబ్‌దావ్‌ పాటిల్‌
3. దాదాభూషే
4. సందీపన్‌ బుమ్రే
5. అబ్దుల్‌ సత్తార్‌
6. శంభూరాజ్‌ దేశామ్‌
7. బచ్చు కాడు
8. రాజేంద్ర యడ్రావ్కర్‌

► మహారాష్ట్ర రాజకీయాల్లో గంట గంటలో మలుపు చోటు చేసుకుంటోంది. అస్సాం గౌహతి హోటల్‌లో తన మద్దతుదారులతో మకాం వేసిన శివ సేన రెబల్‌ గ్రూప్‌ సారధి ఏక్‌నాథ్‌ షిండేకు ఊహించని షాక్‌ తగిలింది. మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారి కరోనాతో ఆస్పత్రి పాలయ్యారు. 

మహారాష్ట్ర గవర్నర్‌కు కరోనా
►బుధవారం మధ్యాహ్నం ముంబైకి వెళ్లి.. మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కావాలని షిండే వర్గం అనుకుంది. ఈలోపే ఆయన కరోనాతో ఆస్పత్రి పాలవ్వడం గమనార్హం. ఎనభై ఏళ్ల కొష్యారి.. ముంబైలోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో బుధవారం చేరారు.నిరంతరం మాస్క్‌లోనే కనిపించే ఆయన వైరస్‌ బారిన పడడం, అదీ షిండే భేటీ నేపథ్యానికి కంటే కాస్త ముందే కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

► మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం ఉద్ధవ్‌ థాక్రే అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరుగనుంది.

► మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్‌ వేదికగా స్పష్టం చేశారు. 

► సీఎం ఉద్ధవ్‌ థాక్రే కుమారుడు.. ఆదిత్య థాక్రే తన ట్వి‍ట్టర్‌ ఖాతాలో మంత్రి హోదాను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

► శివ సేన ఎమ్మెల్యేల నుంచి మరో ఇద్దరు ఏక్‌నాథ్‌ షిండే గ్రూప్‌లోకి జంప్‌ కొట్టారు. దీంతో షిండే వర్గీయుల సంఖ్య 46కు చేరింది.
 
► మహారాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఛార్టెర్డ్‌ ఫ్లైట్‌లో బుధవారం ఉదయం సూరత్‌(గుజరాత్‌) నుంచి గౌహతి(అసోం) చేరుకున్న శివ సేన రెబల్స్‌ ఓ హోటల్‌లో దిగారు. అయితే శివ సేన నేత ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో వీళ్లంతా తిరిగి ముంబైకి వెళ్లనున్నట్లు సమాచారం. 

► తన మద్దతుదారులతో(దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు!) ప్రత్యేక ఫ్లైట్‌లో ముంబైకి చేరనున్న ఏక్‌నాథ్‌ షిండే.. మధ్యాహ్నం తర్వాత మహారాష్ట్ర గవర్నర్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక షిండేతో నేరుగా ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నారు సీఎం ఉద్దవ్‌ థాక్రే.

► ఎన్సీపీ, కాంగ్రెస్‌ జట్టు వీడి.. తిరిగి బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏక్‌నాథ్‌ షిండ్‌ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కూటమిలోని ఇరు పార్టీలు ఈ సంక్షోభాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement